ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 1 || Telugu catholic Bible || యోహాను సువార్త 1వ అధ్యాయము

 1. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునియొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను.

2. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను.

3. సమస్తమును ఆయన మూలమున కలిగెను కలిగియున్నదేదియును ఆయన లేకుండ కలగలేదు

4. ఆయనయందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగాయెను.

5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు.

6. దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను.

7. అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను.

8. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెనే కాని, అతడు మాత్రము ఆ వెలుగు కాదు.

9. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది.

10. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొనలేదు.

11. ఆయన తనవారియొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరింపలేదు.

12. ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికిని ఆయన దేవుని బిడ్డలగు అధికారమును ప్రసాదించెను.

13. ఈ దైవపుత్రత్వము వారికి దేవునివలన కలిగినదే కాని, రక్తము వలన గాని, శరీరేచ్ఛవలన గాని, మానవసంకల్పమువలనగాని కలిగినది కాదు.

14. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్దనుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ.

15. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, “నా తరువాత వచ్చువాడు నాకంటె శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వమునుండియే ఉన్నవాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది” అని ఎలుగెత్తి పలికెను.

16. ఆయన పరిపూర్ణతనుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొందియున్నాము.

17. మోషేద్వారా ఒసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపాసత్యములు.

18. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షఃస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను.

19. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును 'నీవు ఎవడవు?' అని అడుగుటకు యాజకులను, లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను.

20. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయ లేదు. “నేను క్రీస్తును కాను” అని అతడు ఒప్పుకొనెను.

21. "అట్లయిన నీవు ఎవడవు? ఏలీయావా?” అని వారు ప్రశ్నించిరి. “కాదు” అని యోహాను సమాధా నము ఇచ్చెను. వారు మరల “నీవు ప్రవక్తవా?” అని అడిగిరి. “కాదు” అని అతడు పలికెను.

22. “మమ్ము పంపినవారికి మేము సమాధానము తీసికొనిపోవలయును. నీవు ఎవడవు? నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పు కొనెదవు?” అని అడిగిరి.

23. అందుకు అతడు, “నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును” అనెను.

24. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి.

25. “నీవు క్రీస్తువు, ఏలీయావు, ప్రవక్తవు కానిచో ఏల ఈ బప్తిస్మమును ఇచ్చుచున్నావు?”అని వారు అడిగిరి.

26. అందుకు యోహాను, “నేను నీటితో బప్తిస్మమును ఇచ్చు చున్నాను. కాని మీ మధ్య ఒకవ్యక్తి ఉన్నాడు. ఆయనను మీరు ఎరుగరు.

27. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే! నేను ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యు డనుకాను” అని సమాధానము ఇచ్చెను.

28.యోహాను బప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలితీరమునగల బెతానియాలో ఇది జరిగెను.

29. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, “ఇదిగో! లోకపాపములను పరిహ రించు దేవుని గొఱ్ఱెపిల్ల .

30. 'నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు. ఆయన నాకంటె శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వమునుండియే ఉన్నవాడు' అని నేను పలికినది ఈయనను గూర్చియే.

31. ఈయనను యిస్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను. కాని నేను ఆయనను ఎరుగనైతిని” అని పలికెను.

32. మరియు యోహాను, “ఆత్మ పావురమువలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూచితిని.

33. నేను ఆయనను ఎరుగనైతిని. కాని నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు 'నీవు ఎవరిపై ఆత్మదిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు' అని నాతో చెప్పెను.

34. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను” అని చెప్పెను.

35. మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా,

36. ఆ సమీపమున నడచిపోవుచున్న యేసును చూచి “ఇదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల ” అనెను.

37. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి.

38. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, “మీరేమి వెదకు చున్నారు?” అని అడిగెను. “రబ్బీ! (రబ్బీ అనగా బోధకుడని అర్ధము) నీవు ఎక్కడ నివసించుచున్నావు?” అని అడిగిరి.

39. “వచ్చి చూడుడు"అని యేసు సమాధాన మిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ.

40.యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రెయ.

41. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని “మేము మెస్సయాను కనుగొంటిమి” అని చెప్పెను. (మెస్సయా అనగా 'క్రీస్తు' 'అభిషిక్తుడు' అని అర్థము).

42. అతడు సీమోనును యేసు వద్దకు తీసికొనిరాగా, యేసు అతనిని చూచి “నీవు యోహాను కుమారుడవగు సీమోనువు. నీవు 'కేఫా' అని పిలువబడుదువు” అనెను (కేఫా అనగా 'రాయి" అని అర్థము).

43. మరునాడు యేసు గలిలీయ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో “నన్ను అనుసరింపుము" అని పలికెను.

44. ఫిలిప్పు కూడ అంద్రియ పేతురుల నివాసమగు బెత్సయిదా పుర నివాసియే.

45. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు” అని చెప్పెను.

46. “నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?” అని నతనయేలు అడుగగా, “వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను.

47. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు “ఇదిగో! కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు” అని చెప్పెను.

48. “మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు?” అని నతనయేలు అడుగగా యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని” అని సమాధానమిచ్చెను.

49. “బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు” అని నతనయేలు పలికెను.

50.“ 'నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటె గొప్ప కార్యములను నీవు చూడగలవు” అని యేసు చెప్పెను.

51. ఇంకను, “మీరు పరమండలము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.