ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 15 || Telugu catholic Bible || యోహాను సువార్త 15వ అధ్యాయము

 1. "నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు.

2. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతిరెమ్మను అధికముగ ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును.

3. నేను మీతో చెప్పిన మాటలవలన మీరు ఇప్పుడు శుద్దులైతిరి.

4. నేను మీయందు ఉందును. మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లియందు ఉండని రెమ్మ దానియంతట అది ఫలింప జాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింప జాలరు.

5. “నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగ ఫలించును. ఏలయన, నేను లేక మీరు ఏమియు చేయజాలరు.

6. నాయందు నివసింపని వాడు రెమ్మవలె పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు.

7. నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును.

8. మీరు అధికముగ ఫలించుటయందు నా తండ్రి మహిమపరుపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు.

9. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు.

10. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు.

11. “నా ఆనందము మీయందు ఉండవలయు ననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయు ననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను.

12. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ.

13. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు.

14. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు.

15. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.

16. మీరు నన్ను ఎన్ను కొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని.

17. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను.

18. “లోకము మిమ్ము ద్వేషించినచో మీ కంటె ముందు అది నన్ను ద్వేషించినదని తెలిసికొనుడు.

19. మీరు లోకమునకు చెందినవారైనయెడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకము నకు చెందినవారుకారు. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని. కనుక, లోకము మిమ్ము ద్వేషించు చున్నది.

20. దాసుడు తన యజమానుని కంటె గొప్ప వాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించినయెడల అది మిమ్మును హింసించును. అది నా మాటను పాటించినయెడల మీ మాటనుకూడ పాటించును.

21. కాని, లోకము నన్ను పంపినవానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీపట్ల అది ఇవన్నియు చేయును.

22. నేను వచ్చి వారికి బోధింపనియెడల వారికి పాపదోషము ఉండెడిది కాదు. కాని ఇపుడు వారి పాపమునకు క్షమాపణ లేదు.

23. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.

24. నేను ఏ ఒక్కరును చేయని క్రియలు వారి మధ్యను చేయనియెడల, వారికి పాప దోషము ఉండెడిది కాదు. కాని, వారు ఇపుడు నేను చేసినదానిని చూచియు, నన్నును, నా తండ్రిని ఇద్దరిని ద్వేషించు చున్నారు.

25. 'వారు నన్ను నిష్కారణముగ ద్వేషించిరి' అను వారి ధర్మశాస్త్రమునందలి వాక్యము నెరవేరుటకు ఇట్లు జరిగెను.

26. “నేను తండ్రియొద్దనుండి మీయొద్దకు పంప నున్న ఓదార్చెడువాడును, తండ్రియొద్దనుండి వచ్చు సత్యస్వరూపియునగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును.

27. మీరు మొదటినుండియు నావెంట ఉన్నవారు. కనుక, మీరును నన్ను గురించిన సాక్షులు.