ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 8 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము

 1. క్రీస్తు యేసుతో ఏకమై జీవించువారికి ఇప్పుడు ఏ దండనయు లేదు.

2. ఏలయన, క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చెడి ఆత్మ యొక్క చట్టము, పాపమును, మృత్యువును కలిగించు చట్టమునుండి నాకు విముక్తిని ప్రసాదించెను.

3. మానవస్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతియందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరమువంటి స్వభావముతో వచ్చెను.

4. శరీరమును అనుసరించికాక, ఆత్మానుసారులమై జీవించు మనయందు ధర్మశాస్త్రముయొక్క నైతికవిధి పూర్తిగా నెరవేరుటకుగాను దేవుడు ఇట్లు చేసెను.

5. ఏలయన, శరీరమును అనుసరించి జీవించువారు, శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైనవారు, ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులు అర్పింతురు.

6. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును. ఆత్మెక వాంఛలు జీవమునకు, శాంతికి దారితీయును.

7. ఏలయన, శరీరేచ్చపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగియుండలేదు.

8. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు.

9. మీయందు నిజముగ దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు గాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తుఆత్మ తనయందు లేనివాడు ఆయనకు చెందడు.

10. క్రీస్తు మీయందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించి నది. కాని, ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది.

11. క్రీస్తును మరణమునుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మవలన నశించు మీ మర్త్యశరీరములకు కూడ జీవమును ఒసగును.

12. కనుక సోదరులారా! మనము బద్దులమైనది శరీరానుసారము జీవించుటకుకాదు.

13. ఏలయన, మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కాని, ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు.

14. దేవుని ఆత్మవలన నడుప బడువారు దేవుని పుత్రులు.

15. ఏలయన, దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము.

16. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును.

17. మనము పుత్రులము కనుక వారసులము, నిజముగ మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలుపంచుకొనిన యెడల ఆయన మహిమలో కూడ మనము భాగస్తులము అగుదుము.

18. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవికావు.

19. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టియంతయు ఆతుర తతో ఎదురుచూచుచున్నది.

20. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పముచే అటుల జరుగ లేదు. దైవసంకల్పము చేతనే నిరీక్షణయందు అట్లైనది.

21. ఏలయన, సృష్టియే వినాశనదాస్యమునుండి విడిపింపబడి దేవునిపుత్రుల మహిమోపేతమైన స్వాతంత్య్రము నందు పాలుపంచుకొనును.

22. ఏలయన, ఇప్పటివరకును సృష్టి అంతయు ప్రసవవేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియును.

23. కాని సృష్టి మాత్రమే కాదు. ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము గూడ, దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరముయొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు, మనలో మనము మూలుగుచున్నాము.

24. ఏలయన, నిరీక్షణవలననే మనము రక్షింపబడితిమి. కాని, మనము దేనికొరకు నిరీక్షించు చుంటిమో దానిని చూచినచో, అది నిజముగ నిరీక్షణ కాదు. ఏలయన, తాను చూచుచున్న దానికొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును?

25. కాని మనము చూడని దానికొరకై నిరీక్షించినచో, దానికొరకై మనము ఓర్పుతో వేచియుందుము.

26. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడ సాయపడును. ఏలయన, మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును.

27. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును. ఏలయన, దేవుని సంకల్పానుసారముగ దైవప్రజలకొరకై ఆత్మ దేవుని ప్రార్ధించును.

28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడినవారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును.

29. తాను ఎన్నుకొనినవారు, తన కుమారుని సారూప్యమును గలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేకమంది. దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును.

30. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగ చేసెను. నీతి మంతులనుగ చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలుపంచి ఇచ్చెను.

31. ఇవి అన్నియు తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు?

32. ఆయన తన సొంత కుమారుని కూడ మన అందరికొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడ మనకు ఉచితముగా ఇచ్చివేయడా?

33. ఎన్నికయైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగ ప్రకటించును గదా!

34. అయినచో శిక్షవిధించువాడు ఎవడు? క్రీస్తుయేసే! ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి, దేవుని కుడిప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మనకొరకై విజ్ఞాపన చేయువాడు.

35. కనుక క్రీస్తు యొక్క ప్రేమనుండి మనలను ఎవరు వేరుచేయగలరు? బాధగాని, కష్టముగాని, హింసగాని, క్షామము గాని, వస్తహీనతగాని, ప్రమాదముగాని, యుద్ధము గాని, మరణముగాని అట్లు చేయకలదా?

36. లేఖనము నందు వ్రాయబడినట్లుగ, “నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడనున్న గొఱ్ఱెలవలె ఎంచబడుచున్నాము.”

37. అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా!

38. ఏలయన, మన ప్రభువైన క్రీస్తు యేసుద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువుగాని, జీవముగాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులుగాని, ఇక్కడ ఉన్నవిగాని, రానున్నవిగాని, శక్తులుగాని,

39. ఊర్ధ్వలోకముగాని, అథోలోకముగాని, సృష్టిలో మరి ఏదియు వేరుచేయ జాలదనుట నాకు నిశ్చయమే.