ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 2 || Telugu catholic Bible || లూకా సువార్త 2వ అధ్యాయము

 1. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను.

2. ఈ మొదటి జనాభాలెక్కల సేకరణ కురేనియ, సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను.

3. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరు తమతమ పట్టణములకు వెళ్ళిరి.

4. యోసేపు, దావీదు వంశస్తుడైనందున గలిలీయసీమలోని నజరేతునుండి యూదయా సీమలో ఉన్న దావీదునగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై,

5. తనకు ప్రధానము చేయబడినట్టియు, గర్భవతియునైన మరియమ్మనుకూడ వెంటబెట్టుకొని వెళ్ళెను.

6. వారచట ఉన్నపుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను.

7. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను.

8. ఆ ప్రాంతమున గొఱ్ఱెలకాపరులు రాత్రివేళ పొలములో గొఱ్ఱెల మందలను కాయుచుండిరి.

9. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి.

10. దేవదూత వారితో ఇట్లనెను: “మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను.

11. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు.

12. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదేయే మీకు ఆనవాలు” అనెను.

13. వెంటనే ఆ దేవదూతతో పరలోకదూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను:

14. 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగువారికి శాంతి కలుగుగాక!'

15. దేవదూతలు తమయొద్దనుండి పరలోకము నకు వెళ్ళిన పిదప “ప్రభువు మనకు ఎరుకపరచిన సంఘటనను చూచుటకు బేత్లెహేమునకు వెళ్ళుదము” అని గొఱ్ఱెలకాపరులు తమలో తాము అనుకొనిరి.

16. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

17. వారు శిశువునుగురించి విన్న విషయములనెల్ల వెల్ల డించిరి.

18. గొఱ్ఱెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

19. కాని, మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను.

20. గొఱ్ఱెలకాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని, చూచినవానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి.

21. ఎనిమిదిదినములు గడచిన పిమ్మట శిశువునకు సున్నతిచేసి, ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు 'యేసు' అని పేరు పెట్టిరి.

22. మోషే చట్టప్రకారము వారు శుద్ధిగావించు కొనవలసినదినములు వచ్చినవి.

23. 'ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును' అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసికొనిపోయిరి.

24. చట్టప్రకారము “ఒక జత గువ్వలనైనను, రెండు పావురముల పిల్లలనైనను” బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి.

25. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను.

26. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను.

27. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసికొనిరాగా,

28. సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసికొని దేవుని ఇట్లు స్తుతించెను:

29. “ప్రభూ! నీమాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము.

30-31. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని.

32. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు.”

33. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతనితల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి.

34. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను: “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు.

35. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది.”

36. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి,

37.ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరము లుగా విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయెను. ఉపవాసములు, ప్రార్థనలు చేయుచు, రేయింబవళ్లు దేవుని సేవలో మునిగియుండెను.

38. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను.

39. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి, గలిలీయప్రాంతములోని తమ పట్టణమగు నజరేతు నకు తిరిగివచ్చిరి.

40. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అను గ్రహము ఆయనపై ఉండెను.

41. ఆయన తల్లిదండ్రులు ప్రతిసంవత్సరము పాస్కపండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు.

42. యేసు పండ్రెండేండ్ల వయస్సు గలవాడైనపుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి.

43. పండుగదినములు ముగిసిన పిదప, వారు తిరుగు ప్రయాణమైరి. కాని, బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి.

44. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి, ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అపుడు వారు తమ బంధువులలోను. పరిచితులలోను బాలుని వెదుకనారంభించిరి.

45. వెదకివెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

46. మూడుదినములైన తరువాత దేవాలయములో వేదబోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు, తిరుగు ప్రశ్నలువేయుచున్న ఆయనను వారు కనుగొనిరి.

47. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి.

48. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్య పడిరి. అపుడు తల్లి ఆయనతో “కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి” అనెను.

49. “మీరు నాకొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పనిమీదనుండ అవశ్యమని మీకు తెలియదా?” అని ఆయన బదులు పలికెను.

50. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి.

51. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి, తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నియు మనస్సున పదిలపరచుకొని ఉండెను.

52. యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను.