1. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరల దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా:
2. సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలీయలోని కానా నివాసియగు నతనయేలు, జెబదాయి కుమారులు, మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి.
3. సీమోను పేతురు వారితో, “నేను చేపలు పట్టబోవుచున్నాను” అని పలుకగా వారు “మేమును నీ వెంట వచ్చెదము” అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కాని, ఆ రాత్రి అంతయు వారికి ఏమియు దొరకలేదు.
4. ప్రాతఃకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని, శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి.
5. యేసు వారిని, “బిడ్డలారా! మీయొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా?” అని అడుగగా, “లేదు” అని వారు బదులు పలికిరి.
6. అపుడు ఆయన వారితో “పడవకు కుడివైపున వలవేయుడు. చేపలు దొరకును” అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగ పడుటచే వారు వలను లాగలేకపోయిరి.
7. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో “ఆయన ప్రభువు సుమీ!” అనెను. ఆయన ప్రభువు అని విని నంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను.
8. తక్కిన శిష్యులు చేపలతో నిండియున్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు. వంద గజముల దూరమున మాత్రమే ఉండిరి.
9. వారు ఒడ్డునకు వచ్చినపుడు అచ్చట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి.
10. యేసు వారితో “మీరు ఇపుడు పట్టిన చేపలు కొన్ని తీసికొనిరండు” అనెను. 11. సీమోను పేతురు పడవను ఎక్కి నూట ఏబది మూడు పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు.
12. “వచ్చి భుజింపుడు” అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును “నీవెవడవు?” అని ఆయనను అడుగ సాహసింపలేదు.
13. యేసు వచ్చి రొట్టెను తీసికొని, వారికి పంచి పెట్టెను. అట్లే చేపను కూడ వారికి పంచి ఇచ్చెను.
14. మృతులలోనుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది మూడవ పర్యాయము.
15. వారు భుజించిన పిమ్మట యేసు, సీమోను పేతురుతో “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను వీరందరికంటె ఎక్కువగ ప్రేమించుచున్నావా?” అని అడిగెను. అందుకు పేతురు "అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అని సమాధానమిచ్చెను. అపుడు యేసు, “నీవు నా గొఱ్ఱెపిల్లలను మేపుము” అని చెప్పెను.
16. “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని యేసు రెండవ పర్యా యము అతనిని అడిగెను. “అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అని పేతురు బదులు చెప్పెను. “నా గొఱ్ఱెలను కాయుము” అని యేసు చెప్పెను.
17. “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. “నీవు నన్ను ప్రేమించుచున్నావా?” అని యేసు మూడవ పర్యా యము అడిగినందున పేతురు మనస్సునొచ్చుకొని “ప్రభూ! నీకు అంతయును తెలియును. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు” అనెను. అపుడు యేసు “నా గొఱ్ఱెలను మేపుము” అనెను.
18. ఆయన అతనితో “నేను నీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నీవు యువకుడవుగా ఉన్నపుడు నడుముకట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్ళెడివాడవు. కాని, నీవు వృద్దుడవైనపుడు నీ చేతులు చాచెదవు. అపుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసికొనిపోవును” అని చెప్పెను.
19. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి “నన్ను వెంబడించుము” అని అతనితో అనెను.
20. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన వక్షఃస్థలమున వంగి, 'ప్రభూ మిమ్ము అప్పగించువాడెవడు?” అని అడిగిన శిష్యుడు తమ వెంటవచ్చుట చూచి,
21. యేసుతో “ప్రభూ! ఇతని విషయమేమి?" అని అడిగెను.
22. అందుకు యేసు “నేను వచ్చువరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనదో, అది నీకేమి? నీవు నన్ను వెంబ డింపుము” అనెను.
23. కనుక, ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. “నేను వచ్చువరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది
నీకేమి?” అని యేసు పలికెను. కాని, అతడు మరణింపడని చెప్పలేదు.
24. ఈ విషయములను గురించి సాక్ష్య మిచ్చుచు, వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము.
25. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతిదానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచు చున్నది.