ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 10 || Telugu catholic Bible || లూకా సువార్త 10వ అధ్యాయము

 1. ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను.

2. ఆయన వారితో ఇట్లనెను: “పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక తన పంటపొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు.

3. మీరు పొండు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను;

4. మీరు జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను తీసుకొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశలప్రశ్నలు అడుగవలదు.

5. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక! అని చెప్పుడు.

6. శాంతికాముడు అచ్చట ఉన్నయెడల మీశాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును.

7. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు, త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తనకూలికి పాత్రుడుగదా! మీరు ఇల్లిల్లు తిరుగరాదు.

8. మీరు ఏ పట్టణము లోనైన ప్రవేశించునపుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి, మీముందు పెట్టునదేదో దానిని భుజింపుడు.

9. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపము నకు వచ్చినదని చెప్పుడు.

10. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి

11. 'మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు” అని వారితో చెప్పుడు.

12. తీర్పుదినమున ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను”.

13. “అయ్యో! కొరాజీనువురమా! నీకు అనర్థము! అయ్యో! బెత్సయిదాపురమా! నీకు అనర్థము! మీమధ్య చేయబడిన అద్భుతకార్యములు తూరు, సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనెపట్టలు ధరించి, బూడిద పూసికొని ఉండెడివారే.

14. కాని తీర్పుదినమున మీ గతికంటె తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును.

15. ఓ కఫర్నాముపురమా! నీవు ఆకాశమును అంటదలచితివా! నీవు పాతాళ మునకు పడద్రోయబడుదువు.

16. “మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును” అని పలికెను.

17. ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి “ప్రభూ! మీ పేరిట పిశాచములు కూడ మాకు లోబడుచున్నవి” అని చెప్పిరి.

18. అందుకు యేసు “సైతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని.

19. నేను మీకు పాములను, తేళ్ళను నలగదొక్కుటకును, శత్రువు బలమును అణగదొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి యేవియు మీకు హాని చేయజాలవు.

20. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక, మీపేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని ఆనందింపుడు” అనెను.

21. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, “ఓ తండ్రీ! పరలోకభూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము.

22. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు” అనెను.

23. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: “మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి!

24. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచు న్నవి వినగోరిరి. కాని వినజాలకపోయిరి” అని పలికెను.

25. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, “బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏమి చేయవలయును?” అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను.

26. అందుకు యేసు “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది? అది నీకెట్లు అర్థమ గుచున్నది?” అని తిరుగు ప్రశ్న వేసెను.

27. అందుకు అతడు, " 'నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణఆత్మతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము' అని వ్రాయబడియున్నది” అని పలికెను.

28. “నీవు సరిగా సమాధానమిచ్చితివి. అటులనే చేయుము. నీవు జీవింతువు” అని యేసు వానితో చెప్పెను.

29. కాని అతడు తనను సమర్థించుకొనుటకై “నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగెను.

30. యేసు ఇటుల సమాధానమిచ్చెను: “ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి, దోచుకొని, గాయ పరచి, కొనఊపిరితో విడిచిపోయిరి.

31. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు, వానిని చూచియు, తప్పుకొనిపోయెను.

32. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను.

33. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవుచు అతనిని చూచెను. వానిని చూడగనే అతడు జాలిపడి,

34. వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము, ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి, ఒక సత్రమునకు తీసికొనిపోయి పరామర్శించెను.

35. అతడు మరు నాడు రెండు దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి 'వీనిని పరామర్శింపుము. నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగివచ్చిన పిమ్మట చెల్లింపగలను' అని చెప్పెను.

36. దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు అడిగెను.

37. “కనికరము చూపినవాడే” అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో “నీవును వెళ్ళి అటులనే చేయుము” అని పలికెను.

38. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను.

39. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదములచెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను.

40. మార్తమ్మ పెక్కుపనులతో సతమత మగుచు ఆయనయొద్దకు వచ్చి “ప్రభూ! నా సహోదరి పనులన్నియు నాపై వదలి మీచెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు” అనెను.

41. అందుకు యేసు “మార్తమ్మా! మార్తమ్మా! నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు.

42. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్ను కొనినది. అది ఆమెనుండి తీసివేయబడదు” అని సమాధానమిచ్చెను.