1. యోసేపు తన గృహనిర్వాహకుని ఇట్లు ఆజ్ఞాపించెను: “ఆ మనుష్యులు తీసికొని పోగలిగినన్ని ఆహారపదార్థములతో వారి గోనెసంచులను నింపుము. ఎవరిరూకలు వారి సంచిమూతిదగ్గర పెట్టుము.
2. ధాన్యము కొనుటకు తెచ్చిన సొమ్ముతో పాటు నా గిన్నెను, వెండిగిన్నెను కడగొట్టు తమ్ముని గోనె సంచి మూతికడ ఉంచుము.” వాడు యోసేపు చెప్పినట్లే చేసెను.
3. తెల్లవారిన తరువాత వారు ప్రయాణమై గాడిదలను తోలుకొనిపోయిరి.
4. వారు నగరము నుండి ఎంతో దూరము వెళ్ళకమునుపే యోసేపు గృహనిర్వాహకునితో “వెంటనే వెళ్ళి వారిని కలిసికొనుము. 'చేసిన మేలునకు బదులుగా కీడు చేయుదురా? నా వెండిగిన్నెను అపహరించితిరేల?
5. ఇది మా దొర పానీయము సేవించుటకు, శకునములు చూచుటకు ఉపయోగించు గిన్నెగదా? మీరెంత పాడు పని చేసితిరి' అని అనుము” అని చెప్పెను.
6. అతడు వారిని కలిసికొని యోసేపు చెప్పుమనిన మాటలన్నియు వారివద్ద వల్లించెను.
7. అంతట వారు “ఎంతమాట సెలవిచ్చితిరి! కలలోనైన మేము ఇటువంటి పనిని తలపెట్టకుందుముగాక!
8. మా గోనెసంచుల మూతులదగ్గర డబ్బు కనబడినదికదా! వానిని మీకిచ్చివేయుటకు కనాను నుండి తెచ్చితిమి. మీ యజమానుని ఇంటినుండి వెండిగాని, బంగారముగాని దొంగిలింపవలసిన అక్కరమాకేమున్నది?
9. మాలో ఎవ్వరి దగ్గరనైన మీ గిన్నె ఉన్న వానితల తీయుడు. పైగా మేమందరము బానిసలమగుదుము” అనిరి.
10. “అటులయిన మంచిది. మీరు చెప్పునది ఒప్పుకొందును. గిన్నె కలవాడు నాకు బానిసగును. మిగిలినవారు వెళ్ళి పోవచ్చును” అని అతడనెను.
11. వెంటనే వారిలో ప్రతివాడు తన గోనె సంచిని నేలమీదికి దింపి దాని మూతివిప్పెను.
12. గృహనిర్వాహకుడు పెద్దవాని గోనెసంచి మొదలు చిన్నవాని గోనె సంచి వరకు అన్నింటిని వెదకెను. చివరకు బెన్యామీను గోనెసంచిలో గిన్నె కనబడెను.
13. ఇది చూచి వారు దుస్తులు చించుకొనిరి. గాడిదల పైకి గోతాలెత్తించు కొని నగరమునకు తిరిగివచ్చిరి.
14. యూదా సోదరులతోపాటు వచ్చుసరికి యోసేపు ఇంటివద్దనే ఉండెను. వారు అతని ముందు సాగిలబడిరి.
15. అంతట యోసేపు “మీరిటువంటి పనినెట్లు చేసితిరి? నావంటివాడు శకునములు చూచి జరిగిన కార్యము గుర్తింపకుండునా?” అనెను.
16. అప్పుడు యూదా “ప్రభూ! మేమేమి చెప్పగలము? నిర్దోషులమని ఎట్లు ఋజువు చేసికొనగలము? దేవుడే మా పాపములను కనిపెట్టెను. ఇదిగో! మేము మాతో పాటు గిన్నెగలవాడును ఏలినవారి బానిసలమయ్యెధము” అనెను.
17. దానికి యోసేపు “కలలోనైనా నేనటువంటి పనిని తలపెట్టను. గిన్నె గలవాడు నాకు బానిసగును. మిగిలిన మీరందరు ఏ దిగులు లేకుండ మీ తండ్రి దగ్గరకెళ్ళవచ్చును.” అనెను.
18. యూదా అతని దగ్గరకెళ్ళి "ప్రభూ! నా మనవిని చిత్తగింపుడు. ఏలినవారితో ఒక్కమాట చెప్పు కొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభువు వంటివారు.
19. ఏలినవారు 'మీకు తండ్రి ఉన్నాడా? తమ్ముడున్నాడా?' అని తమ దాసులను అడిగితిరి.
20. 'కాటికి కాళ్ళుచాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు. వాడుచిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాబము' అని మేము చెప్పితిమి.
21. తరువాత ఏలినవారు 'నేనతనిని చూడవలయును. నా దగ్గరకు అతనిని తీసికొనిరండు' అని చెప్పితిరి.
22. అంతట మేము 'ఆ చిన్నవాడు తండ్రిని వదలిరాలేడు. వాడు కంటబడనిచో తండ్రికి ప్రాణములు నిలువవు' అని చెప్పితిమి.
23. కాని మీరు 'మీ తమ్ముడు మీతోపాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు' అంటిరి.
24. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలన్నియు చెప్పితిమి.
25. ఆ పిమ్మట 'మరలవెళ్ళి ఆహార పదార్థములు కొని తీసికొనిరండు' అని మా తండ్రి చెప్పెను.
26. 'మేమక్కడికి వెళ్ళలేము. తమ్ముడు లేకుండ మేమాయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము' అని అంటిమి.
27. దానికి మీదాసుడైన మా తండ్రి 'మీకు తెలియని దేమున్నది? నా భార్య ఇద్దరు కుమారులను కనెను.
28. వారిలో ఒకడు నన్నొదలిపోయెను. ఏదో మృగము నిశ్చయముగా వానిని కండతుండెములు చేసియుండునని అనుకొంటిని. వాడు ఈనాటివరకు కనబడలేదు.
29. ఉన్న ఈ ఒక్క కుమారునికూడ మీరు నాకు దూరము చేయుదురా? వానికి ఏ హానియైన కలిగిన ముదుసలినై, తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే' అని అనెను.
30. ఇప్పుడు మాత్రము ఈ చిన్నవాడు లేకుండ నేను మా తండ్రి దగ్గరకు వెళ్ళినచో మా తండ్రి ప్రాణ మితనితో ముడిపడియున్నది కనుక, జరగబోవునది ఒక్కటియే.
31. తమ్ముడు మా వెంటరాలేదని తెలిసిన వెంటనే మా తండ్రి మరణించును. మీ దాసులమైన మేమే ముదుసలియై తలనెరసియున్న మీ దాసుడైన మా తండ్రి దిగులుతో కుళ్ళి కుళ్ళి చనిపోవుటకు కారణమగుదుము.
32. ప్రభూ! మా తమ్మునికై మా తండ్రికి పూచీ ఇచ్చినది మీ దాసుడనైన నేనే. 'నేను తమ్ముని తిరిగి తీసికొనిరానిచో బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును' అని మా తండ్రితో చెప్పితిని.
33. మా తమ్మునకు బదులుగా నేను ఏలిన వారి బానిసనగుదును. సోదరులతోపాటు అతనిని వెళ్ళనిండు.
34. తమ్ముడు లేకుండ తండ్రి దగ్గరకు ఏ మొగము పెట్టుకొనివెళ్ళెదను? నా తండ్రికి దాపురించు విపత్తును నేను చూడజాలను” అనెను.