ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Hebrews chapter 7 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము

1. ఈ మెల్కీసెదెకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి, యుద్ధభూమినుండి అబ్రహాము మరలి వచ్చుచుండగ, మెల్కీసెదెకు అతనిని కలిసికొని ఆశీర్వదించెను.

2. తన వద్దనున్న సర్వస్వము నుండియు పదియవ వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదెకు పేరునకు “నీతిమంతుడగు రాజు” అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన “శాంతికాముకుడగు రాజు” అనియు ఆయన పేరునకు అర్థము.

3. తండ్రి, తల్లి, వంశావళిలేని, జీవిత కాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలియున్నాడు. అతడు శాశ్వతముగ యాజకుడై ఉండును.

4. కనుక అతడు ఎంత గొప్పవాడో మీరు గ్రహింపగలరు. మూలపురుషుడు అబ్రహాము తాను యుద్ధమున సంపాదించిన సర్వస్వమునుండి అతనికి పదియవవంతు ఇచ్చెను.

5. అదేవిధముగ లేవీ వంశమునకు చెంది, యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రహాము సంతతివారైనను, ధర్మశాస్త్రముచొప్పున వారియొద్ద అనగా ప్రజలయొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు.

6. కాని మెల్కీసెదెకు లేవీ సంతతివాడు కాకపోయినను, అబ్రహామునుండి పదియవ వంతు వసూలు చేసికొని, దేవుని వాగ్దానములను పొందిన అతనిని దీవించెను.

7. తక్కువ వాడు ఎక్కువ వానిచేత దీవింపబడుననుట నిర్వివాదము.

8. ఇచట పదియవవంతు వసూలు చేయువారు మానవమాత్రులైన యాజకులు. కాని అచట, పదియవ వంతును అమరుడని సాక్ష్యము పొందిన మెల్కీసెదెకు పుచ్చుకొనుచున్నాడు.

9. అనగా అబ్రహాము పదియవవంతు చెల్లించినపుడు, పదియవ వంతు వసూలుచేయు ఆ లేవి కూడ అతని ద్వారా చెల్లించెను.

10. కాని, అప్పటికి ఇంకను లేవి జన్మింపలేదు. అనగా మెల్కీసెదెకు అబ్రహామును కలియున్నప్పటికి, లేవి తన పూర్వుడగు అబ్రహాము నందు అంతర్గతుడై ఉండెను.

11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఈయబడెను. కనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగియున్నచో అహరోను క్రమమున గాక, మెల్కీసెదెకు యాజక క్రమమున, మరియొక రకమగు యాజకుడు రావలసిన అవసరము ఉండెడిది కాదు.

12. ఎట్లన, యాజకత్వము మార్చబడినపుడు, చట్టమునందును మార్పురావలసి ఉండును.

13. మన ప్రభువును గూర్చియే ఈ విషయములు చెప్ప బడినవి. ఆయన వేరొక తెగకు చెందినవాడు. ఆ జాతి వారినుండి మరి ఎవ్వరును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు.

14. ఆయన యూద తెగయందు జన్మించెననుట విదితమే. అంతేకాక, మోషే యాజకులనుగూర్చి చెప్పినపుడు ఈ జాతిని పేర్కొనలేదు.

15. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కీసెదెకువంటి మరియొక యాజకుడు వచ్చియున్నాడు.

16. శరీరానుసారముగ చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగ చేయబడలేదు, అనంత మగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను.

17. ఏలయన ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడి యున్నది: “మెల్కీసెదెకు యాజకక్రమమున, నీవు సర్వదా యాజకుడవైయుందువు.”

18. కావున పాతనియమము బలహీనమును, నిరుపయోగమును అగుటచే త్రోసిపుచ్చబడినది.

19. మోషే చట్టము దేనిని సమగ్రము చేయజాలకుండెను. కనుక, ఈనాడు అంతకంటే ఉత్తమమగు ఒక నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడినది. దాని ద్వారా మనము దేవునికి సన్నిహితులము కాగలము.

20. అంతేకాక ప్రమాణము లేకుండ యేసు యాజకుడు కాలేదు. పూర్వము ఇతరులు ప్రమాణము లేకుండ యాజకులైరి.

21. దేవుడు ఆయనతో, “ప్రభువు ఒక ప్రమాణము చేసెను ఆయన మనసు మార్చుకొనడు, 'నీవు సర్వదా యాజకుడవైయుందువు' " అని పలుకుటచే, యేసు ప్రమాణపూర్వకముగ యాజ కుడయ్యెను.

22. కావున ఈ ప్రమాణము యేసును, మరింత మేలైన నిబంధనకు పూచీదారుగకూడ చేయుచున్నది.

23. వేరొక భేదముకూడ ఉన్నది. పూర్వ యాజకులు పెద్దసంఖ్యలోనున్నారు. ఎందుకనగా వారు మృత్యువు పాలై తమ పనిని సాగింపలేక పోవుటయే.

24. కాని యేసు శాశ్వతజీవి. కనుక ఆయన సదా యాజకత్వము కలిగియున్నాడు.

25. ఆయన, ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవియైయున్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును, ఎల్లప్పుడును సమర్దుడే.

26. కావున ఇట్టి ప్రధానయాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు. నిర్దోషి, నిష్కల్మషుడు. పాపాత్ములగు మనుజులనుండి వేరు చేయబడి జ్యోతిర్మండలముకంటె ఉన్నతుడుగ చేయబడినవాడు.

27. ఆయన ఇతర ప్రధానయాజకుల వంటివాడు కాదు. ప్రతిదినము, మొదట తన పాపములకొరకును, తరువాత ప్రజలపాపముల కొరకును బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. తనను తాను అర్పించుకొనినపుడు ఒకే ఒక బలిగ, శాశ్వతముగ అర్పించుకొనెను.

28. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగ నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణ వాక్కు సర్వదా సంపూర్ణుడుగ చేయబడిన దైవపుత్రుని నియమించెను.