1. అప్పుడు వారందరు లేచి యేసును పిలాతు వద్దకు తీసికొనిపోయిరి.
2. “ఇతడు మా జనములను తిరుగుబాటుచేయ పురిగొల్పుచూ కైసరునకు పన్ను చెల్లింపవద్దనియు, తన్ను తాను క్రీస్తు అను ఒక రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము” అని ఆయనమీద నేరము మోపసాగిరి.
3. పిలాతు ఆయనను “నీవు యూదుల రాజువా?” అని అడుగగా అందుకు ఆయన “నీవే చెప్పుచున్నావు” అని బదులు పలికెను.
4. అపుడు పిలాతు ప్రధానార్చకులతో, ప్రజా సమూహములతో “నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు” అని పలికెను.
5. "ఇతడు గలిలీయ ప్రాంతము మొదలు, ఇచ్చట వరకును, యూదయాసీమ అంతట, బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు” అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి.
6. ఆ మాటలు విని పిలాతు “ఇతడు గలిలీయ నివాసియా?” అని అడిగెను.
7. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలిసికొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను.
8. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయన, ఆయనను గూర్చి చాలవిని ఉన్నందున చాల దినములనుండి ఆయనకొరకై ఎదురుచూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి,
9. హేరోదు యేసును అనేక విషయములనుగూర్చి ప్రశ్నించెను. కాని, ఆయన సమాధానమేమియు ఈయలేదు.
10. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి.
11. అపుడు హేరోదు, అతని సైనికులు ఆయనను నిరాదరించి, పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి, ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి.
12. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి.
13. అపుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి,
14. “ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నాయొద్దకు తీసికొనివచ్చితిరి. నేను మీయెదుట ఇతనిని పరీక్షించితిని. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమియు నాకు కనిపించుటలేదు.
15. హేరోదునకు కూడ ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు. కనుక, ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియు చేయలేదు.
16. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచి పెట్టెదను” అనెను.
17. పాస్క ఉత్సవములో ఒక బందీని విడుదలచేయు ఆచారము పిలాతునకు కలదు.
18. అంతట అందరు ఏకకంఠముతో “ఇతనిని చంపివేయుడు. మాకు బరబ్బను విడుదల చేయుడు” అని కేకలు పెట్టిరి.
19. బరబ్బ నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను.
20. పిలాతు యేసును విడిచి పెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరల మాట్లాడినను,
21. వారు “అతనిని సిలువ వేయుడు. సిలువ వేయుడు” అని కేకలు వేసిరి.
22. మూడవ పర్యా యము పిలాతు “ఇతడు చేసిన నేరమేమి? మరణ శిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపింప లేదు. కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడచి పెట్టుదును” అని వారితో చెప్పెను.
23. కాని వారు “అతనిని సిలువవేయుడు” అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది.
24. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను.
25. తిరుగుబాటు, హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరిక పై అతడు విడుదల చేసెను. కాని, యేసును వారి ఇష్టానుసారము చేసికొనుటకు వారికి అప్పగించెను.
26. వారు యేసును తీసికొని పోవుచున్నపుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతమునుండి వచ్చుచున్న కురేనియ సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి.
27. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి.
28. యేసు వారిని చూచి “యెరూషలేము కుమార్తెలారా! నా కొరకు ఏడువవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు.
29. ఏలయన, 'ఇదిగో! గొడ్రాళ్ళు, బిడ్డలను కనని గర్భములు, చనుబాలియ్యని స్తనములును ధన్యమైనవి' అని ప్రజలు చెప్పుదినములు రానున్నవి.
30. అపుడు ప్రజలు, 'మామీద పడుడు' అని పర్వతములతోను, 'మమ్ము కప్పివేయుడు' అని కొండలతోను చెప్పనారంభింతురు.
31. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినపుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము?” అనెను.
32. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడ ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి.
33. 'కపాలము' అనబడు స్థలమునకు వచ్చినప్పుడు, అక్కడ వారు యేసును సిలువవేసిరి. నేరస్థులను కూడ యేసు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని సిలువవేసిరి.
34. అప్పుడు యేసు, "తండ్రీ! వీరు చేయునదేమో వీరు ఎరుగరు. వీరిని క్షమింపుము" అని పలికెను. వారు ఓట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి.
35. ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. “ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము” అని అధికారులు ఆయనను హేళనచేసిరి.
36. సైనికులు కూడ ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి,
37. “యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము” అని పరిహసించిరి.
38. "ఇతడు యూదుల రాజు” అని ఫలకమున వ్రాసి సిలువ పైభాగమున ఉంచిరి.
39. సిలువవేయబడిన నేరస్తులలో ఒకడు. “నీవు క్రీస్తువు గదా! అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములనుకూడ రక్షింపుము” అని ఆయనను నిందింపసాగెను.
40. రెండవవాడు వానిని గద్దించుచు “నీవు దేవునికి భయపడవా? నీవు కూడ అదే శిక్షను పొందుచున్నావుగదా!
41. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు” అని,
42. యేసు వంకకు తిరిగి, “యేసూ! నీవు నీ రాజ్యములో ప్రవేశించునపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము” అని విన్నవించెను.
43. యేసు వానితో “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను” అనెను.
44. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. మూడుగంటల వరకు దేశమంతట చీకటి క్రమ్మెను.
45. దేవాలయపు తెర నడిమికి చినిగెను.
46. అపుడు యేసు బిగ్గరగా, “తండ్రీ! నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను” అని పలికి ప్రాణము విడిచెను.
47. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు “నిశ్చయముగ ఇతడు నీతిమంతుడు!” అనెను.
48. అచట గుమిగూడిన ప్రజలందరు ఈ సంఘటనలనుచూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి.
49. గలిలీయనుండి యేసు వెంటవచ్చిన ఆయన పరిచితులందరును, స్త్రీలును కొంతదూరము నుండి ఇదంతయు చూచు చుండిరి.
50. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసియైన యోసేపు అను ఒకడుండెను. అతడు యూదుల పట్టణసభ సభ్యుడు. మంచివాడు, నీతి మంతుడు,
51. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు.
52. అతడు పిలాతు వద్దకు వెళ్ళి, యేసు దేహమును అడిగెను.
53. యేసు శరీరమును సిలువ నుండి దించి, సన్నని నారబట్టతో చుట్టి, ఎవరును ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి యందుంచెను.
54. అది సిద్ధపడు దినము. విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను.
55. అప్పుడు గలిలీయనుండి ఆయనవెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహము ఉంచబడిన విధమును చూచిరి.
56. వారు తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతిదినమున విశ్రాంతి తీసికొనిరి.