ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 7 || Telugu catholic Bible || యోహాను సువార్త 7వ అధ్యాయము

 1. ఆ పిమ్మట, యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచ రింపక, గలిలీయలో పర్యటింపసాగెను.

2. యూదుల పర్ణశాలలపండుగ దగ్గరపడుటచే ఆయన సోదరులు యేసుతో,

3. “నీవు చేయుపనులను నీ శిష్యులు చూడగలందులకు ఇక్కడినుండి యూదయా సీమకు వెళ్ళుము.

4. ఏలయన, తన మహిమలను బహిరంగ పరచుకొనకోరువాడు, వానిని రహస్యముగా చేయడు. నీవు ఇట్టిపనులను చేయుచున్నావు కనుక, నిన్ను నీవు లోకమునకు బయలుపరచుకొనుము” అని చెప్పిరి.

5. వాస్తవముగ ఆయన సోదరులు సైతము ఆయనను విశ్వసింపలేదు.

6. యేసు వారితో, “నా సమయము ఇంకను రాలేదు. మీ సమయము ఎప్పుడును సిద్ధముగానున్నది.

7. లోకము మిమ్ము ద్వేషింపదు. కాని దాని పనులు చెడ్డవి అని నేను ప్రకటించు చున్నందున అది నన్ను ద్వేషించుచున్నది.

8. మీరు పండుగకు వెళ్ళుడు. నా సమయము ఇంకను పూర్తిగా రాలేదు. కనుక నేను ఈ పండుగకు ఇపుడు వెళ్ళను” అనెను.

9. ఆయన వారితో ఇట్లు చెప్పి గలిలీయలో ఉండిపోయెను.

10. ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడ బహిరంగముగగాక, రహస్యముగ అచటికి వెళ్ళెను.

11. ఆ పండుగలో యూదులు యేసు ఎక్కడ ఉన్నాడు అని వెదకుచుండిరి.

12. జన సమూహములో ఆయనను గురించి గుసగుసలు బయలుదేరెను. కొందరు ఆయనను సజ్జనుడు అనియు, మరికొందరు కాదు, ఆయన ప్రజలను మోసగించుచున్నాడు అనియు చెప్పుకొనుచుండిరి.

13. కాని, యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరును బహిరంగముగా మాటాడరైరి. .

14. పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధింపసాగెను.

15. విద్యా శిక్షణ లేని ఈయనకు ఇంత జ్ఞానము ఎట్లు వచ్చినది? అని యూదులు ఆశ్చర్యపడిరి.

16. అందుకు యేసు, “నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిది.

17. దేవుని చిత్తమును నెరవేర్పగోరువాడు. ఈ బోధ దేవుని నుండి వచ్చినదో లేక స్వాధికారముతో నేనిట్లు పలుకుచున్నానో తెలిసికొనగలడు.

18. స్వాధికారముతో మాటలాడువాడు తన కీర్తికొరకై వెదకును. కాని, తనను పంపినవాని కీర్తి కొరకై వెదుకువాడు సత్యవంతుడు. ఆయనయందు ఎట్టి అసత్యమును లేదు.

19. మోషే మీకు ధర్మశాస్త్రమునీయలేదా? కాని, మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రానుసారము వర్తించుట లేదు. మీరు ఎందుకు నన్ను చంపయత్నించుచున్నారు?” అని ప్రశ్నించెను.

20. అందుకు వారు “నీకు దయ్యము పట్టినది. నిన్ను ఎవరు చంపయత్నించు చున్నారు?" అని పలికిరి.

21. అప్పుడు యేసు వారితో, “నేను చేసిన ఒక్కపనికిగాను మీరందరును ఆశ్చర్యచకితులైతిరి.

22. మోషే సున్నతి ఆచారము నియమించెను. ఈ ఆచారము మోషేవలన కలిగినది కాదు. పితరుల వలననే కలిగినది. అయినను మీరు విశ్రాంతిదినమున సున్నతి చేసెదరు.

23. మోషే చట్టము భంగము కాకుండుటకు విశ్రాంతిదినమున కూడ సున్నతి చేయుచున్నారు కదా! మరి విశ్రాంతి దినమున నేను ఒక మనుష్యుని సంపూర్ణ ఆరోగ్య వంతుని చేసినందుకు మీకు నాపై కోపమెందుకు?

24. మీరు పైకి కనిపించు వాటిని బట్టిగాక, న్యాయ సమ్మతమైన తీర్పుచేయుడు” అనెను.

25. యెరూషలేములో కొందరు ప్రజలు, “వారు చంపయత్నించుచున్నది. ఈయనను కాదా?

26. ఇదిగో! ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడు చున్నాడు. అయినను ఎవరును ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడ నిజముగ ఎరిగియుందురా?

27. ఈయన ఎక్కడి వాడో మనమెరుగుదుము. కాని 'క్రీస్తు' వచ్చినపుడు ఆయన ఎక్కడనుండి వచ్చునో ఎవరికిని తెలియదు” అని పలికిరి.

28. అపుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి “మీరు నన్ను ఎరుగుదురా! నేను ఎక్కడనుండి వచ్చితినో మీకు తెలియునా! నేను స్వయముగా రాలేదు. నన్ను పంపినవాడు సత్యస్వ రూపుడు. ఆయనను మీరు ఎరుగరు.

29. నేను ఆయనను ఎరుగుదును. ఏలయన, నేను ఆయన యొద్దనుండి వచ్చియున్నాను. ఆయన నన్ను పంపెను” అని చెప్పెను.

30. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి. కాని, ఆయన గడియ ఇంకనురానందున ఎవడును ఆయనపై చేయివేయలేదు.

31. కాని, ప్రజలలో ఎక్కువమంది ఆయనను విశ్వసించి, “క్రీస్తు వచ్చినపుడు ఆయన ఇంతకంటె ఎక్కువ సూచకక్రియలు చేయునా?” అని అనుకొనిరి.

32.యేసునుగురించి ప్రజలు ఈ విధంగా గొణుగు కొనుటను పరిసయ్యులు విని, వారును, ప్రధానార్చకులును ఆయనను బంధించుటకై అధికారులను పంపిరి.

33. అంతట యేసు వారితో, “ఇంకను కొద్దికాలము మాత్రము నేను మీతో ఉందును. తరువాత నేను నన్ను పంపినవానియొద్దకు పోవుదును.

34. మీరు నన్ను వెదకుదురు. కాని, నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు” అనెను.

35. అందుకు యూదులు ఒకరితో ఒకరు “ఈయనను మనము కనుగొనలేకపోవుటకు ఈయన ఎక్కడకు పోవుచు న్నాడు? గ్రీసుదేశస్థులలో చెల్లాచెదరైపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీకులకు బోధించునా?

36. 'మీరు నన్ను వెదకుదురు. కాని నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు' అని చెప్పుటలో భావమేమి?” అని చెప్పుకొనుచుండిరి. .

37. పండుగ చివరిదినము ప్రధానమైనది. ఆనాడు యేసు నిలచి బిగ్గరగా “ఎవడైన దప్పికకొన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చునుకొనునుగాక!

38. లేఖనములో చెప్పబడినట్లు 'నన్ను విశ్వసించువాని అంతరంగమునుండి జీవజలనదులు ప్రవహించును' ” అని చెప్పెను.

39. ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మనుగురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమపరుపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు.

40. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు “ఈయన వాస్తవముగ ప్రవక్త” అనియు,

41. మరికొందరు “ఈయన క్రీస్తు” అనియు చెప్పు కొనిరి. కాని కొందరు “క్రీస్తు గలిలీయనుండి రాడు గదా!

42. దావీదువంశమునుండియు, దావీదు గ్రామమగు బేత్లెహేమునుండియు క్రీస్తు అవతరించు నని లేఖనము చెప్పుటలేదా!” అని చెప్పుకొనిరి.

43. ఇట్లు ఆయననుగూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను.

44. కొందరు ఆయనను పట్టు కొనదలచిరి. కాని, ఎవడును ఆయనపై చేయివేయలేదు.

45. బంట్రౌతులు ప్రధానార్చకుల యొద్దకు, పరిసయ్యులయొద్దకు తిరిగిరాగా, “మీరు ఆయనను ఎందుకు పట్టుకొనిరాలేదు?” అని వారు ప్రశ్నించిరి.

46. అందుకు ఆ బంట్రౌతులు “ఆయనవలె ఎవడును ఎన్నడును మాట్లాడలేదు” అని సమాధానమిచ్చిరి.

47. అది విని పరిసయ్యులు వారితో, “మీరు గూడ మోసపోయితిరా?

48. అధికారులలోగాని, పరిసయ్యులలోగాని ఎవడును ఆయనను విశ్వసించలేదే!

49. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు. కనుక వీరు శాపగ్రస్తులు"అని పలికిరి.

50. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు.

51. అతడు “మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమిచేయునది తెలిసికొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా?” అని వారిని ప్రశ్నించేను.

52. అందుకు వారు “నీవును గలిలీయుడవా? గలిలీయనుండి ఏ ప్రవక్తయురాడు. పరిశీలించి చూడుము” అని సమాధానమిచ్చిరి.

53. అంతట అందరును తమతమ ఇండ్లకు వెళ్ళిపోయిరి.