1. బలవంతులమైన మనము మనలను మనము సంతోష పెట్టుకొనక బలహీనుల లోపములను సహింపవలెను.
2. అంతేకాక, మనలో ప్రతి వ్యక్తియు, తన సోదరుని మేలుకొరకు వాని క్షేమాభి వృద్ధి కొరకు వానిని సంతోషపెట్టవలెను.
3. ఏలయన, క్రీస్తు తనను తాను సంతోషపెట్టుకొనలేదు. “నిన్ను నిందించువారి నిందలు నా పైననే పడినవి” అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.
4. ఏలయన, వ్రాయబడినవి అన్నియు మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. లేఖనములు మనకు ఒసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి.
5. సహనమునకును, ప్రోత్సాహమునకును కర్తయగు దేవుడు, క్రీస్తుయేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యమును కలిగించునుగాక!
6. అప్పుడు మీరు అందరును కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడును, తండ్రియును అయిన ఆయనను స్తుతింతురు.
7. కనుక, క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే, దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు.
8. ఏలయన, నేను ఒక్క విషయమును చెప్పుచున్నాను. వినుడు! పితరులకు ఒసగిన వాగ్దానములను నెరవేర్చు టలో దేవుడు సత్యవంతుడని చూపుటకును,
9. ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించునట్లు చేయుటకును, క్రీస్తు సున్నతి పొందినవారికి పరిచారకుడు అయ్యేను. “కనుక, అన్యులలో నేను నిన్ను స్తుతింతును. నీ నామ సంకీర్తనము చేయుదును” . అని వ్రాయబడియున్నట్లుగ:
10. మరల, “అన్యజనులారా! ఆయన ప్రజలతో ఆనందింపుడు!” అనియు అది పలుకుచున్నది.
11. తిరిగి, “అన్యజనులారా! మీరందరును ప్రభువును స్తుతింపుడు! ప్రజలందరును ఆయనను స్తుతింపుడు!” అనియు అదియే చెప్పుచున్నది.
12. అటులనే యెషయా, “యీషాయి నుండి ఒకడు వచ్చును. అన్యులను పరిపాలించుటకు ఆయన ఉద్భవించును. వారు ఆయనయందు నమ్మకము కలిగియుందురు” అని పలికెను.
13. నిరీక్షణకు మూలమగు దేవుడు, ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును, సమాధానమును కలిగించునుగాక! పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణమగును.
14. నా సోదరులారా! మీ వరకు మీరు మంచితనముతోను, సమస్తజ్ఞానముతోను నిండినవారై ఒకరికి ఒకరు ఉపదేశించుకొనగలరని నేను నమ్ముచున్నాను.
15. కాని ఎంతయో ధైర్యముతో మీకు కొన్ని విషయ ములను గుర్తుచేయుటకు వ్రాసితిని. దేవుని అను గ్రహము వలననే నేను అంతధైర్యమును చూపితిని.
16. క్రీస్తు యేసు సేవకుడనై అన్యులకొరకు పని చేయుటకే నేను అనుగ్రహమును పొందితిని. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునకు అంకితము కావింపబడి, ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యము అగుటకై, దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగ పనిచేయుచున్నాను.
17. కావున క్రీస్తు యేసునందు దేవునికొరకై నేను చేసినవానినిగూర్చి గర్వింప వచ్చును.
18. క్రీస్తు నా ద్వారా, నా మాటల వలనను, చేతల వలనను,
19. సూచకక్రియల చేతను, అద్బుతముల చేతను, ఆత్మయొక్క శక్తి మూలమునను, అన్య జనులను దేవునకు విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక, యెరూషలేమునుండి ఇల్లూరికు వరకు పయనించుట వలన క్రీస్తునుగూర్చిన సువార్తను సంపూర్ణ ముగ ప్రకటించితిని.
20. ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై, క్రీస్తును గూర్చి వినని ప్రదేశములోనే సువార్తను ప్రకటింపవలెననునది సర్వదా నా గాఢవాంఛయైయున్నది.
21. “ఆయననుగూర్చి తెలియజేయబడనివారు చూతురు. విననివారు అర్థము చేసికొందురు” అని లేఖనమునందు వ్రాయబడియున్నది గదా!
22. ఈ కారణముననే, మీ వద్దకు రాకుండ అనేక మార్లు నాకు ఆటంకములు కలిగినవి.
23.కాని, ఈ ప్రాంతములలో నా పని ఇప్పటికి పూర్తియైనది. అంతేకాక మిమ్ము చూడ రావలయునని చాల కాలము నుండి ఆశించుచున్నాను.
24. ఇప్పుడు స్పెయిను దేశమునకు పోవుచు త్రోవలో మిమ్ము చూచి, కొంత కాలము మీతో ఆనందముగ గడిపి, నా ప్రయాణ మునకు మీ తోడ్పాటును పొందగలననుకొనుచున్నాను.
25. కాని ప్రస్తుతము యెరూషలేములోని దైవప్రజల సేవకై నేను అచ్చటికి పోవుచున్నాను.
26. ఏలయన, మాసిడోనియా, గ్రీసులోని దైవసంఘములు యెరూషలేము నందలి దైవప్రజలలోని పేదలకు సాయపడవలెనని నిర్ణయించినవి.
27. వారి యంతట వారే అటుల చేయుటకు నిర్ణయించుకొనిరి. కాని నిజముగా, ఆ పేదలకు సాయపడవలసిన బాధ్యత వారికి ఉన్నది. ఏలయన, యూదులు తమ ఆధ్యాత్మిక ఆశీర్వాదములను అన్యులతో పంచుకొనిరి. కనుకనే తమ ఐహికమైన ఆశీర్వాదములతో అన్యులు యూదులకు సాయపడవలెను.
28. కావున ఈ పనిని ముగించి, వారి కొరకై ప్రోగుచేయబడిన ఈ ధనము వారికి అప్పగించిన తరువాత, నేను స్పెయినుకు వెళ్ళుచు, త్రోవలో మిమ్ము చూచెదను.
29. నేను మీయొద్దకు వచ్చునపుడు, క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో చేరుదునని నాకు తెలియును.
30. సోదరులారా! నాకొరకై దేవుని ఆసక్తితో ప్రార్థించి నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువగు యేసు క్రీస్తునుబట్టియు, ఆత్మ యొక్క ప్రేమను బట్టియు మిమ్ము అర్థించుచున్నాను.
31. యూదయాలోని అవిశ్వాసులనుండి నేను రక్షింపబడునటులును, యెరూషలేములో నా సేవలు అచటి దైవప్రజలకు అంగీకార యోగ్యమగునట్లును ప్రార్థింపుడు.
32. కనుక, అది దేవుని చిత్తమైన, నేను సంతోషముతో మిమ్ముచేరి, మీతో ఆనందింపగలను.
33. సమాధానకర్తయగు దేవుడు మీ అందరితో ఉండును గాక! ఆమెన్.