ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-3 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

1. ఇందువలననే అన్యులగు మీకొరకై, క్రీస్తుయేసు బందీనైన పౌలునగు నేను, దేవుని ప్రార్ధించుచున్నాను.

2. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు.

3. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని.

4. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో, క్రీస్తు రహస్యమును నేను గ్రహించితినని మీకు తెలియగలదు.

5. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని, నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను.

6. అనగా, సువార్తవలన అన్యులకును యూదులతోపాటు దేవుని దీవెనలలో పాలులభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తుయేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్తులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము.

7. దేవుని విశేషవరముచే నేను ఈ సువార్తికరణ సేవచేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను.

8. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్య ములను అన్యులకు అందించువరమును దేవుడు నాకు ప్రసాదించెను.

9. దేవుని రహస్యప్రణాళిక ఎట్లు అమలు జరుపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరు గ్రహించునట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను.

10. ఏలయన, దివ్యలోకము నందలి ప్రభువులకును, శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవసంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను.

11. తన శాశ్వత ఉద్దేశానుసారముగనే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను.

12. ఆయనయందలి విశ్వాసమువలనను, ధైర్యముతో మనము దేవునిసన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది.

13. మీ కొరకై నేను శ్రమనొందు చున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను. అది అంతయు మీ మహిమ కొరకే గదా!

14. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను.

15. దివియందలి, భువియందలి ప్రతికుటుంబము తన నిజమైన నామమును ఆతండ్రి నుండియే పొందుచున్నది.

16. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను.

17. విశ్వాసమువలన క్రీస్తు మీ హృదయములయందు నివాసమేర్పరచు కొనునుగాక అనియు ప్రార్ధించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి, వేళ్లూనికొని పోయి,

18. పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింప గల శక్తికల వారు కావలెననియు దేవునకు నా విన్నపము.

19. మీ గ్రహణశక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలిసికొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగ నింపబడుదురు గాక!

20. మనయందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటెను, ఊహించుదాని కంటెను, ఎన్నియో రెట్లు అధికముగ నెరవేర్పగల,

21. ఆ దేవునకు, దైవ సంఘమునందును, క్రీస్తు యేసునందును, తరతరములు సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.