ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 3 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. అయినచో అన్యజనుల కంటె యూదులకున్న గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?

2. ఎటు చూచినను అధికమే! దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించిన విషయము మొదటిది.

3. వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని విశ్వసనీయతను భంగపరచునా?

4. ఎన్నటికిని కాదు! ప్రతివ్యక్తి అసత్య వాదియైనను దేవుడు మాత్రము సత్యశీలి. ఏలయన, “నీవు మాటలలో సత్యవంతుడవని ప్రదర్శింపబడవలెను. నీవు తీర్పు చేయబడినపుడు గెలుపొందవలెను” అని వ్రాయబడియున్నది. ..

5. కాని, మనదుర్నీతి దేవుని నీతిని స్థాపించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందుము? మనలను ఆగ్ర హించు దేవుడు తన ధర్మమును అతిక్రమించెనని అందుమా? నేను ఇట వాస్తవముగా మానవతీరున మాట్లాడుచున్నాను.

6. అది ఎన్నటికిని కాదు! అటులయినచో దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు చెప్పును?

7. నా అసత్యము దేవుని సత్యమును ప్రబ లించుచు, ఆయన వైభవమునకు తోడ్పడుచున్నది గదా! అటులయిన ఆయన నన్ను ఏల ఇంకను పాపిగా తీర్పుచేయును?

8. అటులైన మేలు కలుగుటకే కీడు చేయుదమని కొందరు మమ్ము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు.

9. అయినచో, మనము అన్యజనుల కంటె ఏమైన గొప్పవారమా? లేదే! యూదులును, గ్రీకులును అందరును ఒకే విధముగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చూపితిని గదా!

10. ఏలయన వ్రాయబడిన ప్రకారము: “నీతి మంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడును లేడు.

11. దేవుని గ్రహించువాడును, అన్వేషించువాడును ఒక్కడును లేడు.

12. అందరును దేవునికి దూరమైన వారే. అందరును దుర్మార్గులే. ఒక్కడును మంచి చేయడు, ఏ ఒక్కడును చేయడు.

13. వారి గొంతు తెరువబడిన సమాధివలె ఉన్నది. వారు మాటలతో మోసపుచ్చుదురు. వారి పెదవులయందు సర్పవిషము ఉన్నది.

14. వారి నోళ్ళు శాపములతోను, ద్వేషముతోను నిండిఉన్నవి.

15. వారి పాదములు రక్తపాతమునకై పరుగులెత్తుచున్నవి.

16. వారు పాదముంచిన ప్రతిస్థలమున వినాశము, దౌర్భాగ్యము అనునవియే మిగులును.

17. శాంతిపథము వారికి తెలియదు.

18. దేవునకు భయపడుటయు వారు ఎరుగరు”.

19. ధర్మశాస్త్రమున చెప్పునది, దానిని అనుసరించి జీవించువారికే వర్తించునని మనకు తెలియును. అది, వారు ఎట్టి సాకులును చెప్పకుండ చేసి ప్రపంచమునంతను దేవుని తీర్పునకు లోబరచును.

20. ఏలయన, ధర్మశాస్త్రమును పాటించు టద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించునట్లు చేయుటయే ధర్మశాస్త్రము యొక్క పని.

21. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. యేసు క్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును, ప్రవక్తలును దానికి సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు విశ్వా సము గలవారిని అందరిని దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసికొనును. ఎట్టి భేదమును లేదు.

23. మానవులందరు పాపముచేసి, దేవుని మహిమను పొందలేకపోయిరి.

24. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి.

25. గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనపరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను కరుణా పీఠముగా బయల్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చు వాడైయుండుటకు ఆయనను అటుల చేసెను.

27. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమియును లేదే! ఏ కారణమున? క్రియలవలననా? కాదు. విశ్వాసమువలననే.

28. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసమువలనగాని, ధర్మశాస్త్రానుసార క్రియలవలన కాదని మేము భావించుచున్నాము.

29. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడ దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడ దేవుడు.

30. దేవుడు ఒక్కడే కనుక సున్నతి పొందిన వారిని విశ్వాసము మూలముగను, సున్నతిలేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును.

31. అయినచో ఈ విశ్వాసమువలన మనము ధర్మ శాస్త్రమును ధ్వంసము చేసినట్లగునా? ఎంత మాత్ర మును కాదు. మనము ధర్మశాస్త్రమును నిలబెట్టుదుము.