1. అది పాస్కపండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రియొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తనవారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను.
2. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ప్రేరణ కలిగించెను.
3. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి వచ్చితిననియు, మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను.
4. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి, నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని,
5. ఒక పళ్ళెములో నీరుపోసి, తన శిష్యుల పాదములు కడిగి, నడుమునకు కట్టు కొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను.
6. అట్లు ఆయన సీమోను పేతురుయొద్దకు రాగా, అతడు “ప్రభూ! నీవు నా పాదములు కడుగుదువా?” అని ఆయనతో అనెను.
7. “నేను చేయుచున్నది ఇపుడు నీవు గ్రహింపలేవు. ఇకమీదట తెలిసికొందువు” అని యేసు పలికెను.
8. “నీవు నా పాదములు ఎన్నటికిని కడుగరాదు” అని పేతురు పలికెను. అందుకు యేసు “నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు” అని చెప్పెను.
9. “అట్లయిన ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగు ము” అని సీమోను పేతురు పలికెను.
10. “స్నానము చేసినవాడు పూర్తిగా శుద్దుడైయున్నాడు. అతడు పాదములుతప్ప మరేమియు కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు. కాని, మీలో అందరు కాదు” అని యేసు అతనితో చెప్పెను.
11. ఆయన తనను అప్పగించువానిని ఎరిగియుండెను. కనుక, “మీలో అందరును శుద్ధులుకారు” అని పలికెను.
12. ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరల తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి, ఇట్లు పలికెను: “నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా?
13. మీరు నన్ను బోధకుడనియు, ప్రభుడననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయన, నేను మీ బోధకుడను, ప్రభుడనైయున్నాను.
14. మరియు, ప్రభుడను, బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడ ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును.
15. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని.
16. దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు. పంపబడినవాడు పంపినవానికంటె గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
17. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు.
18. నేను మీ అందరి విషయమై మాట్లాడుట లేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియును. కాని 'నాతో భుజించువాడు నాకు విరుద్దముగా లేచును' అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది.
19. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను.
20. నేను పంపినవానిని స్వీక రించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచు న్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
21. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు “మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను.” అని స్పష్టముగ పలికెను.
22. అంతట ఆయన శిష్యులు “ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో” అని సందేహించుచు ఒకరి వంక మరియొకరు చూచుకొనసాగిరి.
23. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండియుండెను.
24. యేసు ఎవనిని గురించి ఈ మాట చెప్పెనో అడుగు మని సీమోను పేతురు అతనికి సైగచేసెను.
25. అతడు అట్లే యేసు వక్షఃస్థలమున వంగి. "ప్రభూ! అతడెవడు?” అని ప్రశ్నించెను.
26. “నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే” అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు 'యూదా'కు ఇచ్చెను.
27. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అపుడు యేసు వానితో, “నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము" అని పలికెను.
28. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించువారిలో ఎవరును గ్రహింపలేదు.
29. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున, యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో, లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి.
30. యూదా ఆ రొట్టెముక్కను తీసికొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ.
31. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను: “ఇపుడు మనుష్యకుమారుడు మహిమపరుపబడి ఉన్నాడు. ఆయనయందు దేవుడు మహిమపరుపబడెను.
32. ఆయనయందు దేవుడు మహిమపరుప బడినయెడల, దేవుడును తనయందు ఆయనను మహిమ పరచును. వెంటనే ఆయనను మహిమపరుచును.
33. చిన్న బిడ్డలారా! నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. 'మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు' అని యూదులతో చెప్పినట్లే మీతో కూడ చెప్పుచున్నాను.
34. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు.
35. మీరు పరస్ప రము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు.”
36. అందుకు సీమోను పేతురు "ప్రభూ! నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?” అని అడిగెను. “నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నావెంట రాలేవు. కాని, తరువాత రాగలవు” అని యేసు చెప్పెను.
37. “ప్రభూ! ఇపుడు మీవెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను” అని పేతురు పలికెను.
38. అందుకు యేసు “నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని చెప్పెను.