ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Hebrews chapter 2 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. అందువలననే, మనము అన్యథా ప్రభావితులము కాకుండుటకై మనము వినిన సత్యములపైననే మరింత దృఢముగ ఆధారపడి ఉండవలెను.

2. దేవదూతల ద్వారా ఒసగబడిన సందేశము నిజమని నిరూపింపబడినప్పుడు, దానిని అనుసరింపని, దానికి తలవంచని ప్రతి వ్యక్తియు తగిన శిక్షను పొందియుండగా,

3. ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన మనము ఎట్లు తప్పించుకొనగలము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. ఆయన మాట వినినవారు అది యథార్థమని మనకు నిరూపించిరి.

4. అదే సమయమున, తమ సూచకక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుత కృత్యముల చేతను తన చిత్తానుసారముగ అనుగ్రహించిన పవి త్రాత్మ వరములచేతను దేవుడే వారి పలుకులకు సాక్షి అయ్యెను.

5. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమునకు దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు.

6. అయితే ఒకానొకడు ఒకచోట ఇట్లు సాక్ష్యమిచ్చు చున్నట్లుగ: “ఓ దేవా! నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు? నీవతడిని లక్ష్యపెట్టుటకు అల్పుడగు మానవపుత్రుడు ఎంతటివాడు?

7. కొద్దికాలము మాత్రమే అతనిని దేవదూతల కంటె తక్కువగ చేసితివి. మహిమతో, గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపజేసి

8. సర్వమును అతని పాదాక్రాంతమొనర్చితివి." “సర్వమును అతని పాదాక్రాంతమొనర్చెను” అనగా అతనికి లోబరచకుండ దేనిని విడువలేదు అని అర్ధము. కాని ఇంకను ప్రస్తుతమందు అంతయును అతనికి లోపరచబడుట మనము చూచుటలేదు.

9. కాని, మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహమువలన మానవులందరి కొరకై తాను మరణించునట్లు, కొద్దికాలమువరకు ఆయన దేవదూతలకంటె తక్కువగ చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదనవలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుట చూచుచున్నాము.

10. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు, తన మహిమలో పాలుపంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధలద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే.

11. మానవులను పాపమునుండి ప్రక్షా ళన చేసినవానికి, పాపప్రక్షాళన చేయబడినవారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు.

12. ఆయన ఇట్లు చెప్పెను: "ఓ దేవా! నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించెదను. ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను."

13. "నేను దేవునియందు విశ్వాసముంచెదను” అనియు “ఇదిగో, దేవుడిచ్చిన పుత్రులతో నేనిట ఉంటిని” అనియు పలికెను.

14. తాను పుత్రులని పిలుచువారు, రక్తమాంస పూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారివలె అగుటయేకాక, వారి మానవస్వభావము నందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును,

15. తద్వారా మృత్యుభయముచేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపినవారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను.

16. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించి నది కాదని, అబ్రాహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది.

17. ప్రజల పాపముల పరిహా రార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును, దయామయుడును అగు ప్రధానయాజకుడగుటకుగాను, ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము.

18. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక, ఇప్పుడు ఆయన శోధింపబడువారికి సాయపడగలడు.