ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-4 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిననాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగ జీవింపుడు

2. మీరు ఎల్లప్పుడును సాధువులుగను, సాత్త్వికులు గను, సహనశీలురుగను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు.

3. మిమ్ము ఒకటిగ బంధించు శాంతిద్వారా ఆత్మ ఒసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగ ప్రయత్నింపుడు.

4. శరీరము ఒకటే. ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకేగదా!

5. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము,

6. ఒకేదేవుడు, మానవులందరకు ఒకేతండ్రి. ఆయన అందరికి పైగా, అందరిద్వారా, అందరియందు ఉండువాడు.

7. క్రీస్తు ఒసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతివ్యక్తియు ఒక్కొక్క విశేషవరమును పొందెను.

8. “ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినపుడు చెరలోని వారిని జయించి వెంట తీసికొనిపోయెను మనుజులకు వరములను ఒసగెను” అని లేఖనము పలుకుచున్నది.

9. అయినచో “ఎక్కి వెళ్ళినపుడు” అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగివచ్చెననియే గదా? అనగా భూలోకపులోతులకు అనియేగదా తాత్పర్యము.

10. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశమునకంటె అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగివచ్చినవాడు.

11. “మానవులకు వరములు ఇచ్చినది” ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలులుగను, కొందరిని ప్రవక్తలుగను, కొందరిని సువార్తీకులుగను, కొందరిని కాపరులుగను బోధకులుగను నియమించెను.

12. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరను సిద్ధము చేయుటకు ఆయన ఇనర్చెను.

13. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను, ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులముకాగలము; అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము.

14. అప్పుడు ఇంక మనము పసిబిడ్డ లము కాము. తమ టక్కరిజిత్తులతో ఇతరులను తప్పుత్రోవన నడుపు మోసగాండ్ర బోధల గాలి తాకిడికిని, అలలపోటునకును కొట్టుకొనిపోము.

15. అంతే కాక, ప్రేమతో సత్యము పలుకుటవలన సర్వవిధముల క్రీస్తునందు వృద్ధిచెందవలెను. ఆయన మనకు శిరస్సు,

16. ఆయన నిర్వహణలో దేహముయొక్క సర్వాంగములును స్వస్థానములందు నిలిచి ఉండును. దేహమంతయు తనకు అమర్చబడిన కీళ్ళతో పొందిక అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రముగ పనిచేసినచో, దేహము అంతయు ప్రేమ ద్వారా పెంపొందును.

17. ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించు చున్నాను. ఉపయోగములేని ఆలోచనలు కలవారును,

18. అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్యజనులవలె మీరు ఇక ప్రవర్తింప రాదు. వారు అవివేకులును మూర్ఖులును అగుటచే దేవుని జీవితమునుండి దూరమైరి.

19. వారికి సిగ్గు లేదు.వారు దురభ్యాసములకు తమను తాము అర్పించు కొని, అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు పనులను చేయుచుందురు.

20. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదుగదా!

21. ఆయనను గూర్చి నిశ్చయముగ మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది.

22. కనుక మీ పూర్వ జీవితపు పాతస్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము, మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది.

23. మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు.

24. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు.

25. కనుక ఇక అసత్యములు పలుకరాదు! ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలుక వలయును. ఏలయన, క్రీస్తుదేహమున మనము అందరమును పరస్పర సంబంధముగల సభ్యులమే కదా!

26. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో, ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొనిపోకుండ చూచుకొనుడు.సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను.

27. సైతానునకు అవకాశము ఒసగకుడు.

28. దొంగ, దొంగతనము మానివేసి, అక్కరగల వానికి పంచి పెట్టగలందులకై తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29. సంభాషణలలో దుర్బాషలు రానీయక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుడు.

30. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన, ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా! అంతే కాదు. దేవుడు మీకు స్వేచ్ఛను ఒసగెడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడ.

31. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజింపుడు. అరపులు గాని, అవమానములు గాని ఇక ఉండరాదు. ఏవిధమైన ద్వేషభావము ఉండరాదు.

32. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు.