ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 9 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయము

 1. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను. అసత్యము పలుకుటలేదు.

2. నేను ఎంతగా విచారించుచున్నానో నా హృదయవేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చు చున్నది.

3. నా రక్తసంబంధులైన నా ప్రజలకొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తునుండి వేరుచేయబడినచో బాగుండెడిది.

4. దేవుడు ఎన్నుకొనిన యిస్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగ చేసికొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసికొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే.

5. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.

6. దేవుని వాగ్దానము విఫలమైనదని నేను చెప్పుటలేదు. ఏలయన, యిస్రాయేలు ప్రజలందరును వాస్తవముగా యిస్రాయేలీయులు కారు.

7. అట్లే అబ్రహాము సంతతియైనంత మాత్రమున అందరు ఆయన బిడ్డలు కారు. కాని, “ఈసాకు సంత తియే నీ వారుగ పరిగణింపబడుదురు” అని దేవుడు అబ్రహాముతో పలికియుండెను.

8. అనగా, శారీరకముగ జన్మించిన వారందరు దేవుని బిడ్డలు కారు అని దీని అర్థము. దేవుని వాగ్దాన ఫలముగ జన్మించిన బిడ్డలు మాత్రమే ఆయన సంతతిగ పరిగణింపబడుదురు.

9. ఏలయన, “దాదాపు ఇదే సమయమున నేను మరల వచ్చెదను. అప్పుడు సారాకు ఒక కుమారుడు కలుగును” అని దేవుడు వాగ్దానము చేసెను.

10. అంతేకాదు! రిబ్కా పుత్రులు ఇరువురును మన మూలపురుషుడగు ఈసాకు సంతానమే.

11-12. కాని, “మొదటివాడు రెండవవానికి సేవకు డగును” అని దేవుడు ఆమెతో పలికెను. ఇట్లు ఒకనినే ఎన్నుకొనుట పూర్తిగా దేవుని ఉద్దేశము. వారి జననమునకు పూర్వమే, వారు మంచికాని, చెడుగుకాని చేయక పూర్వమే, దేవుడు అటుల పలికెను. కనుక దేవుని ఎన్నిక, అతని పిలుపును అనుసరించినదే కాని చేతలను అనుసరించినది కాదు.

13. కనుకనే లేఖ నమున “నేను యాకోబును ప్రేమించితిని కాని ఏసావును ద్వేషించితిని” అని చెప్పబడియున్నది.

14. కనుక మనము ఏమందుము? దేవుడు న్యాయము లేని వాడందుమా? ఎంత మాత్రమును కాదు.

15. ఏలయన, “నాకు దయకలిగిన వానిపై దయచూపుదును, నాకు జాలికలిగిన వానిపై జాలివహింతును” అని దేవుడు మోషేతో పలికియుండెను.

16. కనుక మానవ ఇష్టముపై కాని లేక ఒకడు చేయు పనిపై కాని కాక, అది దేవుని కనికరముపై మాత్రమే ఆధారపడియుండును.

17. ఏలయన, “నీయందు శక్తి ప్రదర్శింపబడవ లెనని, నానామము ప్రపంచమునందంతటను చాటబడ వలెననెడి ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసితిని” అని లేఖనము ఫరోతో పలుకుచున్నది.

18. కనుక తన ఇష్టము వచ్చిన వారిపై దేవుడు కనికరము చూపును. తన ఇష్టము వచ్చిన వారి హృదయములను కఠినపరచును.

19. “అటులైనచో దేవుడు ఇంకను ఎందుకు మానవునియందు తప్పుపట్టును? ఏలయన, దైవ సంకల్పమును ఎవడు ఎదుర్కొనగలడు?” అని మీలో ఎవరైన పలుకవచ్చును.

20. కాని మిత్రమా! దేవునికి ఎదురు పలుకుటకు నీవు ఎవడవు? “నీవు నన్ను ఇట్లు ఎందుకు చేసితివి? "అని చేయబడినది, చేసినవానిని అడుగగలదా!

21. మట్టిని తన ఇష్టము వచ్చినట్లు ఉపయోగించుకొనుటకును, ఒకే మట్టి ముద్దనుండి రెండుకుండలు చేయుటకు, అనగా వెలయైన కుండను, వెలతక్కువ కుండను చేయుటకును కుమ్మరికి హక్కులేదా?

22. దేవుడు చేసినది కూడ ఇట్లే. ఆయన తన ఆగ్రహమును, శక్తిని ప్రదర్శింపనెంచెను. కనుకనే తన ఆగ్రహమునకు గురియై నాశనము చేయబడవలసిన వారిని సహించుటలో ఆయన ఎంతయో ఓర్పును ప్రదర్శించెను.

23. అంతే కాదు, ఆయన కృపకు పాత్రులమై ఆయన మహిమలో పాలుపంచుకొనుటకు సిద్ధపరుపబడిన మనపై ఆయన మహత్తరమైన తన మహిమను ప్రదర్శింపనెంచెను.

24. ఏలయన, ఆయనచే పిలువబడినవారము మనమే. యూదుల నుండియేకాక అన్యజనులనుండియు ఆయన మనలను పిలిచెను.

25. ఎలయన, హోషేయ గ్రంథములో ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. "నా ప్రజలు కాని వారిని 'నాప్రజలు' అని పిలుతును. నేను ప్రేమింపని ఆమెను 'నా ప్రియురాలు' అని పిలుతును"

26. 'మీరు నా ప్రజలు కాదు' అని వారికి చెప్పిన చోటనే, వారు 'సజీవుడగు దేవుని పుత్రులు' అని పిలువబడుదురు."

27. "యిస్రాయేలు ప్రజలు సముద్రతీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులైనను, వారిలో కొలదిమంది మాత్రమే రక్షింపబడుదురు;

28. ఏలయన, త్వరలోనే దేవుడు సమస్త ప్రపంచముతోను లెక్క తేల్చుకొననున్నాడు" అని యిస్రాయేలును గూర్చి యెషయా బిగ్గరగా పలికెను.

29. గతమున యెషయా చెప్పిన ప్రకారమే, “సర్వ శక్తిమంతుడగు ప్రభువుకొంత సంతతిని మనకు విడిచి పెట్టి యుండకున్నచో, మనము సొదొమ గొమొఱ్ఱాలవలె వుందుము.”

30. అయినచో మనము ఏమందుము? నీతిని పొంద ప్రయత్నింపని అన్యజనులు, దేవుని నీతిని పొందిరి. అయితే ఈ నీతి విశ్వాసమువలన కలిగినదే.

31. ధర్మశాస్త్రముపై ఆధారపడియున్న నీతికొరకై ప్రయత్నించిన ఆ యిస్రాయేలు ప్రజలు దానిని నెర వేర్చుటయందు విఫలులైరి అని పలుకుదము.

32. మరి ఏల? ఏలయన, వారి ప్రయత్నము విశ్వాసముపై కాక, క్రియలపై ఆధారపడియుండెను. “అడ్డు రాయి” తగిలి వారు పడిపోయిరి.

33. “ఇదిగో! ప్రజలు కాలు జారిపడునట్లు ఒక రాతిని, తొట్రుపడునట్లు ఒక బండను నేను సియోనులో ఉంచుచున్నాను. కాని ఆయనయందు విశ్వాసము కలవాడు సిగ్గుపరుపబడడు” అని లేఖనము చెప్పుచున్నది.