ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Hebrews chapter 5 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. ప్రతి ప్రధానయాజకుడును ప్రజలనుండి ఎన్నుకొనబడి, వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను, బలులను అర్పించుట కొరకు నియమింపబడెను.

2. తానే పెక్కు విధములుగ బలహీనుడు కనుక, అజ్ఞానమువలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగ ఉండ గలుగును.

3. తానే బలహీనుడు కనుక, ప్రజల పాపములకొరకే కాక,తన పాపముల నిమిత్తము కూడ బలులను అర్పింపవలెను.

4. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపువలననే ఏ వ్యక్తియైనను ప్రధాన యాజకుడుగ చేయబడును.

5. అదే విధముగ ప్రధానయాజక పదవీ గౌరవ మును క్రీస్తు తనకుతాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను: “నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. "

6. మరియొకచోట దేవుడు ఇట్లు చెప్పెను: “మెల్కీసెదెకు యాజక క్రమమున, నీవు సర్వదా యాజకుడవైయుందువు."

7. తన ఇహలోక జీవితమున, మృత్యువునుండి తనను రక్షింప శక్తికలిగిన దేవునిగూర్చి, యేసు ఏడ్పు లతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను.

8. తాను దేవుని పుత్రుడై ఉండికూడ తానుపొందిన బాధలద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను.

9. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగువారి శాశ్వత రక్షణకు మూలమాయెను.

10. మెల్కీసెదెకు యాజక క్రమమున, ప్రధాన యాజకునిగ దేవుడు ఆయనను ప్రకటించెను.

11. దీనిని గూర్చి మేము చెప్పవలసినది చాల ఉన్నది కాని, విషయములను మీరు త్వరగా గ్రహింప కుండుటవలన మీకు వివరించుట కష్టము.

12. ఇప్పటికే మీరు బోధకులై ఉండవలసియున్నను మీకే వేరొకరు బోధింపవలసియున్నది. దేవుని సందేశ మును గూర్చిన ప్రాథమిక విషయములు కూడ మీకు తెలియవు. అన్నము తినదగిన మీరు ఇంకను పాలే త్రాగవలసియున్నది.

13. ఎవరైన పాలుత్రాగవలసియున్నచో వారు ఇంకను మంచి చెడులయందు అనుభవము లేని శిశువులే.

14. అట్లుకాక, బలమైన ఆహారము వయోజనుల కొరకైనది. వయోజనులు తమ అనుభవమువలన మంచిచెడులయందలి తారత మ్యమును అభ్యాసమువలన గ్రహింపగలుగుదురు.