ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 6 || Telugu catholic Bible || లూకా సువార్త 6వ అధ్యాయము

 1. యేసు ఒక విశ్రాంతిదినమునపంటచేల గుండ పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నులిమికొని తినసాగిరి.

2. “విశ్రాంతిదినమున నిషేధింపబడిన కార్యమును మీరుఏల చేయుచున్నారు?” అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి.

3. అందుకు యేసు వారితో “దావీదు, అతని అనుచరులు ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు ఎరుగరా?

4. అతడు దేవుని ఆలయములో ప్రవేశించి, యాజకులు తప్ప, ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని, తన అనుచరులకును పెట్టెనుగదా!

5.మరియు మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు అధిపతి” అని చెప్పెను.

6. యేసు మరియొక విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింపనారంభించెను. అచట కుడిచేయి ఊచపోయినవాడు ఒకడు ఉండెను.

7. విశ్రాంతిదినమున స్వస్థపరచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు పొంచియుండిరి.

8. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచచేయివానితో "లేచి మా మధ్యన నిలువబడుము” అనెను. వాడు అట్లే లేచి నిలబడెను.

9. ఆయన వారితో “విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా? కీడుచేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా? జీవితమును నాశనము చేయుట న్యాయమా? అని మిమ్ము ప్రశ్నించుచున్నాను” అని చుట్టుప్రక్కల

10. కలియచూచి, వానితో “నీ చేయి చాపుము” అనెను. వాడు అటులనే చేయిచాచెను. వాని చేయి రెండవ చేతివలె బాగుపడెను.

11. అది చూచి వారు వెట్టికోపముతో యేసును ఏమిచేయు దమా? అని మంతనములు సలుపసాగిరి.

12. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసికొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవప్రార్ధనలో మునిగియుండెను.

13. ప్రాతఃకాలమున తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను.

14. వారు: పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు అంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోల్లోమయి,

15. మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను,

16. యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదాఇస్కారియోతు.

17. అటుపిమ్మట యేసు వారితోగూడ కొండ దిగివచ్చి, పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతటనుండియు యెరూషలేమునుండియు, తూరు సీవోను అను సముద్రతీరపు పట్టణములనుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి.

18. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి.

19. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరిని స్వస్థపరచుటవలన జనులెల్లరు ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి.

20. యేసు కనులెత్తి శిష్యులవైపు చూచి , ఇట్లు ఉపదేశింప ఆరంభించెను: “పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్య ము మీది.

21. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు. ఇపుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు.

22. మనుష్యకుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినపుడు మీరు ధన్యులు.

23. ఆరోజున మీరు ఆనందపడుడు. మహానందపడుడు. ఏలయన, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలపట్ల ఇట్లే ప్రవర్తించిరి.

24. అయ్యో! ధనికులారా! మీకనర్థము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు.

25. అయ్యో! ఇపుడు కడుపునిండినవారలారా! మీకు అనర్ధము. మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో! ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు.

26. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి.

27. “కాని, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు.

28. మిమ్ము శపించువారిని ఆశీర్వదిం పుడు. మిమ్ము బాధించువారికై ప్రార్థింపుడు.

29. నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంషను కూడా చూపుము. నీ పైబట్టను ఎత్తుకొనిపోవు వానిని నీ అంగీనికూడ తీసికొనిపోనిమ్ము.

30. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు.

31. ఇతరులు మీకు ఎట్లు చేయ వలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు.

32. మిమ్ము ప్రేమించినవారిని మాత్రమే మీరు ప్రేమించినచో యిందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా?

33. ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసినయెడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా?

34. తిరిగి ఈయగల వారికే ఋణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులును అటుల పాపులకు ఇచ్చుటలేదా?

35. కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగిపొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్న తుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞతలేని వారికిని, దుష్టులకును మేలుచేయును.

36. మీ తండ్రివలె మీరును కనికరము గలవారై యుండుడు.

37. "పరులనుగూర్చి మీరు తీర్పుచేయకుడు. మిమ్మును గూర్చియు తీర్పుచేయబడదు. పరులను ఖండింప కుడు. అపుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు. మీరును క్షమింపబడుదురు.

38. పరులకు మీరు ఒసగుడు. మీకును ఒసగబడును, కుదించి, అదిమి, పొర్లిపోవు నిండుకొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలువబడును” అని యేసు పలికెను.

39. ఆయన మరల వారికి ఉపమాన పూర్వక ముగా ఇట్లు చెప్పెను. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువు రును గోతిలో పడుదురుగదా!.

40. శిష్యుడు తన గురువుకంటె గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువువలె ఉండును.

41. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల?

42. నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సోదరునితో, 'సోదరా! నీ కంటిలోని నలుసును తీసి వేయనిమ్ము' అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారీ! ముందుగా నీకంటిలోని దూలమును తీసివేసికొనుము. అపుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగానుండును.

43. “మంచిచెట్టు చెడుపండ్లను, చెడు చెట్టు మంచిపండ్లను ఈయజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును.

44. ముండ్లపొదలనుండి అత్తిపండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు.

45. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశ మునుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన, హృదయ పరిపూర్ణతనుండి నోటిమాట వెలువడును.

46. “నేను చెప్పినట్లు చేయక, 'ప్రభూ! ప్రభూ!' అని నన్ను ఊరక పిలుచుచున్నారేల?

47. నాయొద్దకు వచ్చి, నాబోధలను ఆలకించి, ఆవిధముగా ఆచరించు వాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను.

48. వాడు లోతుగా త్రవ్వి, రాతిమీద పునాది వేసి, ఇల్లు కట్టుకొనిన వానిని పోలియుండును. వరదవచ్చి, ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను, అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కుచెదరలేదు.

49. కాని నా బోధలు వినియు, ఆచరింపనివాడు, పునాది వేయక నేలపై ఇల్లు కట్టినవానిని పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే, అది కూలిపోయెను. ఆ వినాశనము ఎంత భయంకరము!"