ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 4 || Telugu catholic Bible || యోహాను సువార్త 4వ అధ్యాయము

 1. యోహానుకంటె తాను ఎక్కువమంది శిష్యులను చేర్చుకొనుచు, వారికి బప్తిస్మము ఇచ్చుచున్నట్లు పరిసయ్యుల చెవినపడెనని యేసుకు తెలిసెను.

2. బప్తిస్మమిచ్చినది వాస్తవముగ యేసు శిష్యులేకాని ఆయన కాదు.

3. అది విని యేసు యూదయా సీమ వదలి మరల గలిలీయకు ప్రయాణమయ్యెను.

4. ఆయన సమరియా మీదుగా వెళ్ళవలసియుండెను.

5.యేసు సమరియాలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపు నకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది.

6. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావివద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ.

7. ఒక సమరీయ స్త్రీ నీటికొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను “నాకు త్రాగుటకు నీరు ఇమ్ము” అని అడిగెను.

8. ఆయన శిష్యులు ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి.

9. ఆ సమరయ స్త్రీ యేసుతో, “యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగు చున్నావు?” అని అనెను. (ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు.)

10. అప్పుడు యేసు “నీవు దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము' అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు” అని సమాధానమిచ్చెను.

11. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చేదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి తెచ్చెదవు?

12. మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతనికంటె గొప్పవాడవా?” అని అడుగగా,

13. యేసు సమాధానముగా ఆమెతో, “ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొనును.

14. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉండును” అని చెప్పెను.

15. అపుడు ఆమె “అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండు నట్లును నాకు ఆ నీటిని ఇమ్ము” అని అడిగెను.

16. అప్పుడు యేసు “నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము" అనెను.

17. అందుకు ఆమె “నాకు భర్తలేడు” అని చెప్పెను. “నాకు భర్తలేడు” అని నీవు యథార్థముగా చెప్పితివి.

18. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి” అని యేసు పలికెను.

19. ఆ స్త్రీ ఆయనతో "అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది.

20. మా పితరులు ఈ పర్వతముమీద ఆరాధించిరి. కాని, దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు” అని పలికెను.

21. “స్త్రీ నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతముమీదకాని, యెరూషలేములోకాని తండ్రిని ఆరాధింపరు.

22. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయన రక్షణ యూదులనుండియే వచ్చును.

23. కాని, నిజమైన ఆరాధకులు ఆత్మ యందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమ యమిపుడే వచ్చియున్నది. అది ఇపుడే వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే.

24. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును” అని యేసు చెప్పెను.

25. అప్పుడు ఆ స్త్రీ "క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినపుడు మాకు అన్ని విషయములు తెలియజేయును” అని పలికెను.

26. “నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను!” అని యేసు చెప్పెను.

27. అంతలో శిష్యులు వచ్చి, ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని, ఎవడును “నీకేమి కావలయును” అని గాని “నీవు ఎందుకు ఈమెతో మాటాడుచున్నావు” అనిగాని అడుగలేదు.

28. ఆమె తన కడవను అక్కడే వదలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో,

29. “ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన 'క్రీస్తు' ఏమో!” అని చెప్పెను.

30. ప్రజలు పట్టణమునుండి బయలుదేరి ఆయనవద్దకు వెళ్ళిరి.

31. ఈలోగా ఆయన శిష్యులు “బోధకుడా! భోజనము చేయుడు” అని బ్రతిమాలిరి.

32. యేసు వారితో "భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు” అని చెప్పెను.

33. “ఎవరైన ఈయనకు భోజనము తెచ్చి పెట్టిరా?” అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి.

34. యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తిచేయుటయే నా ఆహారము.

35. నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురుకదా! పొలములవైపు కన్నులెత్తి చూడుడు. అవి పండి, కోతకు సిద్ధముగా ఉన్నవి.

36. కోత కోయువాడు కూలి తీసికొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందు వలన విత్తువాడు, కోయువాడు ఇద్దరును సంతసింతురు.

37. 'విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు' అని లోకోక్తి ఇక్కడ సార్థకమైనది.

38. మీరు శ్రమింపనిదానిని కోయుటకు మిమ్ము పంపి తిని. ఇతరులు శ్రమించితిరి. వారి ఫలితము మీకు లభించినది” అని చెప్పెను.

39.“నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను” అని ఆ స్త్రీ చెప్పినదానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి.

40. ఆ సమరియ వాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండుమని వేడుకొనగా, ఆయన అచట రెండు రోజులు ఉండెను.

41. ఆయన ఉపదేశమును ఆలకించి. ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి.

42. “మేము ఇపుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయ ముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగ ఆయన లోకరక్షకుడని మాకు తెలియును” అని వారు ఆమెతో చెప్పిరి.

43. రెండు దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలీయకు వెళ్ళెను.

44. ఏలయన, ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసే స్వయముగ సాక్ష్యమిచ్చెను.

45. యేసు గలిలీయకు వెళ్ళినప్పుడు అచటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయన, పాస్కపండుగ సందర్భమున గలిలీయ నివాసులు యెరూషలేమునకు వచ్చినపుడు ఆయన చేసిన అద్భుతకార్యములన్నియు స్వయముగ చూచిరి.

46. అంతట ఆయన నీటిని ద్రాక్షరసముగ మార్చిన గలిలీయలోని కానాను అను పల్లెకు మరల వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను.

47. యేసు యూదయానుండి గలిలీయకు తిరిగివచ్చెనని విని, ఆ ఉద్యోగి ఆయనయొద్దకు వెళ్ళి, ప్రాణసంకట ములో పడియున్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరుపవలసినదిగా ప్రార్ధించెను.

48. “మీరు సూచకక్రియలను, మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు” అని యేసు పలికెను.

49. "ప్రభూ! నా కుమారుడు చనిపోకముందే రండు” అని ఆ ఉద్యోగి వేడుకొనెను.

50. “నీవు వెళ్ళుము. నీ కుమారుడు జీవించును”అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను.

51. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై “నీ కుమారుడు స్వస్థుడైనాడు” అని చెప్పిరి.

52.“ ఏ గంటనుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది?" అని అతడు సేవకులను అడుగగా, “నిన్న మధ్యాహ్నము ఒంటిగంటకు జ్వరము విడిచినప్పటినుండి” అని వారు చెప్పిరి.

53. “నీ కుమారుడు జీవించును” అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి, అతని కుటుంబము యేసును విశ్వసించిరి.

54. ఇది యేసు యూదయానుండి గలిలీయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.