1. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను.
2. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి “బోధకుడా! నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు” అని పలికెను.
3. యేసు అందుకు అతనితో, “మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవునిరాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.
4. అందుకు నికోదేము, “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని అడిగెను.
5. అపుడు యేసు, “ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
6. శరీరమూలముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది.
7. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు.
8. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును” అనెను.
9. “ఇది ఎటుల సాధ్యమగును?” అని నికోదేము అడిగెను.
10. అందులకు యేసు: “నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా?
11.మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికి సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
12. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పినయెడల ఎట్లు నమ్మెదరు.
13. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు.
14. “మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో
15. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడ వలెను.
16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనముచెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను.
17. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు.
18. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు.
19. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి.
20. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు.
21. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును” అని సమాధాన మిచ్చెను.
22. ఆ పిదప యేసు తనశిష్యులతో యూదయా సీమకు వెళ్ళి, వారితో కొంతకాలము గడపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను.
23. నీరు పుష్కలముగా ఉండుటచే 'సలీము' సమీపమున ఉన్న 'ఐనోను' వద్ద యోహాను కూడ బప్తిస్మమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మము పొందుచుండిరి.
24. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు.
25. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి.
26. వారు యోహాను వద్దకు వెళ్ళి, “బోధకుడా! యోర్దాను నది ఆవలితీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరు ఆయనయొద్దకు వెళ్ళుచున్నారు” అని చెప్పిరి.
27. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను: “పరలోకమునుండి అను గ్రహింపబడిననే తప్ప ఎవడును ఏమియు పొందనేరడు.
28. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటే ముందుగా పంపబడినవాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు.
29. పెండ్లికుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లికుమారుని మిత్రుడు అతని చెంతనుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినపుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది.
30. ఆయన హెచ్చింపబడవలెను. నేను తగ్గింపబడవలెను.
31. పైనుండి వచ్చువాడు అందరికంటె అధికుడు. భూలోకమునుండి వచ్చువాడు, భూలోకమునకు చెంది నవాడు. అతడు భూలోక విషయములనుగూర్చి మాట్లా డును. పరలోకమునుండి వచ్చువాడు అందరికంటే అధికుడు.
32. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కాని, ఎవరును ఆయన సాక్ష్యమును అంగీకరింపరు.
33. ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్య సంధుడని నిరూపించును.
34. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములు గూర్చి చెప్పును. ఏలయన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా ఒసగును.
35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించియున్నాడు.
36. కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును. ఆయనకు విధేయించనివాడు జీవమును చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలిచి ఉండును.