1. నా సోదరులారా! మీరు ప్రజలపట్ల పక్షపాతము లేకుండ ఉండవలెను. మీరు మహిమోపేతుడగు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు గదా!
2. వ్రేలికి బంగారు ఉంగరము, మంచిదుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించెనను కొనుడు. చింపిరిగుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించెననుకొనుడు.
3. “ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు” అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగను, “నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగ నేలపై కూర్చుండుము” అని పేదవానితోను, పలుకరాదు.
4. అట్లోనర్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును, దుర్బుద్ధితో న్యాయనిర్ణయములు చేయు వారును అగుదురు.
5. నా ప్రియ సోదరులారా! ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగ ఉండుటకును, తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. తనను ప్రేమించువారికి ఆ రాజ్యమును వాగ్దానమొనర్చెను.
6. కాని, పేదలను మీరు అవమానించితిరి. మిమ్ము పీడించి న్యాయాధిపతుల ఎదుటకు ఈడ్చునది ధనవంతులే గదా!
7. దేవుడు మీకు ప్రసాదించిన శుభనామమును గూర్చి దుర్భాషలాడునదియు వారే కదా!
8. “నిన్ను నీవు ప్రేమించుకొనునటులే నీ పొరుగు వానిని ప్రేమింపుము” అను లేఖనమునందలి ప్రము ఖమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చుట సముచితము.
9. కాని మీరు పక్షపాతబుద్దితో ప్రజలపట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకొందురు. ఆజ్ఞలను అతిక్రమించిన వారినిగ ధర్మశాస్త్రము మిమ్ము అందులకు శిక్షించును.
10. ఏలయన, ధర్మశాస్త్రమునంత యును పాటించుచు, దానిలో ఏ ఒక్క ఆజ్ఞను అతిక్రమించినను, వాడు ధర్మశాస్త్రమునంతయును ఉల్లంఘించిన దోషమునకు గురియగును.
11. ఎట్లన, “వ్యభిచరింపకుము” అని చెప్పిన వ్యక్తియే “హత్యచేయరాదు” అనియు పలికెను. కనుక మీరు వ్యభిచరింపకున్నను, హత్య యొనర్చినచో ధర్మశాస్త్ర మును ఉల్లంఘించిన వారగుదురు.
12. మానవులకు స్వాతంత్య్రమును ప్రసాదించు ధర్మశాస్త్రముచే న్యాయ నిర్ణయమొనర్పబడు వ్యక్తులుగ మీరు మాట్లాడుడు. అట్లే ప్రవర్తింపుడు.
13. కనికరము లేనివానికి కనికర ములేని తీర్పే దేవునినుండి లభించును. కనికరము తీర్పుకంటె గొప్పది.
14. నా సోదరులారా! ఏ వ్యక్తియైనను, “నాకు విశ్వాసము ఉన్నది” అని చెప్పుకొనినచో, తన చేతలు దానిని నిరూపింపకున్నయెడల దానివలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా?
15. కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైన, లేక సోదరియైన అలమటించుచున్నచో,
16. వారి జీవితావసరములను తీర్పక, 'సమాధానముగా వెళ్ళుడు, చలికాచుకొనుడు, తృప్తి పొందుడు' అని మీలో ఎవడైన పలికినయెడల ప్రయోజనమేమి?
17. కనుక దానిని అనుసరించి పనులొనర్పబడనిచో, క్రియలులేని విశ్వాసము నిర్జీవమే.
18. కాని, “నీకు విశ్వాసమున్నది, నాకు క్రియ లున్నవి” అని ఎవరైన పలికినచో దానికి సమాధానము ఇది: “క్రియలు లేకుండ నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును”.
19. దేవుడు ఒక్కడేయని నీవు విశ్వసింతువు గదా? మంచిదే! పిశాచములునూ విశ్వసించును. భయముతో గజగజలాడును.
20. మూర్ఖ మానవుడా! చేతలులేని విశ్వాసము నిష్పలమైనదని నీకు నిరూపింపబడవలెనా?
21. మన పితరుడగు అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలి పీఠముపై అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా!
22. ఇంకను గ్రహింపలేవా! అతని విశ్వాసమును, అతని చేతలును కలిసియే కృషిసలిపినవి. అతని విశ్వాసము అతని చేతల ద్వారా పరిపూర్ణత పొందినది.
23. “అబ్రహాము దేవుని విశ్వసించెను. అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగ ఎంచెను” అను లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడుగ. పిలువబడెను.
24. కనుక, కేవలము వాని విశ్వాసమువలన మాత్రమే కాక, వాని చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును.
25. వేశ్యయగు రాహాబు విషయమునను అట్లే. తన చేతల వలననే ఆమె నీతిమంతురాలుగ ఎంచబడెను. ఆమె యూదుల దూతలను ఆహ్వానించి వేరొక మార్గము ద్వారా వారు వెడలుటకు తోడ్పడినది గదా!
26. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే, చేతలులేని విశ్వాసమును నిర్జీవమే.