1. దేశములో కరువు ఇంకను తీవ్రముగా ఉండెను.
2. ఐగుప్తుదేశమునుండి తెచ్చిన ధాన్యమంతయు అయిపోయినది. యాకోబు బిడ్డలను పిలిచి “ఐగుప్తుదేశమునకు మరలవెళ్ళి కొంచెము ధాన్యముతెండు” అని చెప్పెను.
3. అంతట యూదా “మీ తమ్ముడు లేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మోమాటము లేకుండా మమ్ము హెచ్చరించెను.
4. నీవు మావెంట తమ్ముని పంపినచో మేము వెళ్ళి ధాన్యము కొనితెత్తుము.
5. పంపనందువా! మేము వెళ్ళము. మీ తమ్ముడు వెంటలేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మాతో ఖచ్చితముగా చెప్పెను” అనెను.
6. ఈ మాటలువిని యిస్రాయేలు “మీరునన్నింత రాచిరంపాన పెట్టనేల? మాకింకొక తమ్ముడున్నాడని అతనితో మీరేల చెప్పితిరి?” అని అడిగెను.
7. దానికి వారు "మేము ఏమిచేయగలము? మీ తండ్రి ఇంకను బ్రతికియున్నాడా? మీకింకొక సోదరుడు కలడా? అని అతడు మనలను గూర్చి మన చుట్టపక్కాలను గూర్చి గ్రుచ్చిగుచ్చి ప్రశ్నించెను. మేము ఆ ప్రశ్నలకు బదులిచ్చితిమి. ఐగుప్తు దేశమునకు తమ్ముని తీసికొని రండని అతడు అడుగునని మేము ఏమైనా కల గంటిమా?" అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.
8. యూదా, తండ్రితో “నాతో పాటు తమ్ముని పంపుము. మేము వెంటనే బయలుదేరి వెళ్ళెదము. ఈ విధముగా చేసిన నీవు, మేము, మా పిల్లలందరమును చావక బ్రతికి పోవుదుము.
9. తమ్మునకు నేను పూచీగా నుందును. భారమంతయు నాది. అతనిని తిరిగి తీసికొనివచ్చి నీకు అప్పగింపకున్న నేను బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నానెత్తికి చుట్టుకొనును.
10. ఈ విధముగా మాటలతో కాలము వెళ్ళబుచ్చకున్నచో మేము ఈపాటికి రెండవ సారి కూడ వెళ్ళివచ్చెడివారమే కదా!” అని చెప్పెను.
11. అంతట యిస్రాయేలు వారితో “మీరు కుఱ్ఱవానిని తీసికొనిపోవుట తప్పనిచో ఈ విధముగా చేయుడు. ఈ దేశములో సుప్రసిద్ధములయిన వస్తువులు -లేపనములు, తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాపప్పు, బాదముపప్పు సంచులలో తీసికొని వెళ్ళి ఆ దేశాధికారికి కానుకగా నివ్వుడు.
12. ఈసారి రెండింతలసొమ్ము తీసికొనివెళ్ళుడు. మీ సంచులలో పెట్టినసొమ్ము తిరిగి ఇచ్చివేయుడు. పోయినసారి బహుశ ఏదైనా పొరపాటు జరిగియుండవచ్చును.
13. మీ తమ్ముని కూడ వెంట బెట్టుకొనిపొండు. సూటిగా అతని దగ్గరకే వెళ్ళుడు.
14. సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అతనియెదుట మిమ్మును కరుణించు గాక! మీరక్కడ వదలివచ్చిన సోదరునితోపాటు బెన్యామీనును కూడ అతడు తిరిగి పంపునుగాక! ఇక నా మాటందురా? నేను కుమారుని కోల్పోవలసివచ్చిన అటులనే కోల్పోవుదును” అనెను.
15. వారు తండ్రి చెప్పినట్లు కానుకలను, రెండురెట్ల సొమ్మును తీసికొని బెన్యామీనుతో పాటు వెంటనే ఐగుప్తుదేశమునకు బయలుదేరి వెళ్ళి, యోసేపును దర్శించిరి.
16. యోసేపు వారితో పాటు వచ్చిన బెన్యామీనును చూచెను. గృహనిర్వాహకుని పిలిచి “వీరిని ఇంటి లోపలికి తీసికొనిపొమ్ము. ఒక వేటను కోసి భోజనము సిద్ధము చేయుము. మధ్యాహ్నము వీరు నాతోపాటు భోజనము చేయుదురు” అని ఆజ్ఞాపించెను.
17. అతడు యోసేపు చెప్పినట్టు వారిని లోపలికి తీసికొనిపోయెను.
18. ఇంటిలో ప్రవేశించిన తరువాత వారికి భయము కలిగెను. వారు "మొదటిసారి వచ్చిపోయినప్పుడు మన గోనె సంచులలో పెట్టిన సొమ్ముకొరకు ఇతడు మనలను ఈ ఇంటికి రప్పించెనేమో! ఇతడేదో ఒక నేరముకల్పించి తప్పక మనలను, మన గాడిదలను వశము చేసుకొనును. మనమితని బానిసల మగుట తప్పదు” అని అనుకొనిరి.
19. ఇట్లు ఊహించి తలవాకిటిలో యోసేపు గృహనిర్వాహకుని చూచి,
20. "అయ్యా! మేము మొదటిసారి ధాన్యమును కొనుటకు వచ్చితిమికదా?
21. తిరిగి వెళ్ళుచు మేము ఆ రాత్రి విడిదిచేసినచోట ఆ గోనెసంచులు విప్పితిమి. ఒక్కొక్కరి సొమ్ము వానివాని సంచిమూతిదగ్గర ఉండుట చూచితిమి. ఆ సొమ్మును . ఈసారి తిరిగి తెచ్చితిమి.
22. ఆహార పదార్థములు కొనుటకు మరికొంత సొమ్ముకూడ దానికి జతచేసి తెచ్చితిమి. మా గోనె సంచులలో మా సొమ్మును ఎవరు ఉంచిరో మాకు తెలియదు” అనిరి.
23. వారి దీనవాక్యములువిని గృహనిర్వాహ కుడు “మీకు తప్పక మేలుజరుగును. భయపడకుడు. మీరును, మీ తండ్రులును కొలచిన దేవుడే మీ గోనె సంచులలో సొమ్ము దాచెను. ఆనాడే మాసొమ్ము మాకుముట్టినది” అని చెప్పెను. ఇట్లు చెప్పి అతడు షిమ్యోనును వారిచెంతకు తీసుకొని వచ్చెను. -
24. పిమ్మట అతడు వారిని ఇంటిలోనికి తీసికొని పోయెను. కాలు సేతులు కడుగుకొనుటకు వారికి నీళ్ళిచ్చెను. గాడిదలకు మేత వేయించెను.
25. ఆ ఇంటిలోనే తాము భోజనము చేయవలయునని వారు తెలిసికొనిరి. మధ్యాహ్నము యోసేపు వచ్చుసరికి కానుకలు సిద్ధముచేసి ఉంచిరి.
26. యోసేపు ఇంటిలోనికి వచ్చిన తరువాత వారతనికి సాష్టాంగ నమస్కారములు చేసిరి. తాముతెచ్చిన కానుకలు సమర్పించిరి.
27. యోసేపు వారి యోగక్షేమములు విచారించెను. “మీ ముదుసలి తండ్రిని గూర్చి చెప్పితిరి గదా? ఆయన క్షేమముగా ఉన్నాడా? ఇంకను బ్రతికియే ఉన్నాడా?” అని అడిగెను.
28. వారు “మీ దాసుడు, మా తండ్రి ఇంకను బ్రతికియే ఉన్నాడు. క్షేమముగనే ఉన్నాడు” అని చెప్పి సాగిలబడిరి.
29. యోసేపు తనతల్లి కడుపున పుట్టిన తమ్ముడు బెన్యామీనును జూచి "మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని వారిని ప్రశ్నించెను. తమ్మునివైపు తిరిగి "కుమారా! దేవుడు నిన్ను కరుణించునుగాక!" అనెను.
30. సోదరానురాగము యోసేపును ముంచెత్తెను, అతని కన్నులలో గిఱ్ఱున నీరుతిరిగెను. కన్నీరాపుకొన జాలక లోపలికి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చెను.
31. తరువాత ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చెను. అనురాగమును ఎట్లో బిగబట్టి భోజనము వడ్డింపుడని సేవకులకు ఆనతిచ్చెను.
32. సేవకులు యోసేపునకు వేరుగా, అతని సోదరులకు వేరుగా వడ్డించిరి. యోసేపుతో భుజించు ఐగుప్తుదేశీయులకు విడిగా వంచిరి. ఐగుప్తుదేశీయులు హెబ్రేయులతో కూడి భోజనముచేయుట హేయముగా భావింతురు.
33. సేవకులు యోసేపు సోదరులను పెద్దవాని నుండి చిన్నవాని వరకు ఈడునుబట్టి, అతనికెదురుగనే వరుసగా కూర్చుండబెట్టిరి. వారు ఒకరి మొగమొకరు చూచుకొని విస్తుపోయిరి.
34. యోసేపు తన ముందు ఉన్న ఆహారపదార్థములను తీసి అన్నదమ్ములకు పంచిపెట్టెను. బెన్యామీను వంతు వచ్చినది ఇతరులకు వచ్చిన దానికంటే ఐదురెట్లెక్కువ. ఈ విధముగా వారెల్లరు యోసేపుతో భోజనము చేసిరి. సంతృప్తిగా పానీయములు సేవించిరి.