1. ఎల్లప్పుడు ప్రార్ధన సలుపుటకు, నిరుత్సాహ పడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:
2. “ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు. మానవులను లక్ష్యపెట్టడు.
3. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి 'నాకు న్యాయము చేకూర్చుము. నా ప్రత్యర్థినుండి కాపాడుము' అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది.
4. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కాని అతడు 'నేను దేవునికి భయపడను. మానవులను గౌరవింపను.
5. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున, ఈమె పదేపదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై, ఈమెకు న్యాయము చేకూర్చెదను' అని తలంచెను.”
6. అంతట యేసు ఇట్లనెను: “అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమిపలికెనో వింటిరిగదా!
7. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా?
8. దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునపుడు ఈ భూమిమీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా?”
9. పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియు, తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను:
10. “ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు. మరొకడు సుంకరి.
11. పరిసయ్యుడు నిలుచుండి తనలోతాను 'ఓ దేవా! నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను.
12. నేను వారమునకు రెండుమారులు ఉపవాస ముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను' అని ప్రార్ధించెను.
13. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తు టకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, 'ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము' అని ప్రార్ధించెను.
14. దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింప బడి, ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తననుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును.”
15. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను తాకవలెనని యేసు వద్దకు తీసికొనిరాగా, శిష్యులు వారిని గద్దించిరి.
16. కాని యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరబిలిచి, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంకపరపకుడు. ఏలయన అట్టి వారిదే పరలోకరాజ్యము.
17. పసిబిడ్డవలె దేవుని రాజ్యమును స్వీకరింపనివాడు ఎన్నటికిని అందులో ప్రవేశింపజాలడు అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను” అనెను.
18. అంతట ఒక అధికారి యేసును సమీపించి, “సత్పురుషుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసినదేమి?” అని ప్రశ్నించెను.
19. అందులకు యేసు నన్ను “సత్పురుషుడా అని ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే తప్ప, మరియెవ్వడును సత్పురుషుడు కాడు.
20. దైవాజ్ఞలు నీకు తెలియునుకదా! వ్యభిచరింపకుము, నరహత్య చేయకుము, దొంగి లింపకుము, అబద్దసాక్ష్యములు పలుకకుము, నీ తల్లిదండ్రులను గౌరవింపుము” అని పలికెను.
21. అపుడు అతడు “నేను వీటినన్నిటిని యవ్వనము నుండియు పాటించితిని” అని బదులు పలికెను.
22. అందుకు యేసు “నీలో ఇంకను ఒక కొరత ఉన్నది. వెళ్ళి, నీ సమస్తమును. అమ్మి పేదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము చేకూరును. అపుడు వచ్చి నన్ను వెంబడింపుము" అని చెప్పెను.
23. ఆ యువకుడు మిక్కిలి ధనవంతుడు అగుటచే ఈ మాట విని బాధపడెను.
24. యేసు అతనిని చూచి ఇట్లు పలికెను: “ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!
25. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటె, ఒంటె సూది బెజ్జమున దూరిపోవుట సులభ తరము” అనెను.
26. అది వినుచున్నవారు “అటులయిన ఎవడు రక్షణ పొందగలడు?” అని ప్రశ్నించిరి.
27. అందుకు యేసు “మానవునకు అసాధ్యమయినది దేవునకు సాధ్యమగును” అని బదులు చెప్పెను.
28. పేతురు యేసుతో “మేము మా సమస్తమును విడిచి పెట్టి మిమ్ము అనుసరించితిమి" అని పలికెను.
29. అందుకు యేసు “దేవునిరాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు
30. ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్యజీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.
31. పిమ్మట యేసు పన్నిద్దరితో పయనమై పోవుచు ఇట్లు చెప్పెను: “ఇదిగో! మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. ప్రవక్తలు మనుష్య కుమారునిగురించి వ్రాసినవి అన్నియు నెరవేరును.
32. ప్రజలు ఆయనను అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను పరిహసించి, దూషించి, ఆయనపై ఉమియుదురు.
33. కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవదినమున ఆయన ఉత్థానుడు అగును.”
34. ఈ విషయములు ఏమియు వారికి బోధపడలేదు. అందలి అంతరార్థము వారికి తెలియజేయబడ నందున వారు గ్రహింపలేకపోయిరి.
35. యేసు యెరికో పట్టణమును సమీపించు చుండగా త్రోవప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను.
36. వాడు ప్రజలు గుంపులుగా నడచుచప్పుడు విని “విశేషమేమి?" అని అడిగెను.
37. “నజరేతు నివాసియగు యేసు వెళ్ళు చున్నాడు” అని ప్రజలు వానికి చెప్పిరి.
38. అంతట వాడు “యేసూ! దావీదుకుమారా! నన్ను కరుణింపుము” అని కేకలు వేసెను.
39. ముందు నడచు ప్రజలు వానిని ఊరకుండుమని కసరుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా “దావీదుకుమారా! నన్ను కనికరింపుము” అని కేకలు పెట్టసాగెను.
40. యేసు నిలచి వానిని తన వద్దకు తీసికొనిరమ్మని ఆజ్ఞాపించెను.
41. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో “నేను నీకేమి చేయ కోరుదువు?” అని అడిగెను. "ప్రభూ! నాకు దృష్టి దానము చేయుడు” అని వాడు బదులు పలికెను.
42. "అట్లే నీ చూపును పొందుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది” అని యేసు పలికెను.
43. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది, దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరు దేవుని స్తుతించిరి.