ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 9 || Telugu catholic Bible || లూకా సువార్త 9వ అధ్యాయము

 1. యేసు తనపన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను.

2. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను.

3. “మీరు ప్రయాణము చేయునపుడు ఊతకట్టనుగాని, జోలెనుగాని, రొట్టెను గాని, ధనమునుగాని, రెండు అంగీలనుగాని తీసికొని పోరాదు.

4. మీరు ఒక ఇంట ప్రవేశించినపుడు తిరిగి పోవువరకు అచటనే ఉండుడు.

5. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించిపొండు” అని యేసు వారికి ఉపదేశించెను.

6. అంతట వారు వెళ్ళి గ్రామగ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస పరచుచు అంతట పర్యటింపసాగిరి.

7. ఆ కాలమున గలిలీయ రాజ్యపాలకుడగు హేరోదు యేసునుగూర్చి అంతయు విని కలవర పడెను. ఏలయన, స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు.

8. ఏలీయా అవతరించెనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచెనని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి.

9. “నేను యోహాను తలతీయించితినిగదా! మరి నేను వినుచున్న వార్తలన్నియు ఎవరిని గురించియై ఉండ వచ్చును” అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను.

10. శిష్యులు తిరిగివచ్చి తాము చేసిన పనులన్నియు వివరించినపిదప ఆయన వారిని మాత్రమే వెంటబెట్టుకొని బెత్సయిదా గ్రామమునకు వెళ్లెను.

11. జనసమూహములు ఈ విషయమును తెలిసికొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవునిరాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను.

12. ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు పన్నిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, “ఇది నిర్జన ప్రదేశము. ఇక వీరిని పంపివేయుడు; పల్లెపట్టులకు వెళ్లి, వారికి కావలసిన భోజనవసతులను చూచుకొందురు” అని ఆయనతో చెప్పిరి.

13. “మీరే వీరికి భోజనము పెట్టుడు” అని ఆయన పలుకగా “మా యొద్ద ఉన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే. మేము పోయి, వీరికి అందరకు కావలసిన ఆహారపదార్థములు కొనితెత్తుమా?” అని శిష్యులు అడిగిరి.

14. అచ్చట రమారమి అయిదువేలమంది పురుషులుండిరి. వారిని పంక్తులుదీర్చి, పంక్తికి ఏబదిమంది చొప్పున కూర్చుండ బెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా

15. వారు అట్లే కూర్చుండబెట్టిరి.

16. పిమ్మట యేసు ఆ అయిదు రొట్టెలను, రెండుచేపలను తీసికొని, ఆకాశమువైపు చూచి, వానిని ఆశీర్వదించి, త్రుంచి 'ప్రజలకు వడ్డింపుడు' అని శిష్యులకు ఇచ్చెను.

17. వారందరు భుజించి, సంతృప్తిపడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు పండ్రెండుగంపలకు ఎత్తిరి.

18. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసికొనుచుండగా ఆయన శిష్యులుకూడ అచట ఉండిరి. అపుడు ఆయన వారిని “ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు?” అని అడిగెను.

19. “స్నాపకుడగు యోహాను అని కొందరు; ఏలీయా అని మరికొందరు; పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు” అని వారు సమాధానము ఇచ్చిరి.

20. యేసు వారిని “మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?” అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు “నీవు దేవుని క్రీస్తువు” అని బదులు ఇచ్చెను.

21. పిమ్మట యేసు వారిని “ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు” అని ఆజ్ఞాపించి

22. “మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింప బడి, చంపబడి, మూడవదినమున ఉత్థానమగుట అగత్యము” అని పలికెను.

23. మరియు వారందరితో “నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరింపవలయును.

24. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నానిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును.

25. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయినయెడల ప్రయోజనమేమి?

26. నన్ను గూర్చియు, నా సందేశమును గూర్చియు సిగ్గుపడువానిని గూర్చి, మనుష్యకుమారుడు తన మహిమతోను, తన తండ్రి మహిమతోను, దేవదూతల మహిమతోను, వచ్చినపుడు సిగ్గుపడును.

27. ఇచట ఉన్న వారిలో కొందరు దైవరాజ్యమును చూచువరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు శిష్యులతో పలికెను.

28. ఈ బోధలు చేసిన పిదప దాదావు ఎనిమిది దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసికొనుటకై పర్వతముపైకి వెళ్ళెను.

29. ఆయన ప్రార్థన చేసికొనుచుండగా యేసు ముఖరూపము మార్పుచెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను.

30. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలీయా అనువారు.

31. వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింప వలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి.

32. పేతురు, అతని తోటివారును నిద్ర మత్తులో ఉండిరి. వారు మేలుకొనినపుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి.

33. వారిద్దరు ఆయనయొద్దనుండి వెళ్ళిపోవు చుండగా, పేతురు "ప్రభూ! మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు మూడు పర్ణశాలలను నిర్మింతుము” అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడుచుండెను.

34. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అపుడు వారు భయపడిరి.

35. ఆ మేఘమునుండి ఒక వాణి “ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనినవాడు. ఈయనను ఆలకింపుడు” అని వినిపించెను.

36. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయ మును ఎవ్వరికిని చెప్పలేదు.

37. మరునాడు యేసు పర్వతము దిగివచ్చినపుడు గొప్పజనసమూహము ఆయనయొద్దకు వచ్చెను.

38. ఆ జనసమూహమునుండి ఒకడు ఎలుగెత్తి “బోధకుడా! నా పుత్రుని పై కనికరము చూపుము. వాడు నాకు ఏకైక కుమారుడు.

39. ఒక దయ్యము వానిని పట్టి పీడించుచున్నది. అపుడు వాడు ఉన్నట్లుండి కేకలువేయును. అది వానిని నురుగులు క్రక్కునట్లు విలవిలలాడించి గాయపరచుచున్నది. వానిని విడిచి పోవుటలేదు.

40. ఈ దయ్యమును వెడలగొట్టవలసినదిగా నేను మీ శిష్యులను కోరితిని. కాని వారికి అది సాధ్యపడలేదు" అని మొరపెట్టెను.

41. అందుకు యేసు “మీరు విశ్వాసములేని దుష్టజనము! నేను మీతో ఎంతకాలము ఉందును? ఎంత వరకు మిమ్ము సహింతును?” అని, వానితో “నీ కుమారుని ఇక్కడకు తీసికొనిరమ్ము" అని పలికెను.

42. వారు వచ్చు చుండగా దయ్యము వానిని క్రింద పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి, వానిని స్వస్థపరచి తండ్రికి అప్పగించెను.

43. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరును ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరు యేసు అద్భుతకార్యములకు ఆశ్చర్య పడుచుండ ఆయన తన శిష్యులతో ఇట్లనెను:

44. “చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్యకుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు” అని పలికెను.

45. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయ పడిరి.

46. “మనలో అధికుడు ఎవడు?” అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలిడిరి.

47. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్నబిడ్డను తన చెంత నిలుపుకొని,

48. “నా పేరిట ఈ చిన్న వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలయన, మీ అందరిలో అత్యల్పుడైనవాడు' అందరికంటే అధికుడు” అని వారితో పలికెను.

49. అపుడు యోహాను “ప్రభూ! మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలయన, అతడు మనలను అనుసరించువాడు కాడు” అని చెప్పెను.

50. అందుకు యేసు “వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే” అనెను.

51. మోక్షారోహణ దినములు సమీపించినపుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు అభిముఖుడై

52. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప, ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి.

53. కాని, ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి.

54. ఆయన శిష్యులగు యాకోబు, యోహానులు అది చూచి “ప్రభూ! మేము ఆకాశమునుండి అగ్నిని రప్పించి, వీరిని నాశనముచేయుమని ఆజ్ఞాపించుట నీకు సమ్మ తమా?” అని అడిగిరి.

55. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను.

56. అంతట వారందరు మరొక గ్రామమునకు వెళ్ళిరి.

57. అటుల వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో “మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించివత్తును” అని పలికెను.

58. అందుకు యేసు “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. కాని మనుష్యకుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు” అని సమాధానము ఇచ్చెను.

59. అపుడు ఆయన మరియొకనితో “నన్ను అనుసరింపుము" అని అనెను. అందుకు అతడు “ప్రభూ! నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధిచేసి వచ్చుటకు సెలవిమ్ము” అని మనవిచేసెను.

60. అందుకు యేసు “మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము. కాని నీవు వెళ్ళి దేవునిరాజ్యమును ప్రకటింపుము” అనెను.

61. మరియొకడు యేసుతో "ప్రభూ! నేను మిమ్ము అనుసరింతును కాని, మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు" అని పలికెను.

62. యేసు వానితో “నాగటిమీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు” అనెను.