ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 12 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము

 1. కాబట్టి సోదరులారా! పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవయాగముగ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమునుబట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను.

2. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని, మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అపుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనదియు అగు దానిని తెలిసికొనగలరు.

3. ఏలయన, నాకు ఒసగబడిన దేవుని దయచేత మీ అందరికి నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి, మిమ్ము మీరు గొప్పగ భావించుకొనకుడు. దానికి బదులుగా, మీ ఆలోచనలలో అణకువ చూపుడు. మీలో ప్రతివ్యక్తియు దేవుడు తనకొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొనవలయును.

4. ఒక్క శరీరమున అనేక అవయవములున్నవి. ఆ అవయవములన్నిటికి ప్రత్యేకింపబడిన విధులున్నవి.

5. అటులనే మనము చాలమందిమైనను క్రీస్తుతో ఏకమగుటవలన మనము అందరమును ఒకే శరీరము. ఒక శరీరముయొక్క వేరువేరు అంగముల వలెనే మనము అందరమును పరస్పర సంబంధ మును కలిగియున్నాము.

6. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగియున్నాము. కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుటయైనచో, మనకు గల విశ్వాసపరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను.

7. సేవచేయుటయైనచో తప్పక సేవ చేయవలెను, బోధించుటయైనచో తప్పక బోధింపవలెను.

8. ఇతరులను ప్రోత్సహించుటయైనచో తప్పక అటులే చేయవలెను, తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదారబుద్ధితో ప్రవర్తింపవలెను, అధికారము కలవాడు కష్టపడి పని చేయవలెను, ఇతరులపై కనికరము చూపువాడు, సంతోషముగ అటుల చేయవలెను.

9. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి, మంచిని అంటి పెట్టుకొని ఉండుడు.

10. ఒకరిని ఒకరు సోదరభావముతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు.

11. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు.

12. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్ధింపుడు.

13. అవసరము లోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు.

14. మిమ్ము హింసించువారిని దీవింపుడు. వారిని శపింపకుండ దీవింపుడు.

15. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించువారితో దుఃఖింపుడు.

16. అందరియెడల సమతాభావము కలిగియుండుడు.హెచ్చెనవానియందు మనస్సు ఉంచక, తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అను కొనకుడు.

17. ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు.

18. అందరి తోడను సౌమ్యముగా జీవించునట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు.

19. ప్రియులారా! ఎన్నటికిని మీరు పగతీర్చుకొనక, దేవుని ఆగ్రహమునకే దానిని వదలివేయుడు. ఏలయన, వ్రాయబడియున్నట్లుగ: “పగదీర్చుట నా పని. నేనే ప్రతిఫలము ఇచ్చెడివాడను అని ప్రభువు పలుకుచున్నాడు.”

20. అంతేకాక వ్రాయబడియున్నట్లుగ: “నీ శత్రువు ఆకలిగొని యున్నచో వాని ఆకలి తీర్పుము. దాహముగొని యున్నచో దాహము తీర్పుము. ఏలయన, ఇట్లు చేయుటవలన నీవు వానినెత్తిన మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోయుదువు.

21. కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయింపుము.