ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 5 || Telugu catholic Bible || యోహాను సువార్త 5వ అధ్యాయము

 1. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్లెను.

2. యెరూషలేములో గొఱ్ఱెల వాకిలివద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో 'బెత్సతా' అందురు. దానికి అయిదు మండపములు ఉన్నవి.

3. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడివారు.

4. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదలించును. నీరు కదలగనే మొదట అందులో దిగిన వాడు ఎటువంటి వ్యాధినుండియైనను స్వస్థత పొందును.

5. ముప్పది ఎనిమిదిఏండ్లనుండి వ్యాధిపీడితుడు ఒకడు అక్కడ ఉండెను.

6.యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలమునుండి అచట ఉన్నాడని గ్రహించి "నీవు స్వస్థత పొందగోరుచున్నావా?” అని అతనిని అడిగెను.

7. అందుకు అతడు "అయ్యా! నీరు కదలినపుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడును లేడు. నేను వెళ్ళబోవుసరికి మరియొకడు నాకంటే ముందు దిగుచున్నాడు” అని చెప్పెను.

8. “లెమ్ము. నీ పడకను ఎత్తుకొని నడువుము” అని యేసు అతనితో చెప్పెను.

9. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసికొని నడువ సాగెను. అది విశ్రాంతిదినము.

10. కావున యూదులు స్వస్థతపొందిన వానితో “ఇది విశ్రాంతిదినము, నీవు పడకను మోయుట తగదు” అనిరి.

11. అందుకు వాడు “ 'నన్ను స్వస్థపరచిన వ్యక్తి నాతో నీ పడకను తీసికొని నడువుము' అని చెప్పెను” అనెను.

12.“పడకను తీసికొని నడువుము' అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు?" అని వారు ప్రశ్నించిరి.

13. ఆయన ఎవరో స్వస్థత పొందినవానికి తెలియదు. ఏలయన, అక్కడ జనసమూహము ఉండుటచేయేసు అచటనుండి వెళ్ళిపోయెను.

14. అటు తరువాత యేసు దేవాలయములో వానిని కనుగొని “ఇదిగో! నీవు స్వస్తుడవైతివి. నీకు మరింత కీడుకలుగకుండుటకు ఇక పాపము చేయకుము” అని చెప్పెను.

15. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరచినది యేసు అని చెప్పెను.

16. విశ్రాంతిదినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింపమొదలిడిరి. .

17. యేసు వారితో, “నా తండ్రి ఇప్పటికిని పనిచేయుచున్నాడు. నేనును చేయుచున్నాను” అని చెప్పెను.

18. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగ ప్రయత్నించిరి. ఏలయన, ఆయన విశ్రాంతిదిన నియమమును మీరుటయేకాక, దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగ చేసికొనుచుండెనని వారు భావించిరి.

19. యేసు వారితో ఇట్లనెను: “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో, దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు. తండ్రి ఏమిచేయునో కుమారుడు దానిని అట్లే చేయును.

20. తండ్రి కుమారుని ప్రేమించును. తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటె గొప్పకార్యములను చేయుటను ఆయనకు చూపి, మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును.

21. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగ చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును.

22. తండ్రి ఎవనికిని తీర్పువిధింపడు. తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను.

23. అందరు తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడ గౌరవించుటకు ఆయన అటుల చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడ గౌరవింపడు.

24. "నా మాటలను ఆలకించి నన్ను పంపినవానిని విశ్వసించువాడు నిత్యజీవము పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు. అతడు మరణమునుదాటి జీవమందు ప్రవేశించును.

25. మృతులు దేవునికుమారుని స్వర మును విను సమయము వచ్చుచున్నది. అది వచ్చియే యున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.

26. ఏలయన, తండ్రి తనంతట తాను జీవము కలిగియున్నట్లే కుమారుడు కూడ తనంతట తాను జీవము కలిగియుండునట్లు చేసెను.

27. ఆయన మనుష్యకుమారుడు కనుక ఆయనకు తీర్పువిధించు అధికారమునుకూడ ఇచ్చెను.

28. మీరు ఆశ్చర్యపడవలదు. ఆ గడియ సమీపించు చున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వర మును విని,

29. ఉత్తానులగుదురు. మంచి కార్యములు చేసినవారు జీవపునరుత్థానమును, దుష్టకార్యములు చేసినవారు తీర్పుపునరుత్థానమును పొందెదరు.

30. “నా అంతట నేనే ఏమియు చేయజాలను. నేను వినినట్లు తీర్పుచేయుదును! నా తీర్పు న్యాయ మైనది. ఏలయన, నేను నా యిష్టానుసారము కాక నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయగోరుదును.

31.“నాకు నేను సాక్ష్యము పలికినచో నాసాక్ష్యము సత్యముకాదు.

32. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరియొకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును.

33. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను.

34. నాకు మనుష్యుని సాక్ష్యముతో పనిలేదు. కాని, మీరు రక్షింపబడుటకే నేను ఇట్లు చెప్పుచున్నాను.

35. యోహాను కాంతితో వెలుగుచున్న దీపమువలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి.

36. కాని, నాకుగల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యముకంటె గొప్పది. అది ఏమన: నేను చేయుక్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచు, తండ్రియే నన్ను పంపెనని విరూపించుచున్నవి.

37. నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడును ఆయన స్వరమును వినలేదు. ఆయన రూపమును చూడలేదు.

38. ఆయన పంపిన వానిని మీరు విశ్వసింపరు. కనుక, ఆయన వాక్కు మీయందు నిలిచి యుండలేదు.

39. నిత్యజీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

40. అయినను, మీరు, ఆ జీవమును పొందుటకు నాయొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు.

41. “నేను మనుష్యుల పొగడ్తలను ఆశించువాడనుకాను.

42. నేను మిమ్ము ఎరుగుదును. దైవప్రేమ మీలోలేదని నాకు తెలియును.

43. నేను నా తండ్రి పేరిట వచ్చియున్నాను. కాని మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు.

44. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక, ఒండొరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు?

45. తండ్రియొద్ద నేను మీపై దోషారోపణ చేసెదనని మీరు భావింప వలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును.

46. మీరు నిజముగ మోషేను నమ్మియుండిన యెడల నన్నును నమ్మి ఉండెడివారు. ఏలయన, అతడు నన్నుగురించి వ్రాసిఉన్నాడు.

47. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు?”