1. సోదరులారా! ఆ ప్రజలు రక్షింపబడవలెనని హృదయపూర్వకముగ ఎంతగానో కోరుచున్నాను. వారికొరకై దేవుని ఎంతగానో ప్రార్థించుచున్నాను.
2. ఏలయన, వారు దేవునియెడల ఆసక్తిగల వారని నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను. కాని, వారి ఆసక్తి జ్ఞానపూర్వకమైనది కాదు.
3. ఏలయన, దేవుని నీతిని ఎరుగక వారు తమ సొంత నీతిని నెలకొల్ప యత్నించి దేవుని నీతికి విధేయులు కాలేదు.
4. విశ్వ సించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.
5. “ధర్మశాస్త్రమూలమైన నీతిని అనుసరించువాడు దానివలననే జీవించును" అని మోషే వ్రాసియుండెను.
6. కాని విశ్వాస మూలమైన నీతి, “క్రీస్తును క్రిందికి తెచ్చుటకు పరలోకమునకు ఎవడు ఎక్కిపోవును?
7. లేక మృతులలోనుండి క్రీస్తును పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడు దిగిపోవును? అని నీ హృదయములో ప్రశ్నించుకొనకుము” అని చెప్పుచున్నది.
8. అయితే అది ఏమని చెప్పుచున్నది? “దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది.” ఇదియే మేము బోధించు విశ్వాసపు వాక్కు.
9. నీ నోటితో యేసును 'ప్రభువు' అని ఒప్పుకొని, మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు.
10. ఏలయన, మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతు డగును. నోటితో ఒప్పుకొని రక్షణను పొందును.
11. “ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు” అని లేఖనము చెప్పుచున్నది.
12. ఏలయన, యూదులకును, అన్యులకును భేదము లేదు కదా! అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించువారిని అందరిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును.
13. ఏలయన, “ప్రభు నామమున ప్రార్థించు ప్రతివ్యక్తియు రక్షింప బడును.”
14. కాని, వారు విశ్వాసులు కానిచో, ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో, ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు?
15. బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగ, “సువార్తను ప్రకటించువారి పాదములు ఎంత సుందరమైనవి!"
16. కాని వారిలో అందరును సువార్తను అంగీకరించినవారు కారు. “ప్రభూ! మా సందేశమును విని కూడ విశ్వసించినదెవడు?” అని యెషయా ప్రశ్నించెను.
17. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును.
18. కాని, వారు సందేశమును వినలేదా? అని నేను ప్రశ్నింతును. వారు వినియేయున్నారు. “వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను. వారి పలుకులు భూదిగంతములవరకును వినబడెను” అని లేఖనము చెప్పుచున్నదిగదా!
19. అయినచో ఇట్లు అడుగుదును: పోనీ, యిస్రాయేలు ప్రజలకు తెలియలేదా? “నిజమునకు ఒక జనము కాని ప్రజలపై నీకు ఈర్ష్య కలిగింతును. ఒక అవివేకులగు జనముపై నీకు కోపము పుట్టింతును” అని మోషే స్వయముగ మొదట సమాధానము చెప్పెను.
20. యెషయా మరింత సాహసముతో . “నా కొరకు వెదకనివారికి నేను దొరికితిని, నన్ను కోరనివారికి నేను దర్శనమిచ్చితిని” అని పలుకుచున్నాడు.
21. కాని, యిస్రాయేలును గూర్చి అతడు, “అవిధేయులును, తిరుగుబాటు దారులును అగు ప్రజవైపు దినమంతయు నేను చేతులు చాచితిని” అని పలుకుచున్నాడు