ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 5 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. కనుక, విశ్వాసమువలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి.

2. ఈనాడు మనకు నిలయమైయున్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసి కొనివచ్చెను. కనుక దేవుని మహిమలో పాలుపంచు కొను ఆశతో మనము అతిశయించుచున్నాము!

3. అంతేకాదు! మన బాధలలో కూడ మనము అతిశయించుదము. ఏలయన, కష్టములు ఓర్పును,

4. ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును.

5. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన, దేవుడు దానముగ మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను.

6. మనము బలహీనముగ ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనులకొరకై క్రీస్తు మరణించెను.

7. ఎందువలన? నీతిమంతుని కొరకు కూడ ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశః సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడు నేమో.

8. కాని, మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించుటనుబట్టి, దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు.

9. ఆయన రక్తమువలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహమునుండి ఆయన మనలను ఇంకను ఎంతగ రక్షించునో గదా!

10. మనము శత్రువులుగా ఉన్నపుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన పరచుకొనెనన్నచో, మరి ఇపుడు దేవునితో సమాధాన పరపబడినవారమై, ఆయన జీవించుటను బట్టి ఎంత గానో రక్షింపబడుదుము.

11. అంతేకాదు ఇపుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము.

12. ఇందునుబట్టి, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగ మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయన మానవులందరును పాపము కట్టుకొనిరి.

13. ధర్మ శాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కాని ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగ పరిగణింప బడలేదు.

14. కాని, ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరిని పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతనివలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్నవారికి ఆదాము ఒక చిహ్నమాయెను.

15. కాని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలమంది మరణించిరనుట నిజమే. కాని దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అను గ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును.

16. కాని దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాపఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కాని ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది.

17. మృత్యువు ఒక్కని పాపము మూలముననే వచ్చినదై, ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున, దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందు వారు జీవముగలవారై నిశ్చయముగ యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు.

18. కనుక, ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికిని విముక్తిని ప్రసాదించి, వారికి జీవమును అను గ్రహించుచున్నది.

19. ఆ ఒక్కమానవుని అవిధేయత ఫలితముగ అనేకులు పాపాత్ములుగ చేయబడినట్లే, ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగ అనేకులు నీతిమంతులగుదురు.

20. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కాని పాపము ఎచ్చట పెరిగెనో, అచ్చట దేవుని కృపావరములు అంతకంటెను అధికమయ్యెను.

21. కనుక పాపము మృత్యువువలన పరిపాలించు నట్లే, దేవుని అనుగ్రహము, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు, నీతి మూలముగ పరిపాలించును.