ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Jude chapter 1 || Telugu Catholic Bible || యూదా వ్రాసిన లేఖ 1వ అధ్యాయము

 1. యేసుక్రీస్తు సేవకుడును, యాకోబు సహోదరుడునైన యూదా నుండి, దేవునిచే పిలువబడి, తండ్రియగు దేవుని ప్రేమయందును, యేసుక్రీస్తు రక్షణనందు జీవించువారికి:

2. కృప, శాంతి, ప్రేమ మీయందు విస్తరించునుగాక!

3. ప్రియులారా! మనందరి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయ ఆశించితిని. కాని దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా ఒసగిన విశ్వాసమునకై మీరు పోరాడు చునే ఉండవలెనని మిమ్ము ప్రోత్సాహపరచుట అవసరమని తోచినది. కనుకనే నేను ఇట్లు వ్రాయుచున్నాను.

4. దొంగచాటుగ మనయందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి, మన ఏకైక యజమానుడును, ప్రభువునగు యేసుక్రీస్తును తిరస్కరించి, వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. వారు తీర్పునకు గురియగుదురు అను విషయము ముందే సూచింపబడినది.

5. మీకు ఈ విషయమంతయు చిరపరిచితమే అయినను, యిస్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తుదేశమునుండి రక్షించినప్పటికి వారిలో విశ్వసింపని వారిని తరువాత ఆయన నాశనము చేసిన విషయము మీకు జ్ఞాపకము చేయ తలంచితిని.

6. తమ నియమిత అధికారమును అతి క్రమించి, తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధః పాతాళమున శాశ్వత శృంఖలములతో బంధించియుంచినాడు. వారు అచట తాము శిక్షింపబడు ఆ గొప్పదినమునకై వేచియున్నారు.

7. లైంగికమగు అవినీతికి పాల్పడి ప్రకృతి విరుద్ధమైన వ్యామోహమునకు లోనై అందరికిని హెచ్చరికగ ఉండునట్లు నిత్యాగ్ని దండనకు గురియైన సొదొమ, గొమొఱ్ఱా, ఆ చుట్టు ప్రక్కల పట్టణ ప్రజలను స్మరింపుము.

8. అదే విధముగా మీరు కలలు కనుచు, వాని ప్రభావమున శరీరమును పాపముతో మలిన మొనర్చు కొనుచున్నారు. అధికారులను తృణీకరింతురు, పైనున్న దివ్యజీవులను అవమానింతురు.

9. దేవదూతలలో ప్రధానుడగు మిఖాయేలు సహితము ఇట్లు చేయ సాహ సింపలేదు. మోషే శరీరమును ఎవరు పొందవలెననెడి వాగ్వాదము వచ్చినప్పుడు, అతనికి సైతానుతో కలిగిన తగాదాలో మిఖాయేలు, సైతానును అవమానకర మాటలతో నిందింపలేదు. కేవలము “ప్రభువు నిన్ను గద్దించునుగాక!” అని మాత్రమే పలికెను.

10. కాని వీరు తమకు బోధపడని విషయములను అవమానింతురు. అంతేకాక అడవి జంతువులకువలె స్వభావసిద్ధముగ వారికి బోధపడు విషయములే వారిని నాశనమొనర్చును.

11. ఎంత అనర్ధము! వారు కయీను త్రోవను అనుసరించిరి. ధనకాంక్షచే బలాము వలె దోషములకు తమ్ము అర్పించుకొనిరి. కోరహు వలె తిరుగబడుట వలన నాశనము చేయబడిరి.

12. వీరు మీ విందులలోను, వినోదములలోను సిగ్గువిడిచి తినుచు త్రాగుచు మాయని మచ్చలై ఉన్నారు. వారు తమ స్వార్థము గూర్చియే తలంతురు. వారు గాలికి కొట్టుకొని పోయెడి వానకురియని మబ్బుల వంటివారు. ఆకు రాలు కాలమున ఫలవంతముకాక సమూలముగ పెల్లగింపబడిన నిర్జీవమగు చెట్ల వంటి వారు.

13. వారు తమ దుష్కృత్యములతో నురుగు వలె కానవచ్చుచున్న భయంకరమగు సముద్ర అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రముల వంటివారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

14. ఆదామునుండి ఏడవతరమువాడగు హనోకు వారినిగూర్చి ఎప్పుడో పూర్వమే ఇట్లు ప్రవచించెను: “ఇట్లు చూడుడు! వేల కొలది పవిత్ర దేవదూతలతో ప్రభువు విచ్చేయును.

15. అందరికి తీర్పు చెప్పుటకును, భక్తిహీనులు చేసిన దుష్కార్యములకును, వారు దేవునిగూర్చి పలికిన దారుణములగు పలుకులకును, దండించుటకు ఆయన విచ్చేయుట నేను చూచితిని.”

16. వారు సదా అసంతృప్తితో సణగువారు. వారు తమ దుష్టవాంఛలనే అనుసరింతురు. ఆత్మస్తుతి ఒనర్చుకొందురు. తమ మాట నెరవేరుటకై పరులను స్తుతింతురు.

17. కాని మిత్రులారా! స్మృతియందు ఉంచుకొనుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క అపోస్త లులచే గతమున మీకు ఏమి చెప్పబడెనో జ్ఞాపకము చేసికొనుడు.

18. “అంత సమయమున, మిమ్ము ఎగతాళి చేయువారును, తమ దుష్టవాంఛలనే అనుసరించు మనుజులును గోచరింతురు” అని వారు మీకు చెప్పి ఉండిరి.

19. అట్టివారు లౌకిక సంబందులును, ఆత్మలేనివారై ఉండి విభేదములు పుట్టింతురు

20. కాని ప్రియ మిత్రులారా! మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసమును అభివృద్ధి పరచుకొనుడు. పవిత్రాత్మ ప్రభావముతో ప్రార్థింపుడు.

21. మన ప్రభువగు యేసు క్రీస్తు దయతో మీకు నిత్యజీవమును ప్రసాదించువరకు వేచి ఉండి దైవప్రేమలో నిలిచి పొండు.

22. కొందరు సందేహపడువారున్నారు. వారిపై దయచూపుడు.

23. అగ్ని గుండమునుండి వెలుపలికి లాగి వారిని రక్షింపుడు. మరికొందరిపై మీ దయ భయముతో కూడినదై ఉండవలెను. కాని పాప భూయిష్టములగు వ్యామోహములచే మలినపడిన వారి దుస్తులను సహితము ద్వేషింపుడు.

24. మిమ్ము పతనము కాకుండ రక్షించి, ఆయన ఎదుట నిర్దోషులుగను, సంతోషచిత్తులుగను, నిలబెట్టు శక్తిగలవానికి,

25. మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా మన రక్షకుడగు ఒకే ఒక దేవునికి, గతమునుండియు ఇప్పుడును ఎల్లప్పుడును మహిమయు, ఘనతయు, ఆధిపత్యమును, అధికారమును కలుగునుగాక! ఆమెన్.