ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 8 || Telugu catholic Bible || లూకా సువార్త 8వ అధ్యాయము

 1. ఆ తరువాత యేసు పట్టణములందును, గ్రామములందును పర్యటించుచు, దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. పన్నిద్దరు శిష్యులును,

2. అపవిత్రాత్మలనుండియు, రోగముల నుండియు స్వస్థులైన కొందరు స్త్రీలును ఆయన వెంట ఉండిరి. ఏడుదయ్యములనుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ,

3. హేరోదు గృహ నిర్వాహకుడగు 'ఖూజా' భార్యయగు యోహాన్నయు, సూసన్నయు, మరియు వారిసొంత వనరులనుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలును వెంట ఉండిరి.

4. ప్రతి పట్టణమునుండి పెద్ద ప్రజా సమూహము యేసువద్దకు వచ్చెను.

5. అపుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప నారంభించెను: “విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను. అతడు విత్తనములు చల్లునపుడు కొన్ని విత్తన ములు త్రోవప్రక్కనపడగా అవి తొక్కివేయబడెను, పక్షులువచ్చి వాటిని తినివేసెను.

6. మరికొన్ని రాతినేలమీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండి పోయెను.

7. మరికొన్ని విత్తనములు ముండ్లపొదల మధ్య పడినవి. కాని మొక్కలతో పాటు ముండ్లపొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి.

8. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి” అని చెప్పి, “వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అనెను.

9. యేసు శిష్యులు అపుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి.

10. “పరలోకరాజ్య పరమరహస్యముల జ్ఞానము అను గ్రహింపబడినది మీకే, ఇతరులు చూచియు చూడ కుండుటకు, వినియు గ్రహింపకుండుటకు, వారికి ఉపమానముల మూలమున బోధింపబడును.

11. “ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు.

12. త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలినవారు దేవునివాక్కులను ఆలకింతురుగాని, వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయమునుండి వాటిని ఎత్తుకొని పోవును.

13. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు, రాతిమీదపడిన విత్తనముల వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలదికాలము మాత్రమే విశ్వసించి శోధనకాలమున పతనమగుదురు.

14. ముండ్లపొదల మధ్యన పడిన విత్తనము లను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని, వారు ప్రాపంచిక చింతలచేత, ధనవ్యామోహముచేత, సుఖభోగములచేత అణచివేయబడి తగుఫలమును ఈయరు.

15. సారవంతమైన నేలపైబడిన విత్తనము లను పోలినవారు, యోగ్యమైన మంచిమనస్సుతో దేవుని వాక్కును ఆలకించి, అవలంబించి ఓర్పుతో ఫలించువారు.

16. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూతపెట్టడు లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును.

17. దాచబడినది ఏదియు బయలుపడక పోదు.రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు.

18. ఉన్నవానికే ఈయబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకొనునది కూడ తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు.

19. యేసు తల్లియు, సోదరులును ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుటవలన ఆయనను కలసికొనలేకపోయిరి.

20. “నీ తల్లియు, సోదరులును, నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు” అని ఒకరు చెప్పిరి.

21. అందుకు యేసు వారితో “దేవుని వాక్కును ఆలకించి, పాటించువారె నా తల్లియు నా సోదరులు" అని పలికెను.

22. ఒక రోజు యేసు శిష్యసమేతముగా పడవ నెక్కి వారితో “మనము సరస్సు ఆవలితీరమునకు పోవుదము" అనెను. వారు అటులనే పయనమైరి.

23. పడవపై వారు పోవుచుండగా యేసు అందు నిద్రించుచుండెను. అంతలో గాలివాన వీచినందున పడవ నీటితోనిండి పెద్ద ప్రమాదమునకు గురి ఆయెను.

24. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి ఆయనను నిదురనుండి మేలుకొలిపి “ప్రభూ! ప్రభూ! మేము నశించిపోవుచున్నాము” అనిరి. యేసు మేలుకొని గాలిని, అలలను గద్దింపగా అవి నిలచిపోయి, ప్రశాంతత కలిగెను.

25. యేసు “మీ విశ్వాసము ఎక్కడ?" అని వారితో అనెను. అప్పుడు వారు భయ పడుచు ఆశ్చర్యముతో “గాలియు, అలలు సహితము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.

26. ఆ తరువాత వారు ఆవలి తీరమందు గలిలీయకు ఎదురుగా ఉన్న గెరాసేనుల ప్రాంతము నకు వచ్చిరి.

27. ఆయన తీరమున కాలుమోపగానే పిశాచపీడితుడు ఒకడు కనిపించెను. వాడు చాల రోజులనుండి బట్టలు కట్టుకొనక, ఇంటిలో కాకుండ సమాధుల మధ్యలోనే నివసించుచుండెను.

28. వాడు యేసును చూడగానే ఆయన యెదుట సాగిలపడి, “సర్వోన్నతుడవగు దేవునికుమారా! యేసూ! నాతో నీకేమిపని? నన్ను హింసింపవలదని ప్రార్థించు చున్నాను” అని కేకలు పెట్టెను.

29. వానినుండి వెంటనే వెలికిరమ్మని ఆయన ఆ అపవిత్రాత్మను ఆదేశించెను. ఏలన అది పదేపదే వానిని ఆవహించుచుండెను. ప్రజలు వానిని ఇనుప గొలుసులతో కట్టి కాపలాలో ఉంచిరి. కానివాడు తన బంధములను ట్రెంపుకొనెడి వాడు. అపుడు దయ్యము వానిని ఎడారికి తరుముకొని పోయెడిది.

30. “నీ పేరేమి?" అని యేసు ప్రశ్నించెను. అనేక భూతములు వానిని ఆవహించి ఉండుటచే వాడు తన పేరు 'దళము' అని చెప్పెను.

31. “మేము అగాధమున ప్రవేశించునట్లు ఆజ్ఞాపింపవలదు” అని అవి ఆయనను అర్థించెను.

32. అపుడు అచటకొండచరియపై పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. “ఆ పందులలో ప్రవేశించుటకు మాకు అనుమతి నొసగుడు" అని దయ్యములు ప్రార్థింపగా యేసు అందుకు అను మతించెను.

33. అపుడు ఆ భూతములు వానిని విడిచి పందులలో చొచ్చెను. వెంటనే అవి ఆ కొండ చరియనుండి వేగముగా పరుగెత్తి సరస్సులోపడి, మునిగిచచ్చెను.

34. పందుల కాపరులు అది చూచి పరుగెత్తుకొనిపోయి పట్టణములలోను, పరిసర ప్రాంతములలోను ఈ విషయమును వెల్లడించిరి.

35. ప్రజలు ఈ వింతను చూచుటకై యేసు వద్దకు వచ్చి దయ్యములు పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి భయభ్రాంతులైరి.

36. అంతకుముందు అది చూచినవారు దయ్యముల నుండి వాడు ఎట్లు విముక్తుడై స్వస్థత నొందెనో వారికి వివరించిరి.

37. గెరాసేనులోని జనులెల్లరు మిక్కిలి భయపడి తమను విడిచిపొమ్మని ఆయనను ప్రార్థించిరి. కనుక యేసు పడవ ఎక్కి తిరుగు ప్రయాణమాయెను.

38. దయ్యములనుండి విముక్తి పొందినవాడు “నన్ను మీతో ఉండనిండు” అని ఆయనను వేడుకొనెను.

39. కాని యేసు వానితో “నీవు ఇంటికిపోయి దేవుడు నీకు చేసిన మహోపకారమును జనులకు తెలుపుము" అనెను. వాడు వెళ్ళి యేసు తనకు కావించిన మహో పకారమును గూర్చి పట్టణమంతటను ప్రచారము గావించెను.

40. జనసమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండెను. కనుక ఆయన తిరిగివచ్చినపుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి.

41. ప్రార్థనామందిర అధికారియగు యాయీరు వచ్చి యేసు పాదములపై బడి తన ఇంటికి రమ్మని ప్రార్ధించెను.

42. ఎందుకన, సుమారు పండ్రెండేండ్ల ప్రాయముగల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన పోవుచుండగా ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి.

43. పండ్రెండేండ్లనుండి రక్తస్రావమగుచు బాధ పడుచున్న స్త్రీ ఒకతె తనకున్న ధనమంతయు వెచ్చించి నను, ఏ వైద్యునివలనను స్వస్థత పొందజాలక పోయెను.

44. వెనుక ప్రక్కగా వచ్చి ఆమె యేసు అంగీ అంచును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

45. "నన్ను తాకినది ఎవరు?” అని యేసు అడుగగా అందరు "మేము ఎరుగము" అనిరి. అపుడు పేతురు “బోధకుడా! నీ చుట్టును ప్రజలు క్రిక్కిరిసియున్నారు గదా!” అనెను.

46. అందుకు యేసు “నన్ను ఎవరో తాకిరి. నాలోనుండి శక్తి వెలువడినది" అని పలికెను.

47.తాను ఇక రహస్యముగా ఉండజాలనని గ్రహించిన ఆ స్త్రీ వణకుచు ఆయన పాదముల పై పడి, తాను ఎందుకు ఆయనను తాకినదియును, వెంటనే ఎట్లు స్వస్థత పొందినదియును, జనులందరియెదుట వివరించెను.

48. అపుడు ఆయన "కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. ఇక సమాధానముగా పొమ్ము" అనెను.

49. యేసు అట్లు చెప్పుచుండగనే యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి "మీ కుమార్తె మరణించి నది. ఇంకను బోధకుని శ్రమపెట్టకుడు” అని అతనితో చెప్పెను.

50. యేసు ఆ మాటవిని యాయీరుతో “భయపడవలదు. విశ్వసింపుము. నీ కుమార్తె స్వస్థత పొందును” అనెను.

51. ఇంటికి వచ్చిన తరువాత పేతురు, యాకోబు, యోహానులను ఆ బాలిక తల్లి దండ్రులను తప్ప మరెవ్వరిని తనవెంటలోనికి రానీయలేదు.

52. అందరు ఆమె కొరకు ఏడ్చుచు, శోకించుచుండగా, “మీరు ఏడువవలదు. ఈ బాలిక నిద్రించుచున్నది కాని చనిపోలేదు”అని యేసు వారితో పలికెను.

53. ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియును. కనుక వారు ఆయనను హేళనచేసిరి.

54. కాని యేసు ఆమె చేయిపట్టుకొని “బాలికా లెమ్ము” అని చెప్పగా,

55. వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగివచ్చి లేచి కూర్చుండెను. అప్పుడు ఆయన ఆమెకు తినుటకు ఏమైన పెట్టుడని ఆదేశించెను.

56. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచ కితులైరి. ఈ సంఘటన ఎవరికిని తెలుపవలదని యేసు వారిని ఆజ్ఞాపించెను.