ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Hebrews chapter 13 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము

 1. సోదరులుగ ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు.

2. పరాయి వారికి ఆతిథ్య మొసగుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి.

3. మీరును వారితోపాటు ఖైదీలైనట్లుగ, చెరసాల యందున్న వారిని స్మరింపుడు. మీరును శరీరముతో ఉన్నారు కనుక బాధలనొందుచున్నవారిని స్మరింపుడు.

4. వివాహము అన్ని విషయములలోను ఘనమైనది. వివాహబంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయన, అవినీతిపరులును, వ్యభిచారులును, దేవుని తీర్పునకు గురియగుదురు.

5. ధనాపేక్షనుండి మీ జీవితములను దూరముగ ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయన, “నేను మిమ్ము ఎన్నడును విడువను. ఏనాటికిని ఎడబాయను” అని దేవుడు చెప్పెను.

6. కనుక, ధైర్యముతో మనము “ప్రభువు నాతోడు నీడ, నేను భయపడను! మానవుడు నన్ను ఏమి చేయగలడు?” అని పలుకుదము.

7. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతిచెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు.

8. నిన్నను, నేడును, ఎల్లపుడును యేసుక్రీస్తు ఒకే రీతిగ ఉండును.

9. విభిన్నములును, విచిత్రములైన బోధనలు మిమ్ము సన్మార్గమునుండి మరల్పనీయకుడు. ఆహార నియమములకు విధేయులమై ఉన్నదాని కంటె, దేవుని అనుగ్రహమువలన మన ఆత్మలు దృఢపరుపబడుట ఉత్తమము. ఆ నియమములను పాటించినవారికి అవి సహాయపడలేదు.

10. యూదుల గుడారమున సేవలనర్పించు యాజకులకు, మన బలిపీఠముపై అర్పింపబడిన బలిని భుజించుటకు ఎట్టి అర్హతయును లేదు.

11. యూదుల ప్రధానయాజకుడు పాపములకు బలిగ అర్పించుటకు ఏ జంతువుల రక్తమును పవిత్ర స్థలము లోనికి తెచ్చునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును.

12. ఈ కారణముననే, తన రక్తముచే ప్రజలను పాపములనుండి శుద్ది యొనర్చుటకు యేసు గూడ నగర ద్వారమునకు వెలుపలనే మరణించెను.

13. కనుక మనమును శిబిరము వెలుపలకు వెడలి ఆయన అవమానమున పాలుపంచుకొందము.

14. ఈ భూమిపై మనకు స్థిరమగు నగరము ఏదియులేదు. ఇకముందు రాగల నగరమును గూర్చి మనము ఎదురుచూచు చున్నాము.

15. కావున, యేసుద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్రబలులను అర్పింతము. అనగా ఆయన నామమునకు మనము ముక్తకంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతము.

16. ఒకరికొకరు మేలొనర్చి ఉన్న దానిలో పాలుపంచుకొనుట మరువకుడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు.

17. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారివలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులె ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగ నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము.

18. మా కొరకై సదా ప్రార్ధింపుడు. సర్వదా మనము సత్కార్యములనే ఒనర్పవలెనను తలంపు కలవారమగుటచే, మనము స్వచ్చమగు అంతఃకరణ మును కలిగి ఉన్నామనుట నిశ్చయము.

19. త్వర లోనే నన్ను మీ వద్దకు చేర్చుటకై దేవుని ప్రార్థింపవలసినదిగ మిమ్ము బతిమాలుచున్నాను.

20. గొఱ్ఱెల గొప్పకాపరియైన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలోనుండి లేపిన,

21. సమాధానకర్తయైన దేవుడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక! ఆయనకు ఏది యిష్టమగునో అది యేసు క్రీస్తు ద్వారా మనయందొనర్చునుగాక! యేసు క్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగును గాక! ఆమెన్.

22. సోదరులారా! ఈ నా హెచ్చరికను సహనముతో ఆలకింపవలసినదిగ మిమ్ము వేడుకొనుచున్నాను. నేను మీకు వ్రాసిన ఈ లేఖ అంత పెద్దది కాదు.

23. మన సోదరుడగు తిమోతి చెరసాలనుండి విడుదల అయ్యెనని తెలిసికొనగలరు. అతడు త్వరలో వచ్చినచో నేను మిమ్ము చూచుటకు వచ్చినపుడు వెంట తీసికొనిరాగలను.

24. మీ నాయకులకు అందరకును, దేవుని ప్రజలకును, మా శుభాకాంక్షలను అందింపుడు. ఇటలీ దేశపు సోదరులు మీకు శుభాకాంక్షలు చెప్పుచున్నారు.

25. దేవుని కృప మీ అందరితో ఉండునుగాక!