1. ప్రతివ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయన, దేవుని అనుమతిలేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవులయందు ఉంచబడిరి.
2. కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అటుల చేయువారు తీర్పును తమపై కొనితెచ్చుకొందురు.
3. ఏలయన, పాలకులు చెడుకార్యములు చేయువారికే కాని, మంచికార్యములు చేయువారికి భయంకరులు కారు. కనుక అధికారికి భయపడకుండ ఉండవలెనని నీవుకోరుదువా? అయినచో సత్కార్యము లనే చేయుము. అప్పుడు అతడు నిన్ను పొగడును.
4. ఏలయన, అతడు నీమేలు కొరకై పనిచేయు దేవుని సేవకుడే. కాని నీవు చెడును చేసినచో, అతనిని గూర్చి భయపడవలెను. ఏలయన, అతడు ఖడ్గమును వృధాగ ధరింపడు. అతడు దేవుని సేవకునిగా చెడుకార్యములు చేయువానిపై దేవుని ఆగ్రహమును కనబరచును.
5. కావున దేవుని ఆగ్రహమును బట్టియేకాక, మనస్సాక్షిని బట్టియు మీరు అధికారులకు విధేయులు కావలెను.
6. ఏలయన, తమ కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేయుచున్నారు. ఇందుకే కదా మీరు పన్నులు చెల్లించుచున్నది.
7. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు. కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులు కట్టవలసిన వారికి పన్నులను కట్టివేయుడు. ఎవరికి భయపడవలెనో వారికి భయపడుడు. ఎవరిని గౌర వింపవలెనో వారిని గౌరవింపుడు.
8. ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు. అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోటివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు.
9. ఏలయన, “వ్యభిచరింపకుము. హత్యచేయకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము" అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవియైనను, “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము” అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి.
10. తోటివానిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మ శాస్త్రమును నెరవేర్చుటయే.
11. ఇప్పుడు ఎంత వేళయైనదో మీకు తెలి యును గదా! కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్రనుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది.
12. రాత్రి ముగియవచ్చినది. పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటివేళ పోరాట మొనర్చుటకు ఆయుధ ములు ధరించుదము.
13. వెలుతురులో జీవించు ప్రజలుగ, సత్ప్రవర్తన కలిగియుందము. వినోదముతో కూడిన విందులుకాని, త్రాగుబోతుతనముకాని, భోగలాలసత్వముకాని, అసభ్యవర్తనకాని, పోట్లాటకాని, అసూయకాని ఉండరాదు.
14. కాని, ప్రభువైన యేసు క్రీస్తును ధరించి, మీ శరీరేచ్చలను తృప్తి పరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు.