1. సోదరులారా! ప్రభువునందు ఆనందింపుడు. పూర్వము వ్రాసినదానినే తిరిగి వ్రాయుటకు నాకు విసుగులేదు. పైగా అది మీకు క్షేమము.
2. కుక్కలను గూర్చి జాగ్రత్తపడుడు. దుష్టకార్యములను చేయువారిని గురించి మెలకువగా ఉండుడు. సున్నతి చేసికొను వారిని గూర్చి జాగ్రత్తపడుడు.
3. నిజమైన సున్నతిని పొందినది మనమేగాని వారు కాదు. ఏలయన, మనము దేవుని యొక్క ఆత్మద్వారా దేవుని పూజింతుము. మన యేసు క్రీస్తునందలి జీవితమున మనము ఆనందింతుము గదా! బాహ్య ఆచారములయందు మనకు ఎట్టి నమ్మకము లేదు.
4. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలయన, బాహ్యాచారములతో క్షేమముగ ఉండగలనని ఎవడైనను అనుకొనినచో, నేను అటుల అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది.
5. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎనిమిదవ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే యిస్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను. స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను.
6. నా మత ఆసక్తిచే దైవసంఘమును హింసించితిని. ధర్మశాస్త్రమునకు విధేయుడై, మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో, అంత వరకు నేను నిర్దోషిని.
7. కాని నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటిని క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను.
8. వానిని మాత్రమేగాక అంతకంటె అధికమైన విలువ గల దానికై అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగనే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటిని చెత్తగ భావించుచున్నాను.
9. ధర్మశాస్త్రమునకు విధేయుడనైనందువలన పొందదగినదియు, నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసమువలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవునినుండి కలుగునదై, విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగ ఐక్యము పొందవలెనని నా కోరిక.
10. క్రీస్తును తెలిసికొనవలెననియు, ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నావాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు, మృత్యువునందు ఆయనను పోలియుండవలయుననియు మాత్రమే నా కోరిక.
11. సాధ్యమగునేని మృతులలోనుండి పునరుత్థానము పొందవలెనన్నదే నా ఆశ.
12. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతిననిగాని, పరిపూ ర్ణుడనైతిననిగాని చెప్పుకొనను. కాని, దానికొరకై సదా ప్రయత్నించెదను. ఏలయన, నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని.
13. సోదరులారా! నిజమునకునేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కాని నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన, గతమును మరచి ముందున్నదానిని చేరుటకు తీవ్రముగ కృషి చేయుచున్నాను.
14. కనుక, బహుమానమును గెలుచుకొనుటకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరుగిడుదును. పరలోక జీవితమునకై క్రీస్తుయేసు ద్వారా వచ్చు దేవుని పిలుపే ఆ బహుమానము.
15. ఆధ్యాత్మికముగ పరిపక్వ దశకు చెందిన మనమందరము ఇట్టి మనస్తత్వమునే కలిగి ఉండవలెను. కాని, ఒకవేళ మీకు ఏమైన భిన్నాభిప్రాయాలు ఉన్నచో దేవుడే దీనిని మీకు స్పష్టము చేయును.
16. అది ఎటులైనను, మనము ఇప్పటి వరకును పాటించుచున్న నియమములతోనే ముందుకు సాగిపోదము.
17. సోదరులారా! మీరు అందరు నన్ను అనుస రించుచునే ఉండుడు. మేము చూపిన సదాదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు.
18. క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగ జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. .కన్నీటితో దానినే మరల చెప్పుచున్నాను.
19. అట్టివారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములనుగూర్చివారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు.
20. కాని మనము పరలోక పౌరులము. దివినుండి మన రక్షకుడును ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము అతురతతో వేచియున్నాము.
21. బలహీనములగు మన మర్త్యశరీరములను, ఆయన తన శరీరమువలె దివ్యముగ చేయును. సర్వమును లోబరచుకొనగల తన శక్తిచేతనే ఆయన అటుల చేయును.