ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Romans chapter 11 in Telugu || Telugu catholic Bible || రోమీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము

 1. అయినచో నేను ఒకటి అడిగెదను: దేవుడు తన ప్రజలను నిరాకరించెనా? ఎన్నటికిని కాదు! నేనును యిస్రాయేలీయుడనే, అబ్రహాము సంతతి వాడను, ఫెన్యామీను గోత్రీయుడను.

2. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు తిరస్కరింపలేదు. యిస్రాయేలుకు వ్యతిరేకముగ ఏలీయా ఎట్లు దేవుని ప్రార్థించెనో, వ్రాయబడినది. మీరు ఎరుగరా?

3. "ప్రభూ! వారు ప్రవక్తలను చంపి నీ పీఠములను కూలద్రోసిరి. మిగిలియున్నది నేను మాత్రమే, నన్నును చంప ప్రయత్నించుచున్నారు” అని పలుకుచున్నది.

4. దేవుడు అతనికి ఏమి సమాధానమిచ్చెను? “బాలు దేవరకు మోకరించని ఏడువేలమందిని నా కొరకై ఉంచుకొంటిని” అని ఉన్నది.

5. ఇప్పుడును అంతే. తన కృపయొక్క ఏర్పాటువలన ఇప్పుడు కొందరు మిగిలియున్నారు.

6. ఎన్నిక కృపవలన జరిగినచో అది క్రియలవలన జరుగలేదు. అట్లు కానిచో నిజముగా కృప కృపయే కాదు.

7. అయినచో నేమి? యిస్రాయేలు ప్రజలకు తాము వెదకునది లభించలేదు. దేవునిచే ఎన్ను కొనబడిన ఆ కొలదిమందియే దానిని కనుగొనిరి. ఇతరుల విషయమున దేవుని పిలుపు చెవిటికి శంఖము ఊదినట్లు వారి హృదయములు కఠినపరచబడినవి.

8. ఇందు విషయమై వ్రాయబడినది ఏమనగా: “దేవుడు వారిని నిద్రమత్తుతో కూడిన మనస్సు గల వారినిగా చేసెను. అందువలన ఈనాటికిని వారు తమ కన్నులతో చూడజాలరు. అలా చెవులతో వినజాలరు.

9. వారి విందులోనే వారు పట్టుబడుదురుగాక! చిక్కుకొందురుగాక! వారు తొట్రుపడి శిక్షింపబడుదురుగాక!

10. చూడ వీలులేకుండ వారి కన్నులు మూసికొనిపోవునుగాక! భారముచే వారి నడుములు సర్వదా వంగిపోవునుగాక!" అని దావీదు పలుకుచున్నాడు.

11. అయిన నేను ఒకటి అడిగెదను, యూదులు పడిపోవునంతగా తొట్రిల్లిరా? అది ఏమాత్రము కాదు. కాని యిస్రాయేలీయులకు అసూయను పుట్టించుటకై వారి అతిక్రమమువలన అన్యులకు రక్షణము లభించినది.

12. వారి అతిక్రమము లోకమునకు ఐశ్వర్య మైనచో అనగా వారి పతనము అన్యులకు ఐశ్వర్య మైనచో, వారి సమృద్ధివలన యింకెంత ఐశ్వర్యము కలుగునోగదా?

13. అన్యజనులారా! నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులకు నేను అపోస్తలుడనైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును.

14. బహుశః ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి, వారిలో కొందరినెనను రక్షింపగలనేమో?

15. ఏలయన, వారు తిరస్కరింపబడినపుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినదిగదా! అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి యేమి? మరణించిన వారికి అది పునర్జీవమగును.

16. పిండిలో దేవునికి సమర్పింపబడిన మొదటి పిడికెడు పవిత్రమైనదైనచో మిగిలినదంతయు పవిత్రమే. వేరు పవిత్రమైనదైనచో కొమ్మలును అట్టివే.

17. పెరటి ఓలివు చెట్టుకొమ్మలు కొన్ని విరువబడి, మరియొక అడవి ఓలివుచెట్టు కొమ్మ దానికి అంటు కట్టబడినది. అన్యులారా! మీరు అడవి ఓలివుచెట్టు వంటి వారు. కనుక ఇప్పుడు మీరు యూదుల ఐశ్వర్య జీవితమున పాలుపంచుకొనుచున్నారు.

18. కావున కొమ్మల వలె వారు విరిచివేయబడిరని మీరు గర్వింపవలదు. మీరు గర్వించినచో మీరు వేరులకు ఆధారము కాదని, వేరులే మీకు ఆధారమని జప్తియందుంచుకొనుడు.

19. “నిజమే. కాని నేను అంటుకట్టబడుటకే కొమ్మలు విరిచి వేయబడినవి కదా!” అని మీరు అందురు.

20. ఇది నిజమే. విశ్వసింపకపోవుటచే వారు విరిచివేయబడిరి. విశ్వసించుట చేతనే మీరు మీ స్థానమున నిలిచియున్నారు. దానిని గూర్చి గర్వింపకుడు, కాని, భయముతో ఉండుడు.

21. సహజ కొమ్మలైన యూదులనే దేవుడు శిక్షింపక విడిచి పెట్టలేదు. అటులైనచో మిమ్మును విడిచి పెట్టునను కొందురా?

22. దేవుడు ఎంతటి దయను చూపునో, ఎంతటి కాఠిన్యమును ప్రదర్శించునో గమనింపుడు. భ్రష్టులైన వారి విషయమున ఆయన కఠినముగా ఉన్నాడు. కాని మీరు ఆయన దయయందే నిలిచి యున్నచో, ఆయన మీపై దయచూపును. కాకున్నచో మీరును నరికివేయబడుదురు.

23. యూదులు కూడ తమ అవిశ్వాసమును విడిచివేసినచో అంటుకట్టబడుదురు. ఏలయన, వారిని తిరిగి అంటుకట్టుటకు దేవునికి శక్తి కలదు.

24. అన్యులారా! మీరు విరిచి వెయబడి ప్రకృతికి విరుద్ధముగ పెరటి ఓలివు చెట్టుకు అంటుకట్టబడిన అడవి ఓలివుచెట్టు కొమ్మవంటి వారు. యూదులు ఈ పెరటిచెట్లు వంటివారు. కనుక నరకబడిన పెరటిచెట్టు కొమ్మలను అదే చెట్టునకు అతుకుట దేవునికి మరింత సులభము!

25. సోదరులారా! ఒక పరమరహస్యము  ఉన్నది. అది మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. అది మిమ్ము గర్వింపకుండునట్లు చేయును. యిస్రాయేలు ప్రజల మొండితనము శాశ్వతమైనది కాదు. చేరవలసిన అన్యులు అందరును దేవుని చేరువరకే అది నిలుచును.

26. ఇట్లు యిస్రాయేలు అంతయు రక్షింపబడును. వ్రాయబడియున్నట్లుగ: సియోనునుండి విమోచకుడు వచ్చును యాకోబు దుష్టత్వమునంతయు అతడు తొలగించును.

27. వారి పాపములను తొలగించిన వెనుక, వారితో ఈ నా నిబంధన చేసికొందును.”

28. అన్యజనులారా! యూదులు సువార్త విషయమై మీ కొరకు దేవుని శత్రువులు. కాని, దేవునిచే ఎన్నుకొనబడుటచే పితరులను బట్టి వారు ఆయన ప్రియులు.

29. దేవుని కృపావరములు, ఎన్నిక మార్చబడనివి.

30. అన్యులారా! గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను, యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి.

31. అటులనే మీరు పొందిన కనికరమునుబట్టి, తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి.

32. ఏలయన, తాను వారి అందరిపై కృపనుచూపుటకై దేవుడు మానవులందరిని అవిధే యతయందు బందీలను కావించెను.

33. దేవుని ఐశ్వర్యము ఎంత మనమైనది! ఆయన వివేకము, విజ్ఞానము ఎంత గాఢమైనవి! ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును?

34. వ్రాయబడియున్నట్లుగ: “ప్రభువు మనసు ఎవరికి ఎరుక! ఆయనకు సలహాదారు ఎవరు?

35. తిరిగి అయనచే ఇచ్చివేయబడుటకు గాను, ఆయనకు ఎన్నడైన ఏదైన ఇచ్చినదెవరు?”

36. ఏలయన, ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయనకొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమెన్.