ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-6 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము

 1. బిడ్డలారా! ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము.

2. “నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ: అప్పుడు,

3. నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు”.

4. తండ్రులారా! మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను, ప్రభువు బోధనలోను పెంచుడు.

5. బానిసలారా! మానవులగు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూర్చి భయముతోను వణకుతోను నడువుడు. కాని క్రీస్తునే సేవించు చున్నట్లుగ హృదయపూర్వకముగ అటుల చేయుడు.

6. వారి ముఖప్రీతికొరకై వారు చూచుచున్నపుడు మాత్రమే కాక, క్రీస్తు సేవకులుగ దేవుని సంకల్పమును హృదయపూర్వకముగ చేయుడు.

7. సేవకులుగ మీ పనిని సంతోషముతో చేయుడు. కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక, ప్రభు సేవ చేయుచుంటిమి అని భావింపుడు.

8. సేవకుడు కానిండు, స్వతంత్రుడు కానిండు, అతడు చేసిన పనికి దేవుడు ప్రతివ్యక్తిని బహూకరించునను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు.

9. యజమానులారా! మీ బానిసలపట్ల మీరును అట్లే ప్రవర్తింపుడు. వారిని భయపెట్టుట మానివేయుడు. మీరును మీ సేవకులును పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు. ఆయన యందు పక్షపాతము ఉండదు.

10. చివరిగా, ప్రభువుతో ఏకమై, ఆయన మహా శక్తి ద్వారా, మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు.

11. సైతాను టక్కరిజిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు.

12. ఏలయన, మనము పోరాడునది రక్తమాంసములతో నుండు శరీరధారులతో కాదు! ప్రధానులతోను, అధికారులతోను, ఈ యుగపు అంధకార శక్తులతోను, ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటము చేయుచున్నాము.

13. కనుక ఇపుడు దేవుని పూర్ణకవచమును ధరింపుడు! ఆ దుష్టదినము వచ్చిననాడు మీరు శత్రుబలములను ఎదుర్కొనగలిగి, తుదివరకు పోరాడి నిలదొక్కుకొందురు.

14. కనుక, సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు.

15. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను మీ పాదరక్షలుగ చేసికొనుడు.

16. అన్ని సమయములందును, విశ్వాసమును డాలుగ చేసికొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటిని దానితో ఆర్పివేయగలరు.

17. రక్షణను శిరస్త్రాణముగను, దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను, మీరు గ్రహింపుడు.

18. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును, విజ్ఞాపనములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదాప్రార్థింపుడు.

19. ధైర్యముగా నోరువిప్పి మాట్లాడుచు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు.

20. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంకెళ్ళతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చివలసినంత ధైర్యముతో ప్రకటించునట్లు ప్రార్థింపుడు.

21. దైవసేవలో మన ప్రియ సోదరుడును, విశ్వాసపాత్రుడైన సేవకుడును అగు తుకికు నేను ఎట్లు జీవించుచున్నానో సమస్తమును మీకు తెలియజేయగలడు.

22. కనుక, ఇచటి మా అందరి జీవితమును మీకు వివరించి, మీ హృదయములకు ధైర్యము చేకూర్చుటకై అతనిని మీ వద్దకు పంపుచున్నాను.

23. తండ్రి దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తును విశ్వాసముతో కూడిన సోదరులకు అందరకును, శాంతిని, ప్రేమను ప్రసాదించుగాక!

24. తరిగి పోని ప్రేమతో మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించు వారందరికి దేవునికృప తోడగునుగాక!