1. దేవునియొక్కయు, యేసుక్రీస్తు ప్రభువుయొక్కయు, సేవకుడగు యాకోబు నుండి: ప్రపంచమునందంతటను చెదరియున్న పండ్రెండు గోత్రముల వారికి శుభాకాంక్షలు.
2. నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు.
3. ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుటవలన, మీకు సహనము చేకూరును.
4. కాని మీ సహనము విఫలముకాక, తుదివరకు మిమ్ము తీసుకొనిపోవునట్లు చూచు కొనుడు. అపుడు మీరు ఏ కొరతయులేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు.
5. కాని మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను. ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగ అనుగ్రహించును గదా!
6. కాని అతడు విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్ర మును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్రతరంగము వంటివాడు.
7. అట్టి వాడు ప్రభువు నుండి ఏమైన పొందగలనని తలంపరాదు.
8. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు.
9. దీనస్థితిలో నున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను.
10. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డిపూవువలె ధనికుడు గతించి పోవును.
11. ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మాడ్చివేయును; వాని పూవు నశించును, దాని సౌందర్యము అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారములయందు మునిగియుండు ధనికుడును నశించును.
12. శోధనకు గురియైనను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయన, పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవకిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించువారికి దేవుడు వాగ్దాన మొనర్చిన బహుమానము.
13. ఏ వ్యక్తియైనను అట్టి పరీక్షచే శోధింపబడినచో, “నేను దేవునిచే శోధింపబడుచున్నాను” అని అతడు పలుకరాదు. ఏలయన, ఏ దుష్ట శక్తిచేతను దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు.
14. తన దుష్టవాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినపుడు మానవుడు శోధింపబడును.
15. అప్పుడు ఆ దుష్టవాంఛనుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును.
16. నా ప్రియ సోదరులారా! మోసపోకుడు.
17. అన్ని మంచి వరములును అన్ని సమగ్ర బహుమానములును పరలోకమునుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవునినుండియే అవి పుట్టును. ఆయన మార్పునొందడు. తిరోగమనుడై చీకటిని కలిగింపడు.
18. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తనసంకల్పము చేతనే, సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను.
19. నా ప్రియ సోదరులారా! దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు. ప్రతివ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనమును, మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు.
20. ఏలయన, దేవుని నీతినెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు.
21. కనుక సమస్త దుష్టప్రవర్తనలను, సర్వదురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగ ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తిగలది.
22. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు.
23. ఏలయన, ఆ వాక్కును కేవలము విని, ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనునట్టి వ్యక్తి వంటివాడు.
24. తన రూపమును ఒక్కమారు చూచుకొని, అతడు మరలిపోవును. ఆ క్షణముననే తన రూపమును మరచిపోవును.
25. కాని స్వాతంత్య్రము నొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగ పరిశీలించి కేవలము విని మరచుటకాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును.
26. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టి వాడు ఆత్మవంచన చేసికొనినట్లే.
27. తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమును, నిష్కళంకమునైన దైవభక్తి ఏదనగా అనాథలను, విధవరాండ్రను, వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండ, తనను తాను కాపాడుకొనుట అనునవియే.