ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 12 || Telugu catholic Bible || లూకా సువార్త 12వ అధ్యాయము

 1. అంతలో వేలాది ప్రజలు గుమిగూడి తొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను: “పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవర్తనను గూర్చి, మీరు జాగరూకులై ఉండుడు.

2. దాచబడినది ఏదియు బయటపడకపోదు. రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు.

3. మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారు మూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును.

4."మిత్రులారా! నేను మీతో చెప్పునదేమన, మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు. వారు అంతకుమించి ఏమియు చేయజాలరు.

5. మీరు ఎవనికి భయపడవలెనో చెప్పెదను. మిమ్ములను చంపి, నరకకూపమున పడవేయగల వానికి భయ పడుడు. అవును, వానికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను.

6. రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్మ బడుటలేదా? కాని, వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు.

7. మీ తలవెంట్రుకలు గూడ లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు. మీరు అనేక పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”

8. “నన్ను మనుష్యులయెదుట అంగీకరించు వానిని మనుష్యకుమారుడు కూడ దేవదూతలయెదుట అంగీకరించును.

9. కాని మనుష్యులయెదుట నన్ను నిరాకరించువాడు దేవదూతలయెదుట నిరాకరించ బడును.

10. మనుష్యకుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును. కాని, పవిత్రాత్మను దూషించు వాడు క్షమింపబడడు.

11. వారు మిమ్ము ప్రార్థనామందిరములకు, పెద్దల యొద్దకును, అధిపతులయొద్దకును కొనిపోయి నపుడు, మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్ప వలయునా అని విచారింపకుడు.

12. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్రాత్మ మీకు నేర్పును.”

13. జనసమూహమునుండి ఒకడు “బోధకుడా! పిత్రార్జితమున నాకు పాలుపంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము” అనెను.

14. అందుకు యేసు “నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీ దారునిగాను నియమించెను?

15. జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకును లోనుకాకుడు. ఏలయన, మానవ జీవితము సిరిసంపదల సమృద్ధిలో లేదు” అని చెప్పెను.

16. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను: “ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి.

17. అతడు ఇట్లనుకొనెను: 'నేను ఏమి చేయవలయును? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు.

18. ఒక పని చేసెదను. కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును, సరకులను అన్నిటిని భద్రపరచెదను'.

19. నాతో ఇట్లని చెప్పుకొందును. 'నా ప్రాణమా! నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము. తిని, త్రాగి ఆనందింపుము.'

20. కాని దేవుడు అతనితో 'ఓరి! అవివేకి! ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అపుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును?” అనెను.

21. తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్య వంతులు కారు” అని చెప్పెను.

22. పిమ్మట యేసు తన శిష్యులతో, “జీవితమునకు అవసరమైన అన్నపానీయములకై, దేహమునకు అవసరమైన వస్త్రములకై చింతింపకుడు.

23. మీ జీవితము ఆహారముకంటెను, మీ దేహము వస్త్రములకంటెను విలువయినవి కావా?

24. ఆకాశమున సంచరించు పక్షులను చూడుడు. అవి విత్తనములను నాటవు. నూర్పిడులు చేయవు. గిడ్డంగు లలో ధాన్యమును నిలువచేయవు. అయినను దేవుడు వానిని పోషించుచున్నాడు. మీరు పక్షులకంటె ఎంతో విలువైన వారు కారా?

25. మీలో ఎవడైన చింతించు టవలన తన ఆయువును ఒక్క గడియయిన పెంపుచేసి కొనగలడా?

26. మీరు ఇంత స్వల్పకార్యమైనను చేయలేనపుడు ఇతర విషయములను గురించి ఏల చింతించెదరు?

27. లిల్లీ పుష్పములు ఎట్లు పెరుగు చున్నవో చూడుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములు చేయుటలేదు. అయినను సకల వైభవ సమేతుడగు సొలోమోను సైతము వీనిలో ఒక్కదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచు న్నాను.

28. అల్పవిశ్వాసులారా! నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా, అంతకంటే ఎక్కువగా మిమ్ము గురించి యోచింపడా?

29. కావున, ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అని మీరు కలత చెందకుడు.

30. వీనిని అన్నిటిని ఈ లోకపు జనులు కాంక్షింతురు. ఏలయన, పరలోకమందుండు మీ తండ్రి ఈ మీ అవసరములనెల్ల గుర్తించును.

31. మొదట ఆయన రాజ్యమును వెదకుడు. అప్పుడవన్నియు మీకు సమకూర్పబడును.

32. “ఓ చిన్నమందా! భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము.

33. మీ ఆస్తులను అమ్మి దానముచేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చెద పురుగులు తినివేయవు.

34. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయముండును.

35. “మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు.

36. తమ యజమానుడు వివాహమహోత్సవమునుండి తిరిగివచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారివలె ఉండుడు.

37. యజమానుడు వచ్చునప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, వారిని భోజనమునకు కూర్చుండబెట్టి, తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

38. అతడు అర్ధరాత్రివేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు.

39. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినయెడల అతడు మేల్కొని యుండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసికొనుడు.

40. కనుక, మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును” అని చెప్పెను.

41. “ప్రభూ! మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా? లేక అందరికిని చెప్పుచున్నారా?” అని పేతురు ప్రశ్నించేను.

42. అందుకు యేసు ఇట్లనెను: “విశ్వాసపాత్రుడును, వివేకవంతుడునైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటివారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడే.

43. యజమానుడు ఇంటికి తిరిగివచ్చినపుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు.

44. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

45. కాని, యజమానుడు చాలకాలమునకు గాని తిరిగిరాడు అని సేవకుడు తనలోతాను అనుకొని, తన తోటి దాసులను, దాసురాండ్రను కొట్టుచు, తిని, త్రాగి, మత్తుగాపడి ఉండిన యెడల,

46. అతడు ఊహింపని సమయములో, యోచింపని గడియలో యజమానుడు తిరిగివచ్చి, ఆసేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును.

47. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగ ఉండనట్టియు, యజమానుని ఇషానుసారము నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును,

48. కాని తెలియక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో, వానినుండి మరి ఎక్కువగా అడుగుదురు,

49. “నేను భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసి నది.

50. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయును. అది నెరవేరునంతవరకు నామనస్సు నకు శాంతిలేదు.

51. నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను.

52. ఇకనుండి ఒకే ఇంటియందు ఐదుగురున్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకముగా ముగ్గురు విరోధులగుదురు.

53. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును.”

54. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను: “పడమట మబ్బుపట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు. అట్లే జరుగును.

55. దక్షిణపు గాలి వీచుటచూచి, వడగాలి కొట్టునని చెప్పెదరు. అది అట్లే జరుగును.

56. కపట వేషధారులారా! మీరు భూమ్యాకాశలక్షణములను గుర్తింప గలరు. మరి ఈ కాలములను ఏల గుర్తింపలేరు?

57. “ఏది సముచితమో మీరు స్వయముగ నిర్ణయించుకొనలేరేమి?

58. నీపై నీ శత్రువు వ్యాజ్యెము తెచ్చి న్యాయాధిపతియెదుటకు నిన్ను కొని పోవునపుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును. అతడు నిన్ను కారాగారమున బంధించును.

59. నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను.”