1. “నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా: గొఱ్ఱెలదొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు, దోపిడికాడునై ఉన్నాడు.
2. ద్వారమున ప్రవేశించు వాడు గొఱ్ఱెలకాపరి.
3. కావలివాడు వానికి తలుపు తీయును: గొఱ్ఱెలు వాని స్వరమును వినును. అతడు తన గొఱ్ఱెలను పేరు పేరున పిలిచి, బయటకు తోలు కొనిపోవును.
4. తన గొఱ్ఱెలను అన్నిటిని బయటకు తోలుకొనివచ్చిన పిదప, వాడు వానికి ముందుగ నడచును. గొఱ్ఱెలు వాని స్వరమును గుర్తించును. కనుక, అవి వాని వెంటపోవును.
5. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు. కనుక, అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును.”
6. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కాని, ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి.
7. అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను: “ గొఱ్ఱెలుపోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
8. నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు, దోపిడిగాండ్రు. గొఱ్ఱెలు వారి స్వరమును ఆలకింపలేదు.
9. నేనే ద్వారమును! ఎవడేని నాద్వారా ప్రవేశించినయెడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును.
10. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవము నిచ్చుటకును, దానిని సమృద్ధిగ ఇచ్చుటకును వచ్చియున్నాను.
11. “నేను మంచికాపరిని. మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణమును ధారపోయును.
12. జీతగాడు గొఱ్ఱెల సొంతవాడుకాడు కనుక, తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచి పారిపోవును. తోడేలు గొఱ్ఱెలను పట్టి బెదరగొట్టును.
13. వాడు జీతగాడే కనుక, వానికి గొఱ్ఱెలను గురించి చింతలేక పారిపోవును.
14-15. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగియున్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొఱ్ఱెలను, నన్ను నా గొఱ్ఱెలును ఎరుగును. నేను గొఱ్ఱెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను.
16. ఈ గొఱ్ఱెల దొడ్డికి చెందని వేరే గొఱ్ఱెలును నాకు కలవు. వానినిగూడ నేను తోడుకొనిరావలయును. అవి నా స్వరమును ఆలకించును. అపుడు ఒకే మందయు, ఒకే కాపరియు ఉండును.
17. “ఈ కారణము చేతనే, తండ్రి నన్ను ప్రేమించును. ఏలయన నా ప్రాణమును మరలపొందుటకై దానిని ధారపోయుదును.
18. ఎవడును నా ప్రాణమును తీసికొనడు. నా యంతట నేనే ధారపోయుటకును, దానిని మరల తీసికొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది” అని యేసు పలికెను.
19. ఈ మాటల వలన మరల యూదులలో భేదాభిప్రాయములు ఏర్పడెను.
20.“అతనికి దయ్యము పట్టినది, అతడు వెట్టివాడు. అతని మాటలు ఏల లక్ష్యపెట్టెదరు?" అని వారిలో అనేకులు పలికిరి.
21. మరికొందరు “ఈ మాటలు దయ్యము పట్టినవాని మాటలుగా లేవు. దయ్యము గ్రుడ్డివారికి చూపును ఈయగలదా?" అనిరి.
22.యెరూషలేములో దేవాలయ ప్రతిష్ణోత్సవము జరుగుచుండెను.
23. అది శీతకాలము. యేసు దేవాలయమున సొలోమోను మంటపమున నడుచు చుండెను.
24. యూదులు ఆయనచుట్టు గుమిగూడి, “నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము” అని అడిగిరి.
25. అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయుపనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.
26. మీరు నా గొఱ్ఱెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముటలేదు.
27. నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును.
28. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు.
29. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు.
30. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము” అని చెప్పెను.
31. యూదులు మరల ఆయనను రాళ్ళతో కొట్టుటకు, రాళ్ళను తీసుకొనిరి.
32. యేసు వారిని “తండ్రియొద్దనుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్ళతో కొట్టుచున్నారు?” అని అడిగెను.
33. అందుకు యూదులు “నీవు మనుష్యుడవై ఉండియు, దేవుడనని అనుచున్నావు. కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము కాని, సత్కార్యము చేసినందుకు కాదు” అని అనిరి.
34. అందుకు యేసు వారితో ఇట్లనెను: “ 'మీరు దైవములని నేను చెప్పితిని' అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా?
35. దేవునివాక్కు ఎవరివద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్థకము కానేరదు గదా!
36. అట్లయిన, తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పి నందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా?
37. నేను తండ్రి పనులను చేయని యెడల మీరు నన్ను నమ్మవద్దు.
38. కాని, నేను వానిని నెరవేర్చుచున్నయెడల, మీరు నన్ను నమ్మకపోయినను, నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును, నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహింతురు.”
39. వారు మరల యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ఆయన వారి చేతులలో పడక తప్పుకొనిపోయెను.
40. యోహాను మొదట బప్తిస్మమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరల వెళ్ళి, అచటనే ఉండెను.
41. అనేకులు ఆయనయొద్దకు వచ్చిరి. “యోహాను సూచకక్రియలు ఏమియు చేయ లేదు. కాని, ఈయన గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము” అని వారు పలికిరి,
42. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి.