1. యేసు మార్గమున పోవుచు ఒక పుట్టుగ్రుడ్డి వాడిని చూచెను.
2. ఆయన శిష్యులు “బోధకుడా! వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? విడా? వీని తల్లిదండ్రులా?” అని యేసును అడిగిరి.
3. అందుకు యేసు “వీడుగాని, వీని తల్లిదండ్రులుగాని పాపము చేయలేదు. దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
4. పగటి వేళనే నన్ను పంపినవాని పనులు మనము చేయుచుండవలయును. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పనిచేయలేడు.
5. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును”
6. అని పలికి, నేలమీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో మట్టిని కలిపి, ఆ మట్టిని గ్రుడ్డివాని కనులమీద రాసి,
7. “వెళ్ళి సిలోయము' కోనేటిలో కడుగుకొనుము” అని చెప్పెను. ('సిలోయము' అనగా పంపబడినవాడు అని అర్థము.) ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని, చూపును పొంది తిరిగివచ్చెను.
8. అపుడు వాని ఇరుగుపొరుగువారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటను చూచిన వారును “కూర్చుండి, భిక్షమడుగుకొనువాడు వీడు కాడా?" అనిరి.
9. కొందరు “అవును వీడే!" అనిరి. మరికొందరు “వీడు వానివలె ఉన్నాడు” అనిరి. కాని, వాడు మాత్రము “అతనిని నేనే” అని చెప్పెను.
10. “నీ కళ్ళు ఎట్లు తెరువబడినవి?” అని వారు అడిగిరి.
11. అందుకు వాడు “యేసు అను మనుష్యుడు మన్ను కలిపి, నా కన్నులమీద రాసి, 'వెళ్ళి సిలోయములో కడుగుకొనుము' అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను” అని చెప్పెను.
12. “అతడు ఎక్కడ ఉన్నాడు?” అని వారు అడిగిరి. “నాకు తెలియదు” అని వాడు పలికెను.
13. అంతటవారు చూపును పొందిన ఆ గ్రుడ్డి వానిని పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
14. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతిదినము.
15. అందుచే పరిసయ్యులుకూడ వానిని “నీకు ఎట్లు చూపు వచ్చినది” అని అడిగిరి. “ఆయన కలిపిన మట్టిని నా కనులమీద రాసెను. నేను కడుగుకొంటిని. నాకు చూపు కలిగినది” అని వాడు వారితో చెప్పెను.
16. “ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు. కనుక దేవునియొద్దనుండి వచ్చినవాడు కాడు” అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు “పాపియైన మనుష్యుడు ఇట్టి సూచక క్రియలు ఎట్లు చేయగలడు?" అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను.
17. వారు మరల ఆ గ్రుడ్డివానిని “అతడు నీ కనులు తెరిచినందుకు అతనిని గురించి నీ అభిప్రాయమేమిటి?” అని అడిగిరి. “ఆయన ఒక ప్రవక్త” అని వాడు చెప్పెను.
18. వాడు గ్రుడ్డివాడై ఉండెనని ఇపుడు చూపును పొందెనని యూదులు నమ్మక, వాని తల్లిదండ్రులను పిలిపించి
19. “వీడు మీ కుమారుడా? వీడు గ్రుడ్డివానిగా పుట్టెనా? అట్లయిన వీడు ఇపుడు ఎట్లు చూడగలుగుచున్నాడు?” అని అడిగిరి.
20. అందుకు వాడి తల్లిదండ్రులు “వీడు మా కుమారుడే. వీడు పుట్టు గ్రుడ్డివాడు. అంతవరకు మాకు తెలియును.
21. కాని, ఇపుడు ఎట్లు చూడగలుగుచున్నాడో, ఎవడు వీనికి దృష్టినిచ్చెనో మాకు తెలియదు. వాడు వయస్సు వచ్చినవాడు. వానినే అడుగుడు. తన సంగతి తానే చెప్పుకొనగలడు” అనిరి.
22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి, ఏలయన, ఆయనను క్రీస్తు అని అంగీకరించు వానిని ప్రార్థనామందిరము నుండి వెలివేయవలయునని యూదులు నిర్ణయించుకొనిరి.
23. అందుచేతనే వాని తల్లిదండ్రులు “వాడు వయస్సు వచ్చినవాడు. వానినే అడుగుడు” అని చెప్పిరి.
24. వారు ఆ గ్రుడ్డి వానిని మరల పిలిపించి వానితో, “దేవుని స్తుతింపుము. ఆ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు తెలియును” అనిరి.
25. అందుకు వాడు “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. కాని, ఒకటి మాత్రము నాకు తెలియును. నేను గ్రుడ్డివాడనైయుంటిని. ఇపుడు చూడగలుగు చున్నాను” అనెను.
26. వారు వానిని, “అతడు నీకేమి చేసెను? నీ కన్నులు ఎట్లు తెరచెను?” అని ప్రశ్నించిరి.
27. అందుకు వాడు “ఇంతకు మునుపే చెప్పితిని. కాని మీరు వినిపించుకొనుటలేదు. మరల ఎందుకు వినగోరుచున్నారు? మీరు కూడ ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమి?" అని సమాధానమిచ్చెను.
28. వారు వానిని దూషించుచు, “నీవే వాని శిష్యుడవు. మేము మాత్రము మోషే శిష్యులము.
29. దేవుడు మోషేతో సంభాషించెనని మేము ఎరుగుదుము. కాని ఇతడు ఎక్కడనుండి వచ్చెనో మేము ఎరుగము” అనిరి.
30. అందుకు వాడు “ఆయన, నాకు దృష్టిని ఇచ్చెను. ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యకరము!
31. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదుము. కాని ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చువానిని ఆయన ఆలకించును.
32. ప్రపంచ ప్రారంభము నుండి నేటివరకు ఎవడును పుట్టుగ్రుడ్డివానికి దృష్టిని ఇచ్చినట్లు వినియుండలేదు.
33. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియును చేయ జాలడు” అని వారితో చెప్పెను.
34. అందుకు వారు “పాపకూపములో జన్మించిన నీవు, మాకు బోధింప బయలుదేరితివా?” అని వానిని వెలివేసిరి.
35. వానిని వెలివేసిన వార్త విని, యేసు వానిని కనుగొని, “నీవు మనుష్యకుమారుని విశ్వసించు చున్నావా?” అని అడిగెను.
36. అందుకు వాడు, "ప్రభూ! నేను విశ్వసించుటకు ఆయన ఎవరు?” అని ప్రశ్నించెను.
37.“నీవు ఆయనను చూచితివి. నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే” అని యేసు వానితో చెప్పెను.
38. “ప్రభూ! నేను విశ్వసించుచున్నాను” అని వాడు ఆయనను ఆరాధించెను.
39. “చూపులేనివారు చూచుటకును, చూపుగల వారు అంధులగుటకును, తీర్పుచేయుటకు ఈ లోకమునకు వచ్చియున్నాను” అని యేసు చెప్పెను.
40. ఆయనతో ఉన్న పరిసయ్యులు కొందరు ఇది విని “మేము కూడ గ్రుడ్డివారమా?' అనిరి.
41. అందుకు యేసు “మీరు నిజముగా గ్రుడ్డివారైయున్నయెడల మీ యందు పాపదోషము ఉండెడిది కాదు. కాని, మీరు దృష్టిగలవారమని చెప్పుచున్నారు. కనుక, మీయందు పాపదోషము నెలకొనియున్నది” అని పలికెను.