ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

James chapter 3 || Telugu Catholic Bible || యాకోబు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము

 1. సహోదరులారా! బోధకులమగు మనము ఇతరులకంటె తీవ్రముగ న్యాయవిచారణకు గురి అగుదుమని మీకు తెలియును గదా! కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు.

2. మనము అందరమును పెక్కు తప్పులు చేయుచునే ఉందుము. ఎన్న డును తన మాటలయందు తప్పు చేయనివాడు పరిపూర్ణుడే. అట్టివాడు తన శరీరమును అదుపులో ఉంచుకొనగల వ్యక్తి.

3. గుఱ్ఱములు మనకు లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతుము. అప్పుడే ఆ గుఱ్ఱములను మనము అదుపులో ఉంచగలము.

4. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు. అది పెద్దదే కావచ్చు. అది పెనుగాలికి కొట్టుకొని పోవుచున్నను ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోవును.

5. మన నాలుక విషయమునను ఇంతే. అది ఒక చిన్న అవయవమేయైనను, తనను తాను పొగడుకొనుటయందు అది దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవినైన తగులబెట్టును!

6. నాలుక నిప్పువంటిది. అదియొక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరము నంతను మలినము చేయును. మన జీవితము సర్వస్యమునకు అది నిప్పుపెట్టును. దానికి ఆ అగ్నిజ్వాల నరకము నుండియే ప్రాప్తించును.

7. మానవుడు జీవకోటినంతటిని మచ్చిక ఒనర్చుకొనగలడు. ఇంతకు పూర్వమే మచ్చిక ఒనర్చుకొనెను. పశుపక్ష్యాదులు. భూచర జలచరములు, వానికి లోబడినవే.

8. కాని నాలుకను లోబరచుకొనిన మానవుడు ఎవ్వడును లేడు. అది విశ్రమింపని దోషము, ఘోర విషపూరితము.

9. మన ప్రభువును పితయగు దేవుని స్తుతింతుము.  కాని ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మనతోడి మానవులను అదే నోటితో శపింతుముగదా!

10. ఆశీర్వచనమును, శాపవచనమును ఒకే నోటి నుండి ఉద్భవించుటయా! సోదరులారా! ఇట్లు జరుగరాదు.

11. ఒకే నీటి బుగ్గలోనుండి మంచినీరును, ఉప్పు నీరును ఊరునా!

12. సోదరులారా! అంజూరపుచెట్టుకు ఓలివలు, ద్రాక్ష తీగకు అంజూరములు కాయునా! అట్లే ఉప్పు నీటి బుగ్గనుండి మంచి నీరు ఊరదు.

13. మీలో ఎవరైన జ్ఞానియును, వివేకియును అగువాడు ఉండెనా? అయినచో అతడు తన సత్పవర్తనచేతను, వినయ వివేకములతో కూడిన సత్కార్య ముల చేతను దానిని నిరూపింపవలెను.

14. కాని మీ హృదయమున ఈర్ష్య ద్వేష స్వార్థ పరత్వములకు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు. సత్యమునకు విరుద్దముగ పలుకరాదు.

15. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగివచ్చినది కాదు. ఇది లౌకికము, భౌతికము, పైశాచికము.

16. ఏలయన, అసూయ స్వార్ధ పరత్వములు ఎచటనుండునో అచట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములును ఉండును.

17. కాని దివ్యమగు వివేకము స్వచ్చమయినది. అంతే కాక, అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్య ప్రదమగును. అది పక్షపాతమునకును, వంచనకును దూరమైనది.

18. శాంతిస్థాపకులు నాటిన శాంతిబీజముల ఫలసాయమే నీతి.