ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-2 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. మీ అపరాధముల వలనను, పాపముల వలన గతమున ఆధ్యాత్మికముగ మీరు మృతులైతిరి కాని, ఆయన మిమ్ము బ్రతికించెను.

2. అప్పుడు మీరు లోకముయొక్క పోకడను అనుసరించితిరి. వాయు మండల సంబంధమైన అధిపతికి మీరు విధేయు లైతిరి. దేవునకు అవిధేయులగువారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి.

3. నిజముగ మనము అందర మును అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని, శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొంటిమి. కనుక ఇతరులవలెనే మనమును దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి.

4. కాని, దేవునికృప అపారము. మనపట్ల ఆయన ప్రేమ అమితము.

5. కనుకనే అపరాధములవలన ఆధ్యాత్మికముగ నిర్జీవులమై ఉన్న మనలను, క్రీస్తుతో కూడ ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి.

6. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుటవలన, ఆయనతోపాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండచేసెను.

7. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమవలన, క్రీస్తుయేసునందు తన అను గ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగ రాబోవు యుగములకు ప్రదర్శించెను.

8. ఏలయన, విశ్వాసము ద్వారా, దేవునివరమువలననే, మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు. దేవుని వరమే.

9. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమియును లేవు.

10.మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తుయేసుద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మనకొరకై సిద్ధపరచియే ఉంచెను.

11. పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు. ఒక ప్పుడు మీరు శారీరకముగా అన్యులైయుంటిరి. శరీర మందు హస్తములచే సున్నతి పొందినవారిచే సున్నతి లేనివారుగా పిలువబడితిరి.

12. అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరుచేయబడి ఉంటిరి. మీరు పరదేశీయులు. దేవునిచే ఎన్నుకొనబడిన యిస్రాయేలీయులు వారి లోనివారు కారు. దేవుడు తన ప్రజల కొనర్చిన వాగ్ధాన ములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు. నిరీక్షణగాని, దేవుడుగాని లేకుండ మీరు ఈ ప్రపంచమున జీవించితిరి.

13. కాని ఇప్పుడు క్రీస్తుయేసునందు ఏకమగుటతో, దూరముగనున్న మీరు క్రీస్తు రక్తమువలన సమీపమునకు తీసికొనిరాబడితిరి.

14. యూదులను, అన్యులను ఏకమొనర్చుటద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరుచేసి, విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను.

15. ఆ రెండు జాతులనుండి, తనతో ఏకత్వమునొందిన ఒకే నూతనజాతిని సృజించి, శాంతినెలకొల్పుటకై శాసనములతో, సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను.

16. సిలువపై తాను మరణించుటవలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమొనర్చి, మరల దేవునిదరికి చేర్చెను.

17. కనుక క్రీస్తు విచ్చేసి, దేవునకు దూరముగ ఉన్న అన్యులగు మీకును, దేవునకు సమీపముగనున్న యూదులందరికిని సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను.

18. కనుక మన మిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము.

19. కనుక, అన్యులారా! మీరు ఇక పరదేశులును, పరాయివారును కారు. మీరు ఇపుడు పరిశుద్దులు, దైవ ప్రజలతో సహపౌరులు. దేవుని కుటుంబములో సభ్యులు.

20. క్రీస్తుయేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునా దిపై మీరును నిర్మింపబడినవారే.

21. ఆ భవనము నంతయు ఒకటిగా నిలిపి, దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే.

22. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మద్వారా నివసించును.