ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

James chapter 5 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. భాగ్యవంతులారా! నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి, రోదింపుడు.

2. మీ భాగ్యములు మురిగిపోయినవి. బట్టలు చెదలు పట్టినవి.

3. మీ బంగారము, వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షియై మీ శరీర ములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాసులను కూడబెట్టితిరి.

4. ఇదిగో, మీ పొలములో పనిచేసినవారికి ఇచ్చుటలో మీరు మోసముగ బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతియైన దేవుని చెవుల చొచ్చుచున్నవి.

5. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి.

6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు.

7. కనుక, సోదరులారా! ప్రభువు విచ్చేయునంత వరకు ఓపికపట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంటకొరకు ఎదురు చూచుచున్నాడుగదా!

8. కాబట్టి మీరుకూడ ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయుదినము సమీపించి నది. కనుక ధైర్యముతో ఉండుడు.

9. సోదరులారా! మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురిచేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవే శింపనున్నాడు.

10. సోదరులారా! ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహన మననేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగ గైకొనుడు.

11. వారు సహనమును చూపిరి. కనుకనే వారిని ధన్యులనుచున్నాము. యోబు సహనమును గూర్చి వినియున్నాము. చివరకు ప్రభువు అతనికి ఏమి ఏర్పాటు ఒనర్చెనో మీకు తెలియును. ప్రభువు ఎంతయో జాలియును, కనికరమును కలవాడు కదా!

12. సోదరులారా! ముఖ్యముగా, మీరేదైన వాగ్దానము చేయునప్పుడు ఒట్టు పెట్టుకొనరాదు. పరలోకముపైగాని, అన్యధాగాని ప్రమాణము చేయ కుడు. అయినచో అవుననియు, కానిచో కాదనియు మాత్రమే పలుకుడు. అప్పుడు మీరు దేవుని తీర్పునకు గురి కాకుందురు.

13. మీలో ఎవడైన కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైన సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను.

14. మీలో ఎవ్వడైన వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను.వారు అతనికొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు.

15. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్ధన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును.

16. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొకరు ప్రార్ధించుకొనుడు. అప్పుడు మీరు స్వస్తులగుదురు. నీతిమంతుని ప్రార్ధన మహాశక్తిమంతమైనది.

17. ఏలీయా మనవంటివాడే. వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధించెను. తత్ఫలితముగ మూడు న్నర సంవత్సరములపాటు లోకమున వానలు లేకుండెను.

18.మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలుపండెను.

19. సోదరులారా! మీలో ఎవ్వడైన సత్యమునకు దూరమయ్యెననుకొనుడు. మరియొకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చెననుకొనుడు.

20. అటులైన దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడినవాడు అగును. వాని అనేక పాపములను క్షమింపజేసినవాడు అగును.