1. యేసు ఓలీవు పర్వతమునకు వెళ్ళెను.
2. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా, ప్రజలు ఆయనయొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను.
3. అపుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసికొనివచ్చి అందరి ఎదుట నిలువబెట్టి,
4. "బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది.
5. ఇటువంటి స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు?” అనిరి.
6. వారు యేసు మాటలలో తప్పుపట్టి, ఆయనపై నేరారోపణచేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేలమీద వ్రాయసాగెను.
7.వారు పదేపదే అడుగగా ఆయన లేచి “మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును” అని చెప్పి,
8. మరల వంగి నేలమీద వ్రేలితో వ్రాయసాగెను.
9. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలు కొని ఒకరివెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరు వెళ్ళిపోగా, ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను.
10. ఆయన తలయెత్తి “అమ్మా! వారందరు ఎక్కడ? ఎవరును నీకు శిక్ష విధింపలేదా!” అని ప్రశ్నించెను.
11. “లేదు ప్రభూ!” అని ఆమె సమాధాన మిచ్చెను. అందుకు యేసు “నేనును నీకు శిక్ష విధింపను. వెళ్ళుము. ఇక పాపము చేయకుము” అని చెప్పెను.
12. యేసు మరల వారితో "లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధ కారమున నడువక జీవపువెలుగును పొందును” అనెను.
13.పరిసయ్యులు ఆయనతో, “నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యమైనది కాదు" అని పలికిరి.
14. అందుకు యేసు, "నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము. ఏలయన నేను ఎక్కడనుండి వచ్చితినో, ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కాని, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో, మీరు ఎరుగరు.
15. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను.
16. నేను తీర్పుచేసినను నా తీర్పు సత్యమైనది. ఏలయన, వాస్తవముగ తీర్పుచేయునది నేను ఒక్కడనే కాదు. నేనును, నన్ను పంపిన తండ్రియు తీర్పుచేయుదుము.
17. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమునకూడ వ్రాయబడి యున్నది గదా!
18. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు” అనెను.
19. అందుకు వారు “నీతండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగిరి. అప్పుడు యేసు “మీరు నన్ను కాని, నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగియున్నచో నా తండ్రినికూడ ఎరిగియుందురు” అని సమాధాన మిచ్చెను.
20. యేసు దేవాలయమున కోశాగారమువద్ద బోధించుచు ఇట్లు చెప్పెను. కాని, ఎవరును ఆయనను పట్టుకొనలేదు. ఏలయన ఆయన గడియ ఇంకను రాలేదు.
21. యేసు మరల వారితో, “నేను ఇక వెళ్ళి పోయెదను. మీరు నన్ను వెదకుదురు. కాని మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు” అనెను.
22. అపుడు యూదులు, “ఇతడు 'నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు' అని చెప్పుచున్నాడు. ఆత్మహత్య చేసికొనునా?" అని చెప్పుకొనిరి.
23. యేసు వారితో, “మీరు క్రిందినుండి వచ్చువారు. నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు. నేను ఈ లోకమునకు చెందినవాడను కాను.
24. కనుక మీరు మీ పాపము లలోనే మరణింతురు అని చెప్పితిని. నేనే ఆయనను అని విశ్వసింపనియెడల మీరు మీ పాపములలోనే మరణింతురు” అని చెప్పెను.
25. “అట్లయిన నీవు ఎవడవు?” అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు “మొదటినుండియు నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను.
26. మిమ్ములను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్పవలసిన విషయములు అనేక ములు కలవు. కాని నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను” అనెను.
27. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు.
28. కావున యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినపుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియుచేయక, తండ్రి నాకు నేర్పినవానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు.
29. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక, ఆయన నన్ను ఒంటరిగ విడిచి పెట్టలేదు” అని చెప్పెను.
30. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా, అనేకులు ఆయనను విశ్వసించిరి.
31. అపుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, “మీరు నామాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు.
32. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును” అనెను.
33. “మేము అబ్రహాము వంశీయులము. మేము ఎన్నడును, ఎవరికిని దాసులమై ఉండలేదు. 'మీరు స్వతంత్రులగుదురు' అని ఎటుల చెప్పగలవు?” అని వారు అడిగిరి.
34. అందుకు యేసు “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు.
35. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివసించడు. కాని, కుమారుడు ఎల్లప్పుడును నివసించును.
36. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసినయెడల నిజముగ మీరు స్వతంత్రులై ఉందురు.
37. మీరు అబ్రహాము. వంశీయులని నేను ఎరుగుదును. అయినను, మీరు నా వాక్కును అంగీకరింపరు. కనుక, నన్ను చంపుటకు యత్నించుచున్నారు.
38. నేను నా తండ్రియొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రియొద్ద వినినవానిని ఆచరించుచున్నారు” అని సమాధానమిచ్చెను.
39. అంతటవారు ఆయనతో “మా తండ్రి అబ్రహాము” అనిరి. అందుకు యేసు “మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు.
40. కాని, దేవునియొద్దనుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంపయత్నించుచున్నారు. అబ్రహాము అటుల చేయలేదు.
41. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు” అనెను. అందుకు వారు “మేము వ్యభిచారమున పుట్టినవారము కాము. దేవుడొక్కడే మా తండ్రి” అని పలికిరి.
42. అందుకు యేసు “నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు. ఏలయన, నేను ఆయన యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుటవలననే వచ్చితిని కాని, నాయంతట నేను రాలేదు.
43. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? నా వాక్కును వినజాలకుండుటవలననే గదా!
44. మీరు మీ తండ్రియగు సైతాను సంతానము. మీ తండ్రి కోరికలను నెరవేర్పకోరుచున్నారు. అతడు మొదటి నుండియు నరహంత. సత్యమునకు నిలబడడు.ఏలయన, సత్యమనునది వానిలో లేదు. అబద్ధమాడుట వానికి స్వభావసిద్ధము. ఏలయన, వాడు అసత్యవాది. అసత్యమునకు తండ్రి.
45. నేను సత్యమును పలుకుచున్నాను. మీరు నన్ను విశ్వసింపరు.
46. మీలో ఎవడు నాయందు పాపమున్నదని స్థాపింపగలడు? నేను సత్యము పలికినను మీరు ఏల నన్ను విశ్వసింపరు?
47. దేవునికి సంబంధించినవాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించినవారు కారు. కనుక, మీరు వాటిని ఆలకింపరు” అనెను.
48. “నీవు సమరీయుడవనియు, దయ్యము పట్టినవాడవనియు మేము చెప్పుట సముచితమే గదా!” అని యూదులు పలికిరి.
49. అందుకు యేసు “నేను దయ్యముపట్టిన వాడను కాను. నేను నా తండ్రిని గౌరవించుచున్నాను. కాని, మీరు నన్ను అగౌరవపరచు చున్నారు.
50. నేను నా కీర్తిని వెదకుట లేదు. దానిని వెదకి, తీర్పు చెప్పువాడు ఒకడున్నాడు.
51. నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.
52. అంతట యూదులు, “నీకు దయ్యము పట్టినదని మాకు ఇపుడు నిశ్చయముగ తెలియును. అబ్రహాము, ప్రవక్తలును మరణించిరి. 'నా మాటను పాటించు వాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు' అని నీవు చెప్పుచున్నావు.
53. మా తండ్రియైన అబ్రహాము మరణించెను. నీవు అతని కంటె గొప్పవాడవా? ప్రవక్తలును మరణించిరి. నీవు ఎవడవని అనుకొనుచున్నావు?” అని పలికిరి.
54. అందుకు యేసు, “నన్ను నేను మహిమ పరచుకొనినయెడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.
55. మీరు ఆయనను ఎరుగరు. కాని, నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పినయెడల మీవలె అసత్యవాదిని అగుదును. అయితే, నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాటను పాటించుచున్నాను.
56. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను. అతడు దానిని చూచి సంతసించెను” అనెను.
57. “నీకు ఇంకను ఏబది సంవత్సరములైనను నిండలేదు. నీవు అబ్రహామును చూచితివా?” అని యూదులు ప్రశ్నించిరి.
58. అందుకు యేసు “అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.
59. అందువలన వారు ఆయనపై రాళ్లు రువ్వపూనుకొనిరి. కాని, ఆయన దాగుకొని దేవాలయమునుండి వెళ్ళి పోయెను.