ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 2 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. ఇతరులకు తీర్పుతీర్చు ఓ మనుష్యుడా! నీవు ఎవడివైనను నిరుత్తరుడవై ఉన్నావు. ఏలయన, ఇతరులకు తీర్పుచెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు.

2. అట్టి కార్యములొనర్చు వారిపై దేవుని దండన న్యాయసమ్మతమే.

3. మనుష్యుడా! వేనికొరకై ఇతరులకు తీర్పుచెప్పుచుందువో, వానినే నీవు చేయుచున్నావుగదా! అటులైనచో, నీవు దేవుని దండనను తప్పించుకొనగలననుకొందువా?

4. లేక, నీవు దేవుని నిండుదయను, సహనమును, ఓర్పును తృణీకరించు చున్నావా? దేవునిదయ నీ హృదయపరివర్తన నిమిత్తమే అని ఎరుగవా!

5. నీ హృదయము కఠినమైనది, మొండిది. కనుకనే, దేవుని ఆగ్రహమును, న్యాయమగు తీర్పును వ్యక్తపరుపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసికొనుచున్నావు.

6. ఏలయన, వాని వాని క్రియలను బట్టియే దేవుడు ప్రతి వ్యక్తిని బహూకరించును.

7. ఓర్పుతో సత్కార్యములు చేయుచు, కీర్తి, ప్రతిష్ఠ, అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వతజీవమును ఒసగును.

8. కాని, విభేదములు కలిగించుచు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహ మును, రౌద్రమును కురియించును.

9. దుష్కార్యము లొనర్చు ప్రతి వ్యక్తికి కష్టములు, బాధలు తప్పవు. మొదట యూదులకు, తదుపరి గ్రీకులకు కూడ అవి వచ్చును.

10. కాని సత్కార్యములు చేయు ప్రతివ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును. మొదట యూదులకు, ఆపై గ్రీకులకు కూడ అవి కలుగును.

11. ఏలయన, దేవునకు పక్ష పాతములేదు.

12. ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధము లేకనే నాశనమగుదురు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపముకట్టుకొన్న యూదులు, ఆ ధర్మశాస్త్రము వలననే దండింపబడుదురు.

13. ఏలయన, కేవలము ధర్మ శాస్త్రమును వినుట మాత్రముచే కాక, ధర్మశాస్త్రము నందలి నియమములను అనుసరించుట వలననే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులు గావింపబడుదురు.

14. అన్యజాతులకు ధర్మశాస్త్రము లేదు. కాని వారికై వారు స్వభావసిద్ధముగా ధర్మశాస్త్రము నందలి శాసనములను పాటించినచో, వారు ధర్మ శాస్త్రము లేనివారేయైనను, వారికి వారే ఒక ధర్మ శాస్త్రమగుదురు.

15. ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడియున్నదని వారి ప్రవర్తనయే చాటును. ఇదియే యథార్థమేయని వారి అంతఃకరణములు కూడ నిరూపించును. ఏలయన, వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును.

16. మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నిటికి యేసుక్రీస్తు ద్వారా, దేవుడు తీర్పుచేయు ఆ దినమున నేను బోధించు సువార్తానుసారముగ ఇట్లే జరుగును.

17. నీ విషయమేమి? యూదుడనని నీవు చెప్పుకొందువుగదా? ధర్మశాస్త్రము పై ఆధారపడి దేవుని యందు నీ గొప్పలు చెప్పుచుందువు గదా!

18. దేవుని చిత్తము నీకు తెలియును. మంచిని ఎన్ను కొనుటను నీవు ధర్మశాస్త్రము నుండి నేర్చుకొంటివి.

19. నీవు గ్రుడ్డివారికి మార్గదర్శకుడవనియు, చీకటిలో ఉన్న వారికి దీపమనియు,

20. మూర్చులకు బోధకుడవనియు, పిన్నలకు గురువువనియు నీవెరిగినదే. విజ్ఞానపరిపూర్ణత, సత్యసంపూర్ణత అనునవి ధర్మ శాస్త్రము నందు ఇమిడియున్నవని నీవు నమ్ముచున్నావు.

21. మరి ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే ఎందుకు బోధించుకొనవు? దొంగిలింపకుము అని బోధింతువు గదా! కాని, నీవు దొంగిలింతువా?

22. వ్యభిచరింపకుము అని చెప్పుచున్న నీవు వ్యభిచరింతువా? విగ్రహములను అసహ్యించు కొనుచున్న నీవు దేవాలయములను దోచుకొందువా?

23. నీకు దేవుని ధర్మశాస్త్రమున్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా?

24. ఏలయన: “యూదులారా! మిమ్ము బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుచున్నారు” అని వ్రాయబడియున్నది.

25. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది. కాని నీవు ధర్మ శాస్త్రమునకు విధేయత చూపనిచో, సున్నతి లేనట్లే.

26. ఒకవేళ సున్నతిపొందని అన్యుడు ధర్మశాస్త్ర నియమ ములను పాటించినచో దేవుడు అతనిని సున్నతి పొందిన వానినిగ భావింపడా?

27. అప్పుడు మీరు అన్యులచే తీర్పు పొందుదురు. ఏలయన, వ్రాత రూపమున ధర్మశాస్త్రమును పొందియు, సున్నతి కలిగియుండియు, మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘింతురు. కానివారు శారీరకముగ సున్నతిని పొందకయు ధర్మ శాస్త్రమునకు విధేయత చూపుదురు.

28. నిజమైన యూదుడు బాహ్యముగ మాత్రమే యూదుడైన వాడు కాడు. అట్లే, నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు.

29. అంతరంగమున యూదుడైన వాడు  నిజమైన యూదుడు. అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది. అది ఆధ్యాత్మికమైనదే కాని వ్రాత పూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. అట్టివాడు మనుష్యులచే కాక దేవునిచే మెప్పుపొందును.