ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 12 || Telugu catholic Bible || యోహాను సువార్త 12వ అధ్యాయము

 1. పాస్కపండుగకు ఆరుదినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలోనుండి లేపబడిన లాజరు యొక్క స్వగ్రామము.

2. అక్కడ యేసుకు విందుచేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను.

3. అపుడు మరియమ్మ విలువైన, స్వచ్చమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును శేరున్నర తెచ్చి యేసుపాదములను అభిషేకించి, తన తలవెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను.

4. అంతట ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు,

5. “ఈ పరిమళ తైలము మూడువందల దీనారములకు అమ్మి పేదలకు ఈయగూడదా?” అనెను.

6. అతడు పేదలపట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయన, వాడు దొంగ. తనయెద్ద నున్న డబ్బులసంచినుండి దొంగిలించుచుండును.

7. అపుడు యేసు “ఆమెను అటుల చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు.

8. పేదలు ఎల్లపుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అనెను.

9. యేసు అక్కడ ఉన్నాడని యూద జనసమూహము తెలిసికొని వారు యేసునే కాదు ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడ చూచుటకు వచ్చిరి.

10. అంతట ప్రధానార్చకులు లాజరును కూడ చంపుటకు కుట్రచేసిరి.

11. ఏలయన, అతని మూలమున యూదులలో పలువురు తమవారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి.

12. మరునాడు పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చియున్నాడని వినెను.

13. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి, “ ' జయము! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక! యిస్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!” అని ఎలుగెత్తి చాటిరి.

14. యేసు ఒక చిన్న గాడిదను చూచి, దానిపై కూర్చుండెను. లేఖనమందు ఇట్లు వ్రాయబడియున్నది:

15. “సియోను కుమారీ, భయపడకుము ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. గాడిదపిల్లపై కూర్చుండి వచ్చుచున్నాడు."

16. ఆయన శిష్యులు మొదట దీనిని గ్రహింపలేకపోయిరి. కాని, యేసు మహిమపరుపబడినప్పుడు ఆయనను గురించి ఇటుల వ్రాయబడియున్నదనియు, అట్లే ప్రజలు ఆయన పట్ల వ్యవహరించిరనియు, వారికి స్ఫురణకు వచ్చెను.

17. సమాధినుండి లాజరును వెలుపలకు పిలిచి, వానిని మృతులలోనుండి పునర్జీవుని చేసినపుడు ఆయన వెంట ఉన్నవారు సాక్ష్యము పలికిరి.

18. ఆయన ఈ సూచకక్రియలు చేసెనని విని, జనసమూహము ఆయనను చూడబోయెను.

19. అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు “మన ప్రయత్నము ఎట్లు నిష్పలమయ్యెనో చూడుడు. లోకమంతయు ఆయన వెంటపోవుచున్నది” అని చెప్పుకొనిరి.

20. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి.

21. వారు గలిలీయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పున వెళ్ళి అతనితో "అయ్యా! మేము యేసును చూడగోరుచున్నాము" అనిరి.

22. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ, ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి.

23. అందుకు యేసు ఇట్లనెను: “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియవచ్చినది.

24. నేను మీతో నిశ్చయ ముగ చెప్పునదేమన: గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.

25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని, ఈలోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును.

26. నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును.

27. ఇపుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను! ఓ తండ్రీ! ఈ గడియనుండి నన్ను కాపాడుము. లేదు. నేను వచ్చినది. ఈ గడియ నిమిత్తమే కదా!

28. ఓ తండ్రీ! నీ నామమును మహిమ పరుపుము” అనెను. అంతట ఆకాశమునుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను: “నేను దానిని మహిమ పరచితిని. మరల మహిమపరచెదను”.

29. అక్కడ ఉన్న జనసమూహము అది విని “మేఘము గర్జించినది” అనిరి. కొందరు “దేవదూత ఆయనతో మాట్లాడెను” అనిరి.

30. కాని యేసు, “ఈ శబ్దము నా కొరకు రాలేదు. అది మీ కొరకే వచ్చినది.

31. ఇపుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసి వేయబడును.

32. నేను భూమినుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నాయొద్దకు ఆకర్షింతును” అని పలికెను.

33. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను.

34. జనసమూహము ఆయనను, “క్రీస్తు ఎల్లప్పుడును ఉండునని మేము ధర్మశాస్త్రమున వినియుంటిమి. మరి మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు ఎట్లు చెప్పుచున్నావు? ఈ మనుష్యుకుమారుడు ఎవడు?" అని ప్రశ్నించిరి.

35. అందుకు యేసు “ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్ము క్రమ్ముకొనకముందే, వెలుగు ఉండగనే నడువుడు. చీకటిలో నడుచువానికి, తాను ఎటు వెళ్ళుచున్నాడో తెలియదు.

36. మీరు వెలుగుపుత్రులుగా వుండుటకు వెలుగు ఉండగనే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుడు” అనెను. ఈ మాటలు చెప్పి యేసు వారికి కనుమరుగైపోయెను.

37. యేసు వారి ఎదుట ఎన్నో సూచకక్రియలు చేసినను వారు ఆయనను విశ్వసింపలేదు.

38. యెషయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను: “ప్రభూ! మా సందేశమును ఎవరు విశ్వసించిరి? ప్రభువు తన శక్తిని ఎవరికి బయలుపరచెను?”

39. ఇందువలన వారు విశ్వసింపలేకపోయిరి. ఏలయన, యెషయా ప్రవక్త మరల ఇట్లు పలికెను:

40. “వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని, నాచేత స్వస్థత పొందకుండునట్లు,  ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను."

41. యెషయా ఆయన మహిమను చూచెను. కనుక ఆయన విషయమై ఇట్లు పలికెను.

42. అయినను అధికారులలో కూడ పలువురు ఆయనను విశ్వసించిరి. కాని, ప్రార్థనామందిరమునుండి వెలివేయబడుదు మేమో అని పరిసయ్యులవలన భయముచే ఆయనను అంగీకరింపరైరి.

43. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పునే ఎక్కువగ కాంక్షించిరి.

44. యేసు ఎలుగెత్తి ఇట్లనెను: “నన్ను విశ్వసించు వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించు చున్నాడు.

45. నన్ను చూచువాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు.

46. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

47. నా మాటలు ఆలకించి, ఆచరించని వానిని ఖండించునది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకేగాని, ఖండించుటకు కాదు.

48. నన్ను తృణీకరించి, నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమదినమున వానిని ఖండించును.

49. నా అంతట నేను ఏమియు మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమిచెప్పవలయునో, ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు.

50. ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును. కనుక, నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడు చున్నాను.” 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services