ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 17 || Telugu catholic Bible || లూకా సువార్త 17వ అధ్యాయము

 1. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు: “పాపపు శోధనలు రాకతప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్ధము.

2. ఈ చిన్నవారిలో ఎవ్వని నైన పాపము చేయుటకు పురిగొల్పినచో, అట్టివాడు మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

3. జాగరూకులు కండు. నీ సోదరుడు తప్పిదము చేసినయెడల అతనిని మంద లింపుము. అతడు పశ్చాత్తాప పడినయెడల అతనిని క్షమింపుము.

4. అతడు దినమునకు ఏడు పర్యాయ ములు నీపట్ల తప్పిదము చేసి, ఏడుమార్లు నీ వద్దకు వచ్చి 'నేను పశ్చాత్తాప పడుచున్నాను' అని నీతో చెప్పిన యెడల, వానిని క్షమింపుము" అని చెప్పెను.

5. శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసమును పెంపొందింపుము” అని కోరిరి.

6. “మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో, ఈ కంబళి చెట్టును 'వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటుకొనుము' అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును.

7. “అప్పుడే పొలమునుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా?

8. అట్లుగాక, యజమానుడు అతనితో 'వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము.నా భోజనము ముగియువరకు వడ్డన చేయుచు, వేచియుండుము. ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము' అని చెప్పును గదా!

9. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడుగదా!

10. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట 'మేము అయో గ్యులమగు సేవకులము. మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి' అని పలుకుడు” అనెను.

11. యేసు సమరియా, గలిలీయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను.

12. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,

13. గొంతెత్తి, “ఓ యేసుప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి.

14. యేసు వారిని చూచి “మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు” అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధిపొందిరి.

15. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి,

16. యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు.

17. అపుడు యేసు “పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ?

18. తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?” అనెను.

19. పిదప యేసు అతనితో “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్ళుము” అనెను.

20. దేవునిరాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: “దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు.

21. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది.”

22. యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: “మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని మీరు చూడరు.

23. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు.

24. ఏలయన మెరపు మెరసి ఒక దిక్కునుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్యకుమారుని రాకడ ఉండును.

25. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను.

26. నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును.

27. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది.

28. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి.

29. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశమునుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి.

30. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును.

31. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి పోరాదు.

32. లోతు భార్యను గుర్తు చేసికొనుడు.

33. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును.

34.' ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కొనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును.

35. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును.”

36-37. “ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?” అని శిష్యులు ప్రశ్నించిరి. “కళేబరమున్న చోటనే రాబందులు చేరును” అని యేసు చెప్పెను.