ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 42 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 42వ అధ్యాయము

 1. యాకోబు ఐగుప్తుదేశములో ధాన్యమున్నదని వినెను. తన కుమారులను పిలిచి “మీరెందుకు ఒకరి మొగమొకరు చూచుకొనుచు నిలబడితిరి?

2. ఐగుప్తుదేశమున కావలసినంత ధాన్యమున్నదని వింటిని. వెళ్ళి ధాన్యముకొని తీసికొని రండు. అట్లయినగాని మన ప్రాణములు నిలువవు. లేనిచో మనము చత్తుము” అనెను.

3. అంతట యోసేపు సోదరులు పదుగురు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము వెళ్ళిరి.

4. కానియాకోబు యోసేపునకు సొంత తమ్ముడైన బెన్యామీనును మాత్రము అన్నలవెంట పంపలేదు. అతనికి ఏ అపాయమైన సంభవించునేమో నని తండ్రి భయపడెను.

5. కనానులోకూడ కరువు వచ్చుటచే ఇతరులతో పాటు యిస్రాయేలు కుమారులుకూడ ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశము వచ్చిరి.

6. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారికదా! దేశ ప్రజలకందరకును ధాన్యము అమ్మెడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి.

7. అతడు సోదరులనుచూచి గుర్తుపట్టెను. కాని గుర్తు పట్టనట్లు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. “మీరు ఎక్కడినుండి వచ్చితిరి?” అని యోసేపు వారి నడిగెను. వారు అందులకు “ధాన్యము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమి” అని చెప్పిరి.

8. యోసేపు సోదరులను గుర్తుపట్టెను కాని, వారతనిని గుర్తుపట్టలేకపోయిరి.

9. యోసేపు వారిని గూర్చి కన్నకలలను కూడ జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు వారితో “మీరు గూఢచారులు. మా దుర్గముల లోటు పాటులు తెలిసికొనుటకు వచ్చితిరి” అనెను.

10. వారు “లేదు ప్రభూ! మీ దాసులమైన మేము ధాన్యము కొనుటకు వచ్చితిమి.

11. మేమందరము ఒక తండ్రి బిడ్డలము. ఏలినవారి దాసులమైన మేము ఋజు వర్తనులము కాని గూఢచారులముకాము” అనిరి.

12. “కాదు మీరు మా దేశము లోగుట్టు తెలిసికొనుటకే వచ్చితిరి” అని యోసేపు అనెను.

13. వారు “ప్రభూ! మేము అన్నదమ్ములము పండ్రెండుమందిమి. ఒక తండ్రి బిడ్డలము, కనాను దేశీయులము. మాలో కడగొట్టువాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. మరొకడు లేడు” అని చెప్పిరి.

14. యోసేపు మరల వారితో “మీరు చెప్పునది నిజముకాదు. నేను చెప్పినట్టుగా మీరు గూఢచారులే.

15. దీనితో మీ యదార్థత బయటపడును. మీ కడగొట్టు తమ్ముడు ఇక్కడికి రానిచో మీరు ఇక్కడినుండి కదలుటకు వీలులేదు. ఫరోరాజు ప్రాణములమీద ఒట్టు.

16. మీ తమ్ముని తీసికొనివచ్చుటకు మీలో ఒకనిని పంపుడు. మిగిలినవారు చెరసాలలో ఉండుడు. అప్పుడుగాని మీమాటలలోని నిజముతేలదు.

17. ఫరో జీవము తోడు. దీనికి అంగీకరింపకున్న మీరు నిక్కముగా గూఢచారులే” అని చెప్పి వారినందరిని మూడురోజులపాటు చెరలో ఉంచెను.

18. మూడవ రోజున యోసేపు సోదరులతో “నేను చెప్పినట్టుచేసిన, మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతిగలవాడను.

19. మీరు సత్యవంతులమందురా! మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి యుండును. మిగిలినవారు ఆకటితో అల్లాడిపోవుచున్న మీ కుటుంబముల కరువు తీర్చుటకై ధాన్యమును తీసికొనిపోవచ్చును.

20. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసికొనిరండు. ఇట్లయిన మీరు చెప్పినమాటలు నిజమని ఋజువగును. మీ ప్రాణములు దక్కును” అనెను. వారు ఆ విధముగనే చేసిరి.

21. ఈ మాటలువిని వారు “మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే. సందేహము లేదు. వాడు మనలనెంతో బతిమాలెను. వాని బాధను కనులార చూచియు, వానిమొరను పెడ చెవిని పెట్టితిమి. దానికి ఫలముగా, ఇప్పుడు మన ప్రాణముల మీది కొచ్చినది” అని తమలో తామను కొనిరి.

22. అంతట రూబేను “చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తినోరుకొట్టుకొని చెప్పలేదా? కాని మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమై పోవలసినదే” అనెను.

23. యోసేపు ఒక ద్విభాషిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తాము అనుకొన్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి.

24. యోసేపు అవతలికిపోయి కన్నీరు కార్చెను. తిరిగివచ్చి వారితో మాట్లాడెను. వారు చూచుచుండగనే షిమ్యోనును పట్టుకొని కట్టివేసెను.

25. ఆ తరువాత వారి గోతాలను ధాన్యముతో నింపవలయుననియు, ఎవరి రూకలను వారి గోతాలలో అట్టిపెట్టవలెననియు, వారి ప్రయాణమునకై ఆహార పదార్థములను సమకూర్పవలెననియు యోసేపు సేవకులకు కట్టడచేసెను. అతడు ఆజ్ఞాపించి నట్లే జరిగెను.

26. అతని సోదరులు గోతాలను గాడిదల మీదికెత్తించుకొని వెళ్ళిపోయిరి.

27. రాత్రికి వారు ఒకచోట విడిదిచేసిరి. వారిలో ఒకడు గాడిదకు మేత పెట్టుటకై గోనెసంచిని విప్పెను. గోనె మూతి దగ్గరనే అతని రూకలు కనబడెను.

28. అతను మిగిలిన వారితో “నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసిరి. ఇదిగో! నా గోనెసంచిలోనే ఉన్నది” అని చెప్పెను. వారికి గుండెచెదిరి వణుకుపుట్టెను. “దేవుడు మనకెంత పని చేసెను!” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. .

29. వారు కనానుదేశము చేరి తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్టు చెప్పిరి.

30.“ఆ దేశాధిపతి మాతో పరుషముగా మాట్లాడెను. మేము వేగులవారమని అనుకొనెను.

31. 'మేము ఋజువర్తనులమే కాని గూఢచారులముకాము.

32. పండ్రెండుమంది అన్నదమ్ములము. ఒక తండ్రి బిడ్డలము. కడగొట్టు తమ్ముడు కనాను దేశమున మా తండ్రికడ ఉన్నాడు. మరియొకడు చనిపోయెను' అని చెప్పితిమి.

33. కాని ఆ దేశాధిపతి మీరు సత్య వంతులో సత్యవంతులుకారో తెలిసికొందును. మీలో ఒకనిని నా దగ్గర వదలిపెట్టుడు. మిగిలిన వారు ఆకలితో అల్లాడుచున్న మీ కుటుంబములకు ధాన్యమును తీసికొని వెళ్ళుడు.

34. మీ కడగొట్టు తమ్ముని నా కడకు తీసికొనిరండు. ఇట్లయినగాని మీరు విశ్వాస పాత్రులనియు, గూఢచారులుకారనియు ఋజువు కాగలదు. ఆనాడు మీ సోదరుని మీకు అప్పగింతును. మీరు మా దేశమున స్వేచ్ఛగా వర్తకము చేసికొనవచ్చునని పలికెను” అని చెప్పిరి.

35. వారు గోనెసంచులను కుమ్మరించిరి. ఎవరి డబ్బులమూట వారి గోనెలలోనే ఉండెను. ఆమూటలు చూచి ఆ తండ్రీకుమారులు భయపడిరి.

36. యాకోబు వారితో “మీరు నా బిడ్డలను బ్రతుకనీయరు. యోసేపు లేడు. షిమ్యోను లేడు. ఇప్పుడు బెన్యామీనును కూడ నాకు దక్కకుండా చేయుచున్నారు. ఇదంతయు నాకెదురుతిరిగి నడుచుచున్నది” అనెను.

37. అంతట రూబేను తండ్రితో “నేను తమ్ముని తిరిగితీసికొనిరానిచో నా కుమారులిద్దరిని చంపివేయుము. వానిని నాకు అప్పగింపుము. నేనే వానిని తిరిగి తీసికొనివత్తును” అని చెప్పెను.

38. కాని యాకోబు “నా కుమారుడు మీ వెంటరాడు. వాని అన్న చనిపోయెను. ఇక మిగిలినది వీడు ఒక్కడే. దారిలో వానికి ఏ హానియైన కలిగినచో తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే” అనెను.