ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 6 || Telugu catholic Bible || యోహాను సువార్త 6వ అధ్యాయము

 1. ఆ పిదప యేసు 'తిబేరియా' అనెడి గలిలీయ సరస్సునుదాటి ఆవలి తీరమునకు వెళ్ళెను.

2. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచకక్రియలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను.

3. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను.

4. అపుడు యూదుల పాస్కపండుగ సమీపించినది.

5. యేసు కనులెత్తి గొప్పజనసమూహము తనయొద్దకు వచ్చుటచూచి, ఆయన ఫిలిప్పుతో “వీరు భుజింపవలసిన ఆహారపదార్థములను మనము ఎక్కడనుండి కొనితెచ్చెదము?” అనెను.

6. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అటుల పలికెను. ఏలయన, తానేమి చేయబోవు చున్నది ఆయనకు తెలియును.

7. “ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండువందల దినారముల రొట్టెలు కూడ చాలవు” అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను.

8. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు అంద్రెయ

9. “ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (ధాన్యపు) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంతమందికి ఇవి ఏమాత్రము?” అని పలికెను.

10. యేసు “అందరిని భోజనమునకు కూర్చుండబెట్టుడు” అనెను. అచట ఇంచుమించు ఐదువేలమంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి.

11. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలనుకూడ వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను.

12.వారు తృప్తిగ భుజించిన పిదప, యేసు శిష్యులతో “ఏమియు వ్యర్థముకాకుండ మిగిలిన ముక్కలను ప్రోవుచేయుడు” అని చెప్పెను.

13. వారు భుజించిన పిదప ఐదు యవ ధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి.

14. ప్రజలు యేసు చేసిన ఈ సూచకక్రియను చూచి, “వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే” అని చెప్పిరి.

15. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగ పర్వతము పైకి వెళ్ళెను.

16. సందె వేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి,

17. పడవను ఎక్కిసరస్సు ఆవలివైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్మెను. కాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

18. పెనుగాలివలన సరస్సునందు అలలు చెలరేగెను.

19. వారు మూడు నాలుగు మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి.

20. కాని, యేసు వారితో “నేనే, భయపడకుడు" అని చెప్పెను.

21. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొనకోరిరి. ఇంతలో పడవ, వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చిచేరెను.

22. మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటవున్న ఒకే ఒక చిన్నపడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్ళలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూచిరి.

23. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను.

24. అక్కడ యేసుగాని, శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి.

25. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని “బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి.

26. “మీరు రొట్టెలు తిని సంతృపులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.

27. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు” అని యేసు సమాధానమిచ్చెను.

28. అప్పుడు “దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా,

29. యేసు “దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది” అని చెప్పెను.

30. అంతట “నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?” అని వారు మరల ప్రశ్నించిరి.

31. " 'వారు భుజించుటకు ఆయన పరలోకమునుండి ఆహారమును ప్రసాదించెను' అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో 'మన్నా' భోజనము లభించెను” అని వారు ఆయనతో చెప్పిరి.

32. “పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును.

33. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు వారితో అనెను.

34. "అయ్యా! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి.

35. అందుకు యేసు "నేనే జీవాహారమును. నాయొద్దకు వచ్చువాడు ఎన్నటి కిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు."

36. “నేను మీతో చెప్పినట్లు మీరు నన్నుచూచియు విశ్వసించుటలేదు.

37. నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నాయొద్దకు వచ్చును. నాయొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడును త్రోసివేయను.

38. ఏలయన, నేను పరలోకమునుండి దిగివచ్చినది, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు.

39. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమదినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము.

40.కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందు టయే నాతండ్రి చిత్తము. అంతిమదినమున నేను వానిని లేపుదును” అని సమాధానమిచ్చెను.

41. “నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును” అని యేసు చెప్పినందులకు యూదులు గొణగసాగిరి.

42. “ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయిన తాను పరలోకమునుండి దిగి వచ్చితినని ఎటుల చెప్పగలడు?” అని చెప్పుకొనసాగిరి.

43. యేసు వారితో “మీలో మీరు గొణుగు కొనవలదు.

44. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నాయొద్దకు రాలేడు. నేను వానిని అంతిమదినమున లేపుదును.

45. వారందరు దేవునిచే బోధింపబడుదురు' అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నాయొద్దకు వచ్చును.

46. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవునియొద్దనుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు.

47. నన్ను విశ్వసించువాడు నిత్యజీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

48. జీవాహారమును నేనే.

49. మీ పితరులు ఎడారిలో 'మన్నా'ను భుజించియు మరణించిరి.

50. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు.

51. పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.

52.అంతట యూదులు ఒకరితో ఒకరు "మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయ గలడు?” అని వాదించుకొనసాగిరి.

53.యేసు వారికి “మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప, మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

54. నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమదినమున లేపుదును.

55. ఏలయన, నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము.

56. నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును.

58. ఇదియే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు 'మన్నా'ను భుజించియు మరణించిరి. అటులకాక, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును” అని సమాధానము ఇచ్చెను.

59. ఆయన కవర్నాము ప్రార్థనామందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను.

60. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినిన పుడు “ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి.

61. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు “ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా?

62. అట్లయిన మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు?

63. జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప యోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి.

64. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు” అని పలికెను. ఆ విశ్వ సింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును.

65. కనుకనే “తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని” అని ఆయన పలికెను.

66. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి.

67. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో “మీరును వెళ్ళిపోయెదరా?”అని అడుగగా,

68. సీమోను పేతురు, “ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు.

69. మేము విశ్వసించితిమి. నీవు దేవునినుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి” అనెను.

70. అంతట యేసు “నేనుమీ పన్నిద్దరిని ఎన్నుకొనలేదా? అయినను మీలో ఒకడు పిశాచము” అని పలికెను.

71. ఆయన ఈ మాట సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాను ఉద్దేశించి పలికెను. ఏలయన, పన్నిద్దరిలో ఒకడైన అతడు ఆయనను అప్పగింపబోవుచున్నాడు.