ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Hebrews chapter 11 || Telugu Catholic Bible || హెబ్రీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము

 1. విశ్వసించుటయన, మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగ ఉండుట; మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయ ముగ ఉండుట.

2. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి.

3. కంటికి కనిపింపని వానినుండి, కంటికి కనిపించు ప్రపంచము దేవుని వాక్కుచేత సృజింప బడినదని, విశ్వాసమువలన మనకు అర్థమగుచున్నది.

4. విశ్వాసమువలన హేబెలు కయీను కంటె ఉత్తమమగు బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వా సమువలన అతడు నీతిమంతుడని గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడే అందుకు సాక్షి. హేబెలు మరణించెను. కాని విశ్వాసముద్వారా అతడు ఇంకను మాటలాడుచునే ఉన్నాడు.

5. విశ్వాసమే హనోకును మృత్యువునుండి కాపా డినది. అతడు దేవునివద్దకు తీసికొనిపోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరును అతనిని కనుగొన లేకపోయిరి. తాను తీసికొనిపోబడక పూర్వమే హనోకు దేవుని సంతోషపెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపు చున్నది.

6. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతివ్యక్తి, దేవుడు ఉన్నాడనియు, తన కొరకై వెదకువారికి ఆయన ప్రతిఫలమిచ్చుననియు విశ్వసింపవలెను.

7. తాను చూడని భవిష్యత్కాలపు విషయము లను గూర్చిన దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసమే. అతడు దేవునికి విధేయుడై ఒక ఓడను నిర్మించెను. దానియందే అతడును, అతని కుటుంబమును రక్షింపబడిరి. కాగా ప్రపంచము తీర్మానింపబడినది. నోవా విశ్వాసమువలన కలుగు నీతికి వారసుడాయెను.

8. విశ్వాసమే, దేవుడు పిలిచినపుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చెదనని వాగ్దానమొనర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచటికి పోవుచున్నది తెలియకయే, అతడు తన స్వదేశమును విడిచెను.

9. విశ్వాసమువలననే, దేవుడు తనకు వాగ్దానమొనర్చిన దేశమున తానొక విదేశీయునివలె నివసించెను. దేవుని వద్దనుండి అదియే వాగ్దానమును పొందిన ఈసాకు, యాకోబులతో గుడారములయందు అతడు నివసించెను.

10. దేవునిచే నిర్మింపబడి ఏర్పరుపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురుచూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది.

11. సారా వయస్సు మరలినదైనను, విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయన, దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను.

12. మృత తుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే, ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్రతీరమునందలి యిసుక రేణువులవలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను.

13. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరును మరణించిరి. దేవుడు వాగ్దానమొనర్చిన విషయములను వారు పొందలేదు. కాని చాలదూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమనియు, యాత్రికులమనియు వారు బహిరంగముగ ఒప్పుకొనిరి.

14. అట్లు పలుకు వారు తమకొరకు ఒక స్వదేశమును గూర్చి వెదకు చుంటిమని స్పష్టముచేయుదురు.

15. కానీ, వారు వదలివచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటుల ఆలోచించినచో, తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండెడిది.

16. కాని వారు అంతకంటె ఉత్తమమగు దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారిచేత, వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను.

17. దేవుడు, అబ్రహామును పరీక్షించినపుడు విశ్వాసముచేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగ అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైకకుమారుని బలిగ అర్పించుటకు సిద్ధపడెను.

18. “ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును” అని దేవుడు అతనితో చెప్పియుండెను.

19. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువునుండి తిరిగి పొందినట్లుగా పొందెను,

20. విశ్వాసమువలన ఈసాకు భవిష్యత్తు కొరకై యాకోబు ఏసావులను ఆశీర్వదించెను.

21. విశ్వాసమువలన యాకోబు తన మరణమునకుముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.

22. తానుమరణింపనున్న సమయమున యోసేపు విశ్వాసము చేతనే ఐగుప్తు నుండి యిస్రాయేలీయుల నిర్గమనమును గూర్చి చెప్పి, తన శరీరము ఏమి చేయవలయునో అను విషయమును గూర్చి ఉత్తరువులను ఇచ్చెను.

23. విశ్వాసమే మోషే తల్లిదండ్రులు, అతడు పుట్టినది మొదలుకొని, మూడునెలలపాటు వానిని దాచి ఉంచునట్లు చేసినది. అతడు మిక్కిలి అందమైన బాలుడని గ్రహించి, రాజాజ్ఞను ధిక్కరించుటకు వారు భయపడలేదు.

24. విశ్వాసమే, మోషే పెరిగి పెద్దవాడైన తరువాత, ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించునట్లు చేసినది.

25. పాప పూరితములు క్షణికములగు సౌఖ్యములకంటె, దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకొనెను.

26. ఐగుప్తులోని సమస్త ధనరాసుల కంటె, క్రీస్తుకొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను.

27. విశ్వాసమే రాజు కోపమును లెక్కచేయక, మోషే ఐగుప్తును విడిచి వెడలునట్లు ఒనర్చినది. అగో చరుడగు దేవుని తాను దర్శించెనో అనునట్లు అతడు వెనుకకు మరలలేదు.

28. మృత్యుదేవత యిస్రాయేలీయుల ప్రథమ సంతానములను చంపకుండ ఉండునట్లు, మోషే పాస్కను నియమించి, ద్వారములపై రక్తమును చల్లుటకు ఆజ్ఞాపించునట్లు చేసినది విశ్వాసమే.

29. విశ్వాసమే, యిస్రాయేలీయులు ఎండిన నేలపై నడచిన విధమున రెల్లు సముద్రమును దాటునట్లు చేసినది. ఐగుప్తువారును అట్లే చేయుటకు ప్రయ త్నింపగా, నీరు వారిని మ్రింగివేసెను.

30. విశ్వాసమే, యెరికో గోడల చుట్టును యిస్రాయేలీయులు ఏడు దినములపాటు తిరిగిన తరువాత అవి కూలిపోవునట్లు చేసెను.

31. రాహాబు, గూఢచారులకు స్నేహపూర్వకమైన స్వాగతము ఒసగుటచే, దేవునికి అవిధేయులైన వారితో పాటు చంపబడకుండ, విశ్వాసమే వేశ్యయగు ఆమెను కాపాడెను.

32. ఇంకను చెప్పవలెనా? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూవేలు అనువారిని గూర్చియు, ప్రవక్తలను గూర్చియు వివరించుటకు చాలినంత సమయము లేదు.

33. విశ్వాసమువలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి, దేవుని వాగ్దానఫలమును పొందిరి. వారు సింహముల నోళ్ళను మూసిరి.

34. భయంకరమైన అగ్నులను చల్లార్చిరి. ఖడ్గముల మూలమున మృత్యువువాత పడకుండ తప్పించు కొనిరి. వారు బలహీనులైనను, బలవంతులుగ మారిరి. వారు యుద్ధములందు మహాశక్తిమంతులై శత్రు సైన్య ములను ఓడించిరి.

35. కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్చను అంగీకరింపక, ఉత్తమ పునరుత్థానమును పొందుటకై హింసింపబడిరి.

36. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాలయందుండిరి.

37. వారు రాళ్ళచే కొట్టబడిరి, రంపములచే కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొఱ్ఱెలయొక్కయు, మేకలయొక్కయు తోళ్ళను కప్పుకొని శ్రమలు, హింసలననుభవించుచు దరిద్రులవలె వారు వీధులవెంట తిరిగిరి.

38. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనదికాదు! శరణార్థులవలె వారు ఎడారులలో పర్వతములయందును సంచరించుచు గుహలలోను, సొరంగములలోను తలదాచుకొనిరి.

39. వారి విశ్వాసమువలన వారు ఎంతటి ఘనతను సాధించిరో గదా! అయినను దేవుడు వాగ్ధానమొనర్చినది ఏదియో అది వారు పొందలేదు.

40. ఏలయన మనకొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్డులను చేయవలెనని ఆయన ఆశయము.